245 ఏళ్ల భూ వివాదానికి ముగింపు.. ఒక్క లేఖతో మారిన ఆరు తరాల వైరం
భూమి అంటే మనవాళ్లకు ప్రాణం. పొలంలో ఒక అడుగు ఎక్కువ తోగినా.. సరిహద్దు రాయి కాస్త పక్కకు జరిగినా చాలు.. ‘నీ రక్తమా? నా రక్తమా?’ అంటూ మన సినిమాల్లో ‘బాలయ్య’ లెవల్లో బట్టలు చింపుకోవడానికి రెడీ అయిపోతారు
భూమి అంటే మనవాళ్లకు ప్రాణం. పొలంలో ఒక అడుగు ఎక్కువ తోగినా.. సరిహద్దు రాయి కాస్త పక్కకు జరిగినా చాలు.. ‘నీ రక్తమా? నా రక్తమా?’ అంటూ మన సినిమాల్లో ‘బాలయ్య’ లెవల్లో బట్టలు చింపుకోవడానికి రెడీ అయిపోతారు. ఆస్తి తగాదాలు అంటే తరతరాలుగా వస్తున్న పవిత్రమైన ‘వారసత్వ హక్కు’ అనుకునే కుటుంబాలు మన దగ్గరే కాదు.. చైనాలోనూ పుష్కలంగా ఉన్నాయి.
షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్ నగరంలో డూ, ఝాంగ్ అనే రెండు పొరుగు కుటుంబాల మధ్య ఏకంగా 245 ఏళ్లుగా ఓ భూ వివాదం నడుస్తోంది. అవును మీరు విన్నది నిజమే.. 1781 నాటి కింగ్ రాజవంశం కాలం నాటి కాగితాలు పట్టుకుని.. ‘ఇది మా తాతల భూమి’ అని డూ వాళ్లు.. ‘కాదు మా ముత్తాతల స్థలం’ అని ఝాంగ్ వాళ్లు ఆరు తరాలుగా కొట్టుకుంటున్నారు. చైనాలో రాజులు మారారు.. విప్లవాలు వచ్చాయి.. ఆధునిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. చివరికి ప్రపంచాన్నే ఏలే స్థాయికి చైనా ఎదిగింది.. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ‘ఈగో’ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు.
ఇటీవల డూ కుటుంబం తమ వంటగదికి కాస్త పెద్ద గోడ కట్టడానికి రెడీ అవ్వడంతో ఈ పాత పంచాయితీ మళ్లీ కొత్తగా రాజుకుంది. "మీ గోడ వల్ల మాకు గాలి రాదు.. వెలుతురు రాదు.. అసలు ఆ జాగ మాది" అంటూ ఝాంగ్ కుటుంబం రచ్చకెక్కింది. మాటల యుద్ధాలు, తోపులాటలు, పోలీస్ స్టేషన్లు, పంచాయితీలు.. అబ్బో పెద్ద డ్రామానే నడిచింది.
చివరకు ఈ పంచాయితీ కోర్టుకి చేరింది. అయితే అక్కడ ఉన్న జడ్జిగారు పాత సర్వే రాళ్లు లెక్కపెట్టకుండా.. వీళ్లకు కాస్త ‘జ్ఞానోదయం’ చేయాలనుకున్నారు. కింగ్ రాజవంశం కాలంలో ‘ఝాంగ్ యింగ్’ అనే ప్రముఖుడు రాసిన ఒక పాత లేఖ సందేశాన్ని వీళ్లకు వినిపించారు. "కొద్దిపాటి నేల కోసం పక్కవాడితో పగ పెంచుకోవడం కంటే ఒక మూడు అడుగులు వెనక్కి తగ్గి శాంతిగా బ్రతకడం మేలు" అనేది ఆ లేఖ సారాంశం.
చిత్రంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయారో ఏమో గానీ ఆ చరిత్ర పాఠం వినగానే ఇరు కుటుంబాల్లో ఉన్న ‘ఈగో’ మంచులా కరిగిపోయింది. డూ వాళ్లు కాస్త తగ్గారు.. ఝాంగ్ వాళ్లు కాస్త సర్దుకున్నారు. సరిహద్దులు కుదిరాయి.. వంటగది నిర్మాణం పూర్తయింది.
245 ఏళ్లుగా ఆరు తరాల పాటు కోర్టులకు, పోలీసులకు పనికల్పించిన ఈ 'మహా సంగ్రామం' చివరకు ఒక చిన్న లేఖతో కొద్దిపాటి త్యాగంతో ముగిసింది. నిజమే మరి.. భూమి కోసం గోడలు ఎంతైనా కట్టొచ్చు.. కానీ మనుషుల మధ్య గోడలు బద్దలు కొట్టడానికి కాస్త 'విశాలమైన మనసు' ఉండాలి కదా... అదే జరిగిందిప్పుడు..