విశాఖ వైపుగా ఆర్నాబ్...ఏ తీరం దాటేను ?

మొదట గంటకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంగా సగుతూ వచ్చిన ఆర్నాబ్ ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది.

Update: 2026-10-26 18:22 GMT

ఆర్నాబ్ భారీ తుఫాన్ గా మారింది. అది కాకినాడ దగ్గర ఒక కాలు మరో కాలు విశాఖ వైపుగా వేసి వేగంగా సాగుతోంది. దీంతో ఏపీ కోస్తాకు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఈ నెల 27, 28 తేదీలు పరీక్షా సమయంగా మారుతున్నాయి. ఈ రెండు రోజులలోనూ ఉత్తరాంధ్రా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి సమయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అర్నాబ్ అవతరించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుపాను హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది.

అతి వేగంతో ఆర్నాబ్ :

మొదట గంటకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంగా సగుతూ వచ్చిన ఆర్నాబ్ ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ఇది 15.8° ఉత్తర అక్షాంశం 86.8° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిషాలోనికి గోపాల్‌పూర్ కు ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, ఏపీలోని విశాఖపట్నంకు తూర్పు-ఆగ్నేయంగా 430 కిలో మీటర్లు, కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, మచిలీపట్నంకు తూర్పున 610 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పున 680 కిలోమీటర్లు, అండమాన్ దీవులలోని శ్రీవిజయ పురంకు వాయవ్యంగా 790 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది మంగళవారం ఉద్యానికి మరింత బలపడి, అదే ప్రాంతంలో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 27 సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, ఆ తర్వాత వాయవ్య దిశగా మళ్లి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

అంచనా అయితే ఇదీ :

ఇక ఆర్నాబ్ తీవ్ర తుఫానుగా మారిన తరువాత ఒక్కసారిగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. మిగిలిన కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే దక్షిణ ఒడిషాలో కూడా దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 28న ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్యలో బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు బలంగా వీస్తాయని అంటున్నారు. దాంతో రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రానున్న రెండు రోజులు విశాఖ సహా ఉత్తరాంధ్రకు రెడ్ అలెర్ట్ జారీ చేస్తున్నారు. అయితే ఆర్నాబ్ తుఫాన్ ఏ తీరం దాటుతుంది అన్నదే అతి పెద్ద చర్చగా అంతకంటే ఆందోళనగా ఉంది. హుదూద్ తుఫాన్ గతంలో ఏకంగా విశాఖ నగరాన్నే తాకి భారీ విధ్వంసం సృష్టించింది. ఆర్నాబ్ కూడా వేగంగా విశాఖ వైపు దూసుకుని వస్తోంది. దాంతో ఎక్కడ ఏ తీరం దాని లక్ష్యం అన్నదే అంతటా భయాన్ని రేపుతోంది.

Tags:    

Similar News