పని గంటలు, వీకెండ్లు పట్టించుకోని భారతీయులు.. వర్క్ కల్చర్‌పై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు!

రెండు రోజుల జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ నగరంలో ప్రవాస భారతీయులను కలుసుకున్న సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రతీ ఒక్కరి గుండెలను తాకింది.

Update: 2026-10-27 11:01 GMT

కన్నతల్లిని.. పుట్టిన గడ్డను వదిలి ఏడు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్లినా... గుండెల్లో భారతీయతను.. నరనరాల్లో నిండిన కష్టపడే తత్వాన్ని ఏమాత్రం కోల్పోరు మన భారతీయులు. సమయం ముగిసిపోయిందనో.. శని-ఆదివారాలు వచ్చేశాయనో నెపం చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవడాలు మన రక్తం లోనే లేవని.. శ్రమే ఊపిరిగా బతికే మనస్తత్వం భారతీయుల సొంతమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భావోద్వేగంగా ఆవిష్కరించారు.

రెండు రోజుల జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ నగరంలో ప్రవాస భారతీయులను కలుసుకున్న సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ప్రతీ ఒక్కరి గుండెలను తాకింది. పరాయి దేశంలో మనవాళ్లు సంపాదించుకున్న అపారమైన గౌరవం.. వారు చేస్తున్న నిశ్శబ్ద శ్రమ వెనుక ఉన్న త్యాగాలను ఆయన ఎంతో ఆత్మీయంగా స్మరించుకున్నారు. లోకంలో ఎన్నో దేశాల్లో చిన్నచిన్న విషయాలకే విద్వేషాలు.. ఆస్తుల ధ్వంసాలు చూస్తుంటామని.. కానీ అడుగుపెట్టిన నేలను పవిత్రంగా భావించి.. స్థానిక చట్టాలను గౌరవిస్తూ.. శాంతియుతంగా తమ కుటుంబాన్ని, ఆ దేశాన్ని ముందుకు నడిపించే విశాల హృదయం ఒక్క భారతీయ కుటుంబాలకే సొంతమని కొనియాడారు.

సొంతళ్లకు దూరమై.. కంటికి రెప్పలా కాపాడే అమ్మనాన్నల ప్రేమకు దూరమై ఉన్నత చదువుల కోసం జర్మనీ గడ్డపై అడుగుపెడుతున్న భారతీయ విద్యార్థుల బాధలను కూడా గోయల్ ఈ సందర్భంగా ఎంతో ఆర్ద్రతతో పంచుకున్నారు. కొత్త వాతావరణం, తెలియని భాష, ఉండటానికి ఇల్లు దొరకక.. పైసల్లేక నానా అవస్థలు పడే ఆ చిన్నారి ప్రాణాలకు జర్మనీలో ఇప్పటికే స్థిరపడిన ప్రవాస భారతీయులు ఒక కన్నతండ్రిలా.. కన్నతల్లిలా అండగా నిలవాలని కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన బిడ్డలకు చేయూతనందించి.. వారి కలలకు రెక్కల తొడగాలని పిలుపునిచ్చారు.

అయితే పనినే దైవంగా భావించి వారాంతాలను సైతం మరిచిపోయి శ్రమించే ఈ తత్వం భారతీయులకు గొప్ప పేరైతే తెచ్చిపెడుతోంది కానీ దశాబ్దాలుగా మనోళ్ల జీవన విధానంలో దాగున్న అలసటను.. వారు త్యాగం చేస్తున్న వ్యక్తిగత ఆనందాలను కూడా స్మరింపజేస్తోంది. ఎంత శ్రమించినా ఆరోగ్యం, కుటుంబంతో గడిపే సమయం కూడా అంతే ముఖ్యమని గుర్తుచేస్తూనే... ప్రపంచంలో భారతీయ జెండాను రెపరెపలాడిస్తున్న ప్రతి శ్రామికుడికి.. ప్రతి విద్యార్థికి పీయూష్ గోయల్ ఈ ప్రసంగం ద్వారా అందరం హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం.

Tags:    

Similar News