సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో ఏపీ పోలీసులకు భారీ షాక్..

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పెద్ద పరీక్షగా మారింది.

Update: 2026-06-27 05:12 GMT

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టడీ మరణం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పెద్ద పరీక్షగా మారింది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతుండగా.. తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) జోక్యం చేసుకోవడం కేసుకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. కేవలం వివరణ కోరడానికే కాకుండా.. పోలీసుల చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని కమిషన్ ఆదేశించడం గమనార్హం.

తెలంగాణకు చెందిన మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు ఆధారంగా కేసును పరిశీలించిన ఎన్.హెచ్.ఆర్.సీ.. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం.. SIT నివేదికల ప్రకారం అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు కేసుకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలను కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ వ్యవహారం. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. అవసరమైతే డిలీట్ అయిన ఫుటేజీని సాంకేతికంగా రికవర్ చేయాలని కూడా సూచించింది. దీంతో విచారణలో డిజిటల్ ఆధారాల పాత్ర కీలకంగా మారింది.

మరోవైపు సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసి అస్థికలను నదిలో కలిపేశారన్న ఆరోపణలపై కూడా ఎన్.హెచ్.ఆర్.సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైతే అస్థికలను వెలికితీసి ఫోరెన్సిక్ పరంగా పరిశీలించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర అధికారులకు సూచించింది. ఇది కేసు దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్లే సూచనగా భావిస్తున్నారు.

బాధితుడి తల్లి గాదె విజయలక్ష్మికి వెంటనే భద్రత కల్పించాలని కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రస్తుత పరిస్థితి, నిందితులపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి అందించిన పరిహారం, దర్యాప్తు పురోగతి వంటి అన్ని అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇప్పటికే ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు సిట్ విచారణలో భాగంగా రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్.హెచ్.ఆర్.సీ తాజా జోక్యంతో ఈ కేసు ఇక రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

"జీవించే హక్కు" రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని గుర్తుచేసిన ఎన్.హెచ్.ఆర్.సీ.. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలే చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. అందువల్ల కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది.

ఎన్.హెచ్.ఆర్.సీ ఇచ్చిన వారం రోజుల గడువులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సమర్పించే నివేదిక ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.

Tags:    

Similar News