ఆమెకు ఎంతటి ఆశ...తల్లి ఒడిలో కన్ను మూయాలని!
ఇదిలా ఉంటే దేశంలోని పౌరసత్వ చట్టాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు.
భారతీయుడిగా జన్మించు, జీవించు, గర్వించు అని మహనీయులు చెబుతారు. ఏ దేశం వెళ్ళినా భౌతిక వాదం బలంగా ఉండొచ్చు, భౌతిక సుఖాలు అద్భుతంగా ఉండొచ్చు కానీ ఆధ్యాత్మిక భావనతో కూడిన జవాబు సంపూర్ణమైన సమాధానం మాత్రం భారత్ లోనే లభిస్తాయి. ఇతర దేశాలలో లేనిది భారతీయ గడ్డ మీద ఉన్నది అదే. అందుకే భారత్ ని పుణ్యభూమి ధన్యభూమి అని అంటారు. తన విధుల కోసం ఉన్నతమైన ఉధ్యోగ ఉపాధి అవకాశాల కోసం దేశాలు పట్టుకుని పోయినా చిట్ట చివరి మజిలీగా తిరిగి మాతృభూమినే ఎంచుకోవాలని పెద్దలు చెబుతారు. అలా తనకు జన్మనిచ్చిన గడ్డ మీదనే జీవితాన్ని ముగించాలని ఒక పండుటాకు పరితపిస్తోంది. ఈ మేరకు ఆమె చేసుకున్న అభ్యర్ధన అందరికీ ఆలోచనలలో పడేయడమే కాదు భారతదేశం అంటే ఏమిటో తెలియచెబుతోంది.
పౌరసత్వం పునరుద్ధరించాలని :
ఆమె పేరు కొండ్రగుంట మహాలక్ష్మమ్మ వయసు 94 ఏళ్ళు. ఆమె సొంత ఊరులో కన్నుమూయాలని అనుకుంటోంది. అందుకే తన భారతీయ పౌరసత్వం పునరుద్ధరించాలని ఆమె కోరుకుంటోంది. ఈ మేరకు ఆమెకు సంబంధించిన అభ్యర్ధన మీద బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లోని జీజీ ఆర్ ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ సమక్షంలో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన వివరాలు తెలిసాయి. కొండ్రగుంట మహాలక్ష్మమ్మది స్వస్థలం చినగంజాం మండలంలోని చింతగుంపాల గ్రామం. అధికారులు తెలియచేసిన వివరాల ప్రకారం చూస్తే ఆమె తన భర్త నాగభూషణం మరణం తర్వాత అమెరికాకు వెళ్లారు.
ఇక్కడే ఉండాలని :
ఇక ఆమె అమెరికాలో తన కుమారుడు, ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ కె. బుచ్చయ్య చౌదరితో కలిసి చాలా కాలం అక్కడ నివసించారు. దాంతో 2000 జూలై నెలలో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు విదేశాల్లో గడిపిన తర్వాత కొండ్రగుంట మహాలక్ష్మమ్మ 2018లో భారతదేశానికి తిరిగి వచారు. ఆ మీదట ఆమె తన సొంత గ్రామంలో స్థిరపడ్డారు. తిరిగి వచ్చినప్పటి నుండి కూడా ఆమె ఇక్కడే ఉంటాను అని అంటున్నారు. అందుకే ఆమె తన అమెరికా పౌరసత్వాన్ని పూర్తిగా వదులుకుని భారతీయ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం జరగడానికి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారం ఆమె ఒక అధికారి సహాయంతో తెలుగులో విధేయతా ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని, ఒక పౌరురాలిగా తన బాధ్యతలను నెరవేరుస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
అంతా కలెక్టర్ సమక్షంలో :
భారతీయులుగా మనమందరం ఎంతో హాయిగా జన్మతహా పౌర సత్వం కలిగి ఉంటాం, కానీ ఒక్కసారి దానిని కోల్పోతే తిరిగి పునరుద్ధరించుకోవడం పెద్ద ప్రక్రియగా ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన ప్రమాణ స్వీకారం తర్వాత జిల్లా సిబ్బంది ధృవీకరణ కోసం అధికారిక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాలైన చట్టపరమైన లాంఛనాలలో భాగంగా నిర్ణీత స్థలాలలో సంతకం చేస్తారు. ఈ విధంగా మహలక్ష్మమ్మ విధేయతా ప్రమాణం కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో విజయవంతంగా పూర్తయిందని జిల్లా అధికారి ఆంగ్లంలో ప్రకటించడంతో ఈ ప్రక్రియ మొత్తంగా ముగిసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
రెండు పౌరసత్వాలు :
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహాలక్ష్మమ్మ వద్ద ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా హోదా అమెరికా పౌరసత్వం రెండూ ఉన్నాయి. అయితే తాను చివరి రోజులు పూర్తిగా భారతీయురాలుగానే గడపాలని భావించిన మహాలక్ష్మమ్మ ఇక్కడే కన్నుమూయాలనే బలమైన కోరికను వ్యక్తం చేయడంతో ఆమె ఈ ప్రక్రియ మొత్తంలో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం ఆ ప్రక్రియకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేశామని అంధికారులు చెబుతున్నారు. ఇక మహాలక్ష్మమ్మకు సంబంధించిన ఆమె దరఖాస్తుని నివేదికను ఆమోదం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు జిల్లా అధికారులు పంపారు. ఈ విధంగా ఒక వృద్ధ్న మహిళ తనకు భారతీఎయ పౌర సభ్యత్వం పునరుద్ధరించాలని కోరుతూ వ్యయ ప్రయాసలు పడడం అందరి హృదయానికి హత్తుకునే భావోద్వేగభరితమైన సన్నివేశాలుగా అధికారులు చెబుతున్నారు.
ఇది అందరికీ స్పూర్తిదాయకం :
ఇదిలా ఉంటే దేశంలోని పౌరసత్వ చట్టాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. ఇక తుది నిర్ణయం ఇప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేతిలో ఉందని కలెక్టర్ వెల్లడించారు. తొందరలో మహాలక్ష్మమ్మ పౌరసత్వం పునరుద్ధరణ జరుగుతుంది. అయితే ఇది ఆమె ఒక్క భావోద్వేగమే కాదు మొత్తం కోట్లాది మందికి చెందినది అని చెప్పాలి. ఉద్యోగ ఉపాధి కోసం ఎక్కడికైనా వెళ్ళండి. కానీ పుట్టిన గడ్డ మీదనే కన్ను మూయడం కంటే స్వర్గం వేరొకటి లేదు అన్నది మహాలక్ష్మమ్మ కధ తెలియచేస్తోంది. ఇది అందరికీ స్పూర్తిదాయకం కూడా. ఈ రోజునల్లో ఎక్కువ మంది భారతీయ పౌరసత్వం వదులుకుంటున్నారు. వారికి ఈ ఘటన ఒక కనువిప్పు అని కూడా చెప్పాల్సి ఉంటుంది.