అంబటి సారధ్యం వైసీపీకి ప్లస్ అవుతుందా ?

ఇదిలా ఉంటే అంబటి రాంబాబు వైసీపీలో కేవలం సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, బలమైన కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు.

Update: 2026-06-26 17:21 GMT

వైసీపీలో నోరున్న పేరున్న నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన ఏడు పదుల వయసు చేరువలో ఉన్నారు. ఆయన తొలిసారి 1989లో ఎమ్మెల్యే గెలిచారు. కానీ 2023లో కానీ మంత్రి కాలేదు. 2019 దాకా అంటే మూడు దశాబ్దాల పాటు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచినది కూడా లేదు. ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో వైఎస్సార్ అనుచరుడిగానే ఎదిగారు. ఇక ఆయన అంతకు ముందు విద్యార్ధి ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇక వైఎస్సార్ తరువాత వైసీపీని ఎంచుకుని ఆయన జగన్ కి వీర విధేయుడిగా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో ఎవరి తీరు ఎలా ఉన్నా జగన్ అంటే అత్యంత విశ్వాసం అంబటి చూపిస్తారు అని పేరు. అందుకే జగన్ సైతం ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. 2014 నుంచి మూడు సార్లు ఆయనకు టికెట్ ఇచ్చిన జగన్ 2019 ఎన్నికల కోసం గుంటూరు పశ్చిమ నియోజక వర్గాన్ని కేటాయించారు.

ఆ లోటు తీరుస్తారా :

ఇదిలా ఉంటే అంబటి రాంబాబు వైసీపీలో కేవలం సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, బలమైన కాపు సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంటి మీద ఎపుడైతే దాడి జరిగిందో నాటి నుంచి అంబటి రాజకీయం స్టైల్ మారింది. ఆయన కాపుల గొంతుకగా మారడానికి చూస్తున్నారు. వైసీపీ కూడా సరైన నాయకుడు ఉంటే కాపుల మద్దతు అందుకోవాలని చూస్తోంది. ఇక ముద్రగడ పద్మనాభం వంటి దిగ్గజ నేత వైసీపీలో ఉన్నారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాంతో ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అన్న ఆలోచన అధినాయకత్వం చేస్తున్నపుడు అంబటి ఇంటి మీద దాడి జరగడం అది రాష్ట్ర స్థాయిలో పెద్ద అంశంగా మారడంతో జగన్ స్వయంగా అంబటి ఇంటికి వచ్చి కాపుల టైగర్ అని అభివర్ణించారు. ఆ తరువాత జైలు నుంచి విడుదల అయి వచ్చిన అంబటి కాపుల సమస్యల మీదనే ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఆయనకు ఈ విషయంలో జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

పాదయాత్రకు సైతం :

ఇదిలా ఉంటే అంబటి రాంబబు జూలై 29 నుంచి రెండు రోజుల పాటు వినతి పాదయాత్ర పేరుతో గుంటూరులోని తన ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్ దాకా భారీ పాదయాత్ర చేపడతారు అని చెబుతునారు. తనను అక్రమంగా అరెస్టు చేశారు అన్న దాని మీద తన నివాసం మీద అక్రమంగా దాడికి పాల్పడిన వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ వినతి పాదయాత్రను అంబటి చేపట్టనున్నారు. తానే స్వయంగా డీజీపీకి ఈ విషయం మీద వినతి పత్రం ఇస్తాను అని అంబటి అంటున్నారు. అంతే కాదు తన ఇంటి మీద దాడి జరిగినపుడు ఉదాశీనంగా వ్యవహరించిన సంబంధిత పోలీసు అధికారులపై తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని అంబటి గట్టిగా చెబుతున్నారు.

ఆ ఇష్యూని అలాగే :

ఇక తన ఇంటి మీద దాడి తనను జైలులో వేయడం వంటి అంశాలను సజీవంగా ఉంచడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గం మద్దతుని మరింతగా పొందాలన్న వ్యూహాన్ని అంబటి అమలు చేస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే రౌడీషీటర్ గాదె సాయి కృష్ణ కస్టడీ మరణంపై కూడా అంబటి గట్టిగా మాట్లాడుతున్నారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిజాన్ని వెలికితీయడానికి బదులుగా మాజీ కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును కాపాడటానికి ప్రయత్నిస్తోందని అంబటి ఆరోపించడం విశేషం. అందువల్ల నిష్పక్షపాత విచారణ కోసం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సాయి క్రిష్ణ కుటుంబాన్ని మొదట పరామర్శించింది కూడా అంబటి కావడం విశేషం. మొత్తానికి వైసీపీ నుంచి కాపుల వాయిస్ గా అంబటి ఎదగడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News