మంత్రి వర్గంలో నందమూరి వారసత్వం ఏదీ ?
నాలుగు దశాబ్దాల క్రితం అప్పటికి బలమైన రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ని ఓడించి కేవలం తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చిన వారు అన్న నందమూరి తారక రామారావు.
నాలుగు దశాబ్దాల క్రితం అప్పటికి బలమైన రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ని ఓడించి కేవలం తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చిన వారు అన్న నందమూరి తారక రామారావు. ఆయన ముఖ్యమంత్రిగా ఏడున్నరేళ్ళ పాటు పనిచేశారు. ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మూడు సార్లు ప్రభుత్వాన్ని స్థాపించారు. అలా నందమూరి తరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వర్ధిల్లింది. ఎన్టీఆర్ ఉన్న కాలంలో వారసులు అన్న ప్రశ్న వినిపించేది కాదు, అల్లుళ్ళు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నా కూడా చంద్రబాబు కాంగ్రెస్ నుంచే మంత్రిగా ఉన్న వారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే టీడీపీలో పునాదుల నుంచి ఉన్న వారు. అంతే తప్ప తన కుమారులను కుమార్తెలను ఎవరినీ ఎన్టీఆర్ వారసులుగా ప్రోత్సహించింది లేదు.
తొలిసారిగా చాన్స్ :
అయితే 1995 ఆగస్ట్ సంక్షోభం తరువాత సెప్టెంబర్ 1న ఏర్పడిన టీడీపీ కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆనాడు ఆయన మొత్తం కేబినెట్ మంత్రులలో నందమూరి హరిక్రిష్ణ కూడా ప్రమాణం చేయడం అప్పట్లో ఒక రాజకీయ సంచలనం. ఎందుకంటే హరిక్రిష్ణ మంత్రిగా ప్రమాణం చేసేనాటికి ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కాదు, అప్పటికి శాసనమండలిని రద్దు చేశారు. దాంతో ఆరు నెలలలోగా ఆయన ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉంది. అలా ఆయన 1996లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా ఆయన హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాని కంటే ముందు ఆయన 1996 లో తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
మూడు దశాబ్దాలు దాటినా :
ఇక ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ నందమూరి వారసులు మాత్రం గడచిన 31 ఏళ్ళుగా మంత్రివర్గంలో చేరలేదు. హరిక్రిష్ణ ఒక్కరే అదే మొదలు అదే చివరి అన్నట్లుగా ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగారు. ఇక హరిక్రిష్ణ తరువాత కాలంలో రాజ్యసభ సభ్యులు మాత్రం అయ్యారు. 2014లో చూస్తే బాలక్రిష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన హిందూపురం నుంచి మూడు సార్లు గెలిచారు. 2014లో అయితే బాలయ్య మంత్రి అని మీడియా అంతా ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. 2019లో అయితే బాలయ్య గెలిచినా టీడీపీ ఓటమి పాలు అయింది. 2024 లో చూస్తే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి రావడంతో సీనియర్ నేతలు అనేక మందికే కేబినెట్ లో అకామిడేట్ చేయలేకపోయారు అని చెబుతారు.
చాన్స్ ఉందా :
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మూడు సార్లు గెలిచిన హిందూపురంలో బాలయ్య కూడా మూడు సార్లు గెలిచి సత్తా చాటారు. అది ఎన్టీఆర్ ఫ్యామిలీకి కంచుకోట. 2029 లో కూడా బాలయ్య అక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు. అందువల్ల బాలయ్య మంత్రి అవుతారా లేదా అంటే కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఇపుడున్న రాజకీయ సామాజిక సమీకరణలో అయితే బాలయ్యకు మంత్రి పదవి ఈ టెర్మ్ లో దక్కుతుందా అంటే చెప్పడం కష్టమే అని అంటున్నారు. మరో వైపు చూస్తే బాలయ్య సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక బాలయ్య తప్పించి ఆ కుటుంబం నుంచి వేరొకరు రాజకీయాల్లో లేరు. సోదరి పురంధేశ్వరి బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఏది ఏమైనా టీడీపీ మంత్రివర్గంలో నందమూరి ఫ్లేవర్ ఉండాలని అభిమానులు అయితే గట్టిగానే కోరుకుంటున్న నేపథ్యం ఉంది.