వైసీపీ ట్రాప్ లో షర్మిల...నిజమేనా ?
| ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజకీయంగా మంచి అవకాశం ఉన్నా, దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదనే చర్చ సాగుతోంది. స్థానిక ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలున్నాయి. వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం కంటే, కూటమి ప్రభుత్వంపై కూడా గట్టిగా పోరాడితేనే ఏపీలో కాంగ్రెస్‌కు బలం పెరుగుతుందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ కుమార్తెగా వైఎస్ జగన్ సోదరిగా షర్మిల కూడా రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. తండ్రి అన్నల నుంచి పట్టుదల ఆమెకు కూడా వారసత్వంగా వచ్చింది అని చెబుతారు. గట్టి సంకల్పంతో ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని గత కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. అయితే షర్మిలకు తన ముందు ఉన్న అవకాశాలను ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది. ఆమె కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో పోరాడారు, మూడేళ్ల పాటు ఆమె ప్రయత్నం చేసిన తరువాత కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా నియమితులు అయ్యారు.
వచ్చిన ఛాన్స్ అది :
ఏపీలో కాంగ్రెస్ సంగతేమిటి అన్న ప్రశ్నలను పక్కన పెడితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బాగానే ఉంది. వంద ఎంపీలతో పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఇపుడిపుడే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ బలపడుతోంది. రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా మెల్లగా పెరుగుతోంది అని అంటున్నారు. ఒక్కసారి కనుక కేంద్రంలో కాంగ్రెస్ అధికారం సంపాదించుకుంటే ఆ ప్రభావం ఏపీ మీద కూడా కచ్చితంగా పడుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. అలాంటి పార్టీకి పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల తనకు లభించిన ఛాన్స్ ని ఏ మేరకు వినియోగించుకుంటున్నారు అన్నది ఒక చర్చగా ఉంది. గత కొద్ది నెలలుగా ఆమె వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి సారించలేకపోయారు అని అంటున్నారు. ఒక విధంగా లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ కి ఎంతో కొంత కలిసి వచ్చేవి అని అంటున్నారు. కానీ షర్మిల ఆ బాధ్యతలను పరిమితంగానే నిర్వహించారు అన్నది కూడా ఉంది.
వైసీపీ టార్గెట్ అది :
ఇక పోతే ఏపీలో వైసీపీ టార్గెట్ కూటమి అందులోనూ టీడీపీ అయినా సరే కాంగ్రెస్ మీద కూడా ఆ పార్టీ చూపు ఎపుడూ ఉంటుంది. ఇపుడు సొంత అన్నతో విభేదించి పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల అంటే వైసీపీ ఇంకాస్తా ఫోకస్ పెట్టడం ఖాయం. 2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ తక్కువ ఓట్లతో కొన్ని సీట్లు కోల్పోవడానికి కాంగ్రెస్ షర్మిల కారణం అన్నది కూడా ఉంది. దాంతో పాటు జగన్ షర్మిల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలతో కూడా కాంగ్రెస్ వైసీపీల మధ్య అగాధం ఇంకా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ టీడీపీ ఏపీలో ఒక్కటి అన్నది ఎస్టాబ్లిష్ చేయాలన్నది వైసీపీ ఎత్తుగడగా ఎపుడూ ఉంటుంది.
రాహుల్ చూడని వైనం :
ఏపీ వైపు రాహుల్ చూడటం లేదని ఏపీలో 2024లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కానీ ఏ నాడూ ఆయన ప్రస్తావించలేదని వైసీపీ నేతలు అంటూంటారు. ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె ఎక్కువగా వైసీపీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తారు అని కూడా వైసీపీ అంటుంటుంది. ఇది ఎంతో కొంత జనంలోకి వెళ్తోంది కూడా. ఇవన్నీ ఇలా ఉంచితే టీడీపీ అధినేత చంద్రబాబుని షర్మిల కలసి తన కుమార్తె పెళ్ళి పత్రికను ఇవ్వడం జరిగింది. దానిని వైసీపీ సొంత పత్రికలో సెటైరికల్ ఆర్టికల్ గా ప్రచురించారు. దీంతో షర్మిల ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయడం మీద ఫైర్ అయ్యారు. అంతవరకూ బాగానే ఉంది కానీ మాటలతో కాకుండా షర్మిల రాజకీయంగా కూటమి మీద గట్టి విమర్శలు చేయడం ద్వారానే వైసీపీ వేస్తున్న ఎత్తుల నుంచి తప్పించుకోగలరని అంటున్నారు. లేకపోతే కేవలం వైసీపీని నిందించి ఊరుకుంటే ఆచరణలో కూటమి కంటే ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తే కచ్చితంగా షర్మిల ఫ్యాన్ పార్టీ కోరుకున్నట్లుగా ఆ ట్రాప్ లో చిక్కుకున్నట్లు అవుతుంది అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఎత్తిగిల్లాలి అంటే కచ్చితంగా షర్మిల ఫోర్ ఫ్రంట్ లో ఉన్న కూటమి మీదనే పోరాటాలు చేయాలని సూచిస్తున్నారు.