జనసేన లిట్మస్ టెస్ట్ కి రెడీ ?

ఇక ఏపీలో చూస్తే జనసేన పూర్తి ఫోకస్ పెడుతోంది. జనసేనను క్షేత్ర స్థాయిలో మరింతగా పటిష్టం చేయాలని అనుకుంటోంది.

Update: 2026-06-26 18:32 GMT

జనసేన ఏపీలో మూడవ బలమైన రాజకీయ శక్తిగా ఆవివిర్భవించడానికి చూస్తోంది. కూటమిలో ఉంటూనే తన బలాన్ని పెంచుకోవాలని అనుకుంటోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏపీ లోపలా బయటా ఇటీవల జరిగిన పలు సంఘటనలు జనసేన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణాలో జనసేన రీ ఎంట్రీకి రంగం సిద్ధం చెసుకుంటున్న వేళ అక్కడి రాజకీయ ప్రత్యర్ధులు చేసిన విమర్శలు కూడా పార్టీలో కసిని పెంచుతున్నాయని అంటున్నారు. అందుకే జనసేన తెలంగాణా ఆఫీసుని అక్కడ ఏర్పాటు చేశారు. అంతే కాదు సంస్థాగతంగా పార్టీని తెలంగాణాలో విస్తరించాలని నిర్ణయించారు.

ఏపీలో ఫుల్ ఫోకస్ :

ఇక ఏపీలో చూస్తే జనసేన పూర్తి ఫోకస్ పెడుతోంది. జనసేనను క్షేత్ర స్థాయిలో మరింతగా పటిష్టం చేయాలని అనుకుంటోంది. అందుకోసం పార్టీ పరిశీలకులుగా ప్రతీ జిల్లాలోనూ సీనియర్ నేతలను నియమించింది. ఇక ఈ జిల్లా పరిశీలకుల కమిటీలో ఆ జిల్లాకు చెందిన కీలక నేతలను సభ్యులుగా తీసుకుంది. వీరంతా జనసేనలో చురుకుగా పనిచేస్తున్న నాయకులను గుర్తిస్తారు. వారికి రానున్న రోజులలో పార్టీ పదవులు ఇస్తుందని చెబుతున్నారు. అంతే కాదు వారినే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కూడా పచ్చ జెండా ఊపుతారు అని అంటున్నారు.

స్నేహపూర్వక పోటీలు :

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పట్టుదలగా తీసుకుంటోంది. ఎందుకంటే ఇక్కడ గెలిచి మండల అధ్యక్షులుగా జెడ్పీటీసీలుగా కార్పోరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా గెలిచిన వారు మూడేళ్ల పాటు తమ బలం మరింతగా పెంచుకుంటే 2029 ఎన్నికల్లో వారినే ముందు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్ధులుగా తీసుకోవడానికి కూడా జనసేన ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కూటమితో పొత్తులు ఉంటూనే బలమున్న చోట స్నేహ పూర్వక పోటీలకు కూడా జనసేన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఊహాగానాలు అయితే సాగుతున్నాయి. అంటే జనసేన మొత్తం బలం ఎంత నేతలకు ఉన్న పట్టు ఎంత జనాల నుంచి ఆదరణ ఎంత పార్టీకి పెరిగిన ఓట్ల శాతం ఎంత ఇవన్నీ కూడా జనసేన స్థానిక ఎన్నికల ద్వారా పరిగణనలోకి తీసుకుని లోతైన అధ్యయనం చేస్తుంది అని అంటున్నారు.

సొంతంగా ఎదడానికేనా :

ఒక విధంగా స్థానిక ఎన్నికలను జనసేన లిట్మస్ టెస్ట్ గా భావిస్తోంది అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చూపించిన నాయకులని చేరదీయడమే కాదు భవిష్యత్తు నాయకులుగా వారికి గుర్తింపు ఇస్తూ ప్రోత్సహించాలని జనసేన పెద్దలు అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పొత్తులో ఉన్నప్పటికీ 2024 ఎన్నికల్లో జనసేనకు ఏకంగా 14 శాతం దాకా ఓట్లు లభించాయని అంచనా ఉంది. దానిని మరింతగా పెంచుకోవాలని జనసేన చూస్తోంది. 2029 ఎన్నికలను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని కూడా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన తన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సరైన వేదికగా భావిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి జనసేన ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిని జనసేన గట్టి పట్టుదలతో తీసుకుంటోంది. అనూహ్య విజయాలను సాధించడమే కాదు తమ పట్ల జనాభిప్రాయం ఏమిటి అన్నది కొలమానంగా పెట్టుకుని భవిష్యత్తు కార్యచరణకు సిద్ధపడుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News