10 లక్షల ఏఐ ఉద్యోగాలు.. కానీ 16 శాతం మందికే ఏఐ నైపుణ్యాలు!
ఇంజినీరింగ్ డిగ్రీ చేతికొచ్చింది.. కళ్లల్లో వేయి ఆశలతో హైదరాబాద్.. బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న వేలాది మంది యువతీ యువకులు.
ఇంజినీరింగ్ డిగ్రీ చేతికొచ్చింది.. కళ్లల్లో వేయి ఆశలతో హైదరాబాద్.. బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న వేలాది మంది యువతీ యువకులు. రోజుల తరబడి రెజ్యూమ్‌లు పట్టుకుని.. నైట్ షిఫ్టులు చేస్తూ.. తమ కళ్లను కంప్యూటర్ స్క్రీన్లకు అంకితం చేసిన ఎంతోమంది ఐటీ నిపుణులు. కానీ ఈరోజు వారందరి మనస్సులో ఒకే ఒక భయం.. "రేపు నా ఉద్యోగం ఉంటుందా?" ఇదే ఇప్పుడు కలవరపెడుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. భారత్‌లో ఏకంగా 10 లక్షల ఏఐ ఉద్యోగాలు తలుపు తడుతున్నాయి. కానీ విచారకరమైన నిజమేమిటంటే.. అందులో అడుగుపెట్టే అర్హత, నైపుణ్యం మనదేశంలో కేవలం 16 శాతం మందికి మాత్రమే ఉంది. ఎంతటి దారుణమైన పరిస్థితి ఇది? అవకాశాలు మన ముందే కొండంతలా కనిపిస్తున్నా వాటిని అందుకోలేక కోట్లాది మంది యువత నిస్సహాయంగా నిలబడిపోతోంది.
ఆశల పల్లకి.. కానీ దారి పొడవునా లోయలే!
టీమ్ లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదిక ప్రకారం.. జెన్ ఏఐ రంగంలో ఏకంగా 53 శాతం, క్లౌడ్ టెక్నాలజీలో 60 శాతం, సైబర్ సెక్యూరిటీలో 30 శాతం మేర నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత వేధిస్తోంది. ఒకవైపు హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఏఐ, జెన్ ఏఐ నిపుణులకు ఏటా 30 నుండి 35 లక్షల రూపాయల వరకు భారీ వేతనాలు ఆఫర్ చేస్తున్నారు. జీసీసీ ఆఫీస్ లీజింగ్‌లో హైదరాబాద్ 16.8 శాతం వాటాతో గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది. కానీ ఆ ఫలాలను అందుకోవాల్సిన మన యువత మాత్రం ఎక్కడో వెనుకబడిపోతోంది.
యువత శిక్షణ కోర్సులు చేయడం లేదు అని అనలేం. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి ప్రాజెక్టుల్లో లక్షలాది మంది సర్టిఫికెట్లు పొందుతున్నారు. కానీ సర్టిఫికెట్ కాగితం మీద ఉంది.. చేతిలో నైపుణ్యం మాత్రం ఉండటం లేదు. కోర్సు పూర్తి చేయడానికీ నిజమైన ప్రపంచంలో ఒక ఏఐ మోడల్‌ను ప్రొడక్షన్ స్థాయిలో నిర్మించి.. సెక్యూరిటీ అందించి నిర్వహించడానికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
మారుతున్న కాలం.. ముంచుకొస్తున్న ముప్పు
మరోవైపు దశాబ్దాలుగా మనకు అండగా నిలిచిన మాన్యువల్ టెస్టింగ్, ప్రాథమిక సపోర్ట్, రిపోర్టింగ్ వంటి సంప్రదాయ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఆటోమేషన్ మింగేస్తోంది. ఫలితంగా ఉద్యోగం రాని ఫ్రైషర్ల కళ్లలో కన్నీళ్లు, భవిష్యత్తు ఏమవుతుందో తెలియని ఆందోళన నిండిపోతున్నాయి.
ఏఐ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. అదొక సువిశాల ప్రపంచం. డేటా, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రతి అంశంలోనూ ఆరితేరితేనే మన ఉనికి నిలుస్తుంది. కేవలం ఏఐ టూల్స్ వాడటం నేర్చుకుంటే సరిపోదు.. ఏఐ వ్యవస్థలను సృష్టించే నడిపించే, కాపాడే స్థాయికి మన యువత ఎదగాలి.
ఇకనైనా కళ్లు తెరవకపోయినా.. టెక్నాలజీతో పాటు మన నైపుణ్యాలను మార్చుకోకపోయినా.. కళ్లముందే అవకాశాల అమృతం ఉన్నా.. ఆకలితో అలమటించక తప్పదు.. ఇది కేవలం ఐటీ రంగానికి హెచ్చరిక కాదు.. ప్రతి భారతీయ యువకుడి భవిష్యత్తుకు సంబంధించిన జీవన్మరణ సమస్య.