స్థానిక పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు.. సీఎం ముందే స్పష్టం కేడర్ కు స్పష్టమైన సూచనలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు చాలెంజింగ్ గా మారిందని వ్యాఖ్యానించారు.

Update: 2026-10-27 07:31 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు చాలెంజింగ్ గా మారిందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం పెద్దగా కష్టపడలేదని కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మైక్రో మేనేజ్మెంట్ చేయాల్సివస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సర్దుబాటుపై కేడర్ కు నచ్చజెప్పాల్సివస్తోందని, టికెట్లు దక్కని వారికి మరోవిధంగా న్యాయం చేస్తామని, టికెట్లు దక్కని వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు.

పోటీ చాలా ఎక్కువగా ఉంది

స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలు పదవులపై చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. టీడీపీ 40 ఏళ్లుగా చాలా బలంగా ఉందని, అదేవిధంగా జనసేన పదేళ్ల నుంచి గట్టిగా పనిచేస్తోందని వివరించారు. ఇదే సమయంలో బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు కలిగి ఉందని, ఈ పరిస్థితుల్లో పదవుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోవాల్సివస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు పార్టీల నాయకులు కలిసి పనిచేయాల్సివుందని డిప్యూటీ సీఎం సూచించారు.

నిజంగా చాలెంజింగే..

స్థానిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ రోజు మధ్యాహ్నంతో ముగియనుండగా, కూటమి అగ్రనేతల సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు. మూడు పార్టీల నుంచి భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ముగ్గురు అగ్రనేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించి కేడర్ కు స్పష్టమైన సంకేతాలు పంపాలని నిర్ణయించారని అంటున్నారు. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు వేలాదిగా నామినేషన్లు పడటం, ఒక్కోస్థానం నుంచి ముగ్గురు నలుగురు నేతలు టికెట్లు ఆశించడం, మిత్రులకు కేటాయించిన సీట్ల నుంచి వేరే పార్టీ నేతలు నామినేషన్లు దాఖలు చేయడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సమన్వయం బాధ్యతలు జిల్లా నేతలకు అప్పగించినా పరిస్థితులు చక్కబడటం లేదని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సంయుక్త సమావేశం నిర్వహించి కేడర్ కు స్పష్టమైన సంకేతాలు పంపారని అంటున్నారు.

రెబెల్స్ తప్పుకోవాల్సిందే..

కూటమి నేతల ఉమ్మడి సమావేశం తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాస్థాయిలో బుజ్జగింపులకు దిగిరాని తిరుగుబాటు నేతలు అగ్రనేతల మీడియా సమావేశం తర్వాత ఆలోచన మార్చకుంటారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నామినేటెడ్ పదవులపై అగ్ర నేతల నుంచి హామీ లభిస్తే పరిస్థితిలో మార్పు రావొచ్చని అంటున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికలు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పెద్ద పరీక్షగా మారాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారని అంటున్నారు. ఇన్నాళ్లు క్షేత్రస్థాయి నేతల మనోగతం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం రాలేదని, ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పదవుల కోసం పోటీ పడటంతో వారి ఆలోచనలు ఏంటో జనసేనానికి అనుభవపూర్వకంగా తెలిసిందని అంటున్నారు. దీంతోనే మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త బెట్టు చేసిన పవన్ జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చాలా కష్టంగా ఉందని అంగీకరించారని అంటున్నారు.

Tags:    

Similar News