పైడితల్లి అమ్మ...రాజుల ఆడపడుచు ..ఒక విషాద గాథ !

ఇదిలా ఉంటే విజయనగరం గ్రామ దేవత అయిన శ్రీ పైడితల్లి అమ్మవారు విజయనగరం రాజుల ఆడపడుచు. ఆమె పేరు పైడిమాంబ.

Update: 2026-10-27 03:48 GMT

ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపుగా విజయనగరం గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మ వారిని అంతా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆమె దీవెనలు అందరికీ ఉండాలని మొక్కుతారు. ప్రతీ ఏటా దసరా పండుగ ముగిసిన మరుసటి మంగళవారమే అమ్మ వారి సిరిమానోత్సవం జాతర ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆశ్వీయుజ మాసంలో జరిగే అతి పెద్ద వేడుక ఇది. ఉత్తరాంధ్రాకే కాదు రాష్ట్రంలోనే ముఖ్యమైన జాతరలలో ఒకటిగా పైడితల్లి అమ్మ వారి సిరిమాను ఉత్సవాలు నిలుస్తాయి. పైడితల్లి అమ్మ వారి జాతర ఎంత ఉత్సాహంగా సాగుతుంది కానీ అమ్మవారి గురించిన కధ మాత్రం ఒక విషాదం. అంతే కాదు ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భంతో ముడిపడి ఉన్న గాధ.

రెండున్నర శతాబ్దాల క్రితం :

ఇదిలా ఉంటే విజయనగరం గ్రామ దేవత అయిన శ్రీ పైడితల్లి అమ్మవారు విజయనగరం రాజుల ఆడపడుచు. ఆమె పేరు పైడిమాంబ. గజపతి వంశానికి చెందిన విజయనగర రాజు విజయరామరాజు సోదరిగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. 1756–1757 సమయంలో విజయనగరానికి బొబ్బిలి కి మధ్య తీవ్ర మైన వైరం కొనసాగుతూ వచ్చింది. దాంతో యుద్ధం తప్పదన్న పరిస్థితి ఏర్పడింది. ఇక యుద్ధం అంటూ జరిగితే దాని వల్ల భారీ ప్రాణనష్టం జరుగుతుందని తనదైన దివ్య దృష్టితో గ్రహించిన పైడిమాంబ తన అన్న విజయరామరాజును యుద్ధానికి వెళ్లవద్దని గట్టిగానే వారించారు. అయితే చెల్లెలు పైడిమాంబ మాట వినకుండా యుద్ధానికి వెళ్ళిన విజయరామరాజు ఆ యుద్ధంలో మరణించడం జరుగుతుంది. దాంతో అన్న గారిని ఎంతగానో ప్రేమించిన పైడిమాంబ ఆయన ఇక లేడన్న వార్త విని తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు విడుస్తుంది.

గ్రామ దేవతగా :

అనంతరం పైడిమాంబ పాటివాడ అప్పలనాయుడు అనే సైనికుడి కలలో కనిపించి తన విగ్రహం పెద్ద చెరువుకు పశ్చిమ వైపున ఉందని చెప్పి అక్కడ ఆలయం నిర్మించమని కోరారు. అప్పటి నుండి ఆమె విజయనగరం ప్రజల ఇలవేల్పుగా గ్రామదేవతగా కొలవబడుతున్నారు. ఇలా ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం విజయనగరంలో ఘనంగా సిరిమాను ఉత్సవం నిర్వహిస్తారు. పైడితల్లి అమ్మవారి ఆలయంలో పూజారికి అమ్మవారు కలలో చెప్పిన తాను కోరిన వృక్షం నుండి మాత్రమే సిరిమానును తయారు చేయమని కోరుతారు. అలా అది తయారు చేసిన పూజారి దాని మీద ఊరేగి ఊరి జనం ముందు వస్తారు. భక్తులు అలా వచ్చే సిరిమాను రధాన్ని భక్తితో కొలుస్తారు.

రాష్ట్ర స్థాయి ఉత్సవంగా :

పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈసారి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రోటోకాల్ తగ్గింది. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి వంశీకురాలు అయిన అదితి గజపతిరాజు అమ్మ వారిని చీరె సారెను సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులతో వెచ్చించి విస్తరించి అభివృద్ధి చేశారు. ఇలా ఆలయం మరింతగా ఆధునీకరించాక జరుగుతున్న తొలి జాతర ఇదే కావడంతో భక్తులు అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక ఆర్నబ్ తుఫాన్ ప్రభావం జాతరను భయపెడుతోంది. అయితే ఎంతటి భారీ వర్షాలు కురిసినా అనుకున్న సమయానికి అమ్మ వారి సిరిమానోత్సవం గుడి నుంచి కోట వరకూ మూడు సార్లు క్రమం తప్పకుండా ప్రదక్షిణం చేస్తుంది. ఇది అనూచానంగా వస్తున్న ఆనవాయితీగా ఉంది. ఈసారి కూడా అలాగే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. తుఫాను ఇబ్బందులు కొంత తగ్గితే వేలాదిగా జనాలు వస్తారని భావిస్తున్నారు.

Tags:    

Similar News