కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?
| ఏపీలో ఈ నెల 20న జరగనున్న జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకాలపై చర్చలు సాగుతున్నాయి. టీడీపీ 21-22, జనసేన 4-6, బీజేపీ 1-2 పీఠాలు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప, కృష్ణా, కాకినాడ సహా పలు జిల్లాల పీఠాలపై మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది.
ఏపీలో జడ్పీ చైర్ పర్సన్లు వైఎస్ చైర్ పర్సన్ల ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా 28 జెడ్పీ చైర్ పర్సన్ పదవులు ఉంటే అందులో ఒకటి అయిన అల్లూరి జిల్లా జెడ్పీ పీఠం వైసీపీ గెలుచుకుంది. మిగిలిన 27 జెడ్పీ పీఠాల విషయంలో కూటమిలో మూడు పార్టీలు ఎవరిని ఎన్ని అన్న దాని మీద కసరత్తు చేస్తున్నాయి. వీటిలో టీడీపీ పెద్దన్న గా 21 నుంచి 22 దాకా జెడ్పీ చైర్ పర్సన్ పదవులు తీసుకుంటుందని చర్చ నడుస్తోంది. అదే సమయంలో కూటమిలో రెండో పార్టీ అయిన జనసేనకు నాలుగు లేదా అయిదు పదవులు ఇస్తారు అని బీజేపీకి ఒక జెడ్పీ పీఠం దక్కుతుందని ప్రచారం అయితే సాగుతోంది.
ఖరారు దిశగానే :
జెడ్పీ చైర్ పర్సన్ల ఎన్నికకు కౌంట్ డౌన్ కావడంతో ఏ పార్టీకి ఏ జిల్లా జెడ్పీ పీఠం అన్నది ఖరారు చేసే పనిలో కూటమి పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ 22 దాకా తీసుకుంటే మిగిలినవి అయిదు మాత్రమే ఉంటాయి. అందులో జనసేనకు నాలుగు బీజేపీకి ఒకటి దక్కుతుందని అంటున్నారు. కానీ జనసేన ఈ విషయంలో కొంత పట్టుబడుతోంది అని అంటున్నారు. తమకు కనీసంగా అర డజన్ జెడ్పీ పీఠాలు అయినా ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోంది అని అంటున్నారు. మొత్తం 28 లో ఆరు అంటే 22 శాతంగా తమకు సీట్ల షేర్ ఉంటుందని లెక్క వేస్తోంది. అంతే కాదు జనసేనకు ఇచ్చే జెడ్పీల గురించి కూడా చర్చ సాగుతోంది.
అక్కడ పట్టుగానే :
ఉత్తరాంధ్రాలో తీసుకుంటే శ్రీకాకుళం మేయర్ పీఠం ఇప్పటికే జనసేనకు కేటాయించారు. దాంతో జెడ్పీ పీఠం కూడా ఇచ్చేస్తే టీడీపీకి జిల్లాలో పెద్ద పదవి ఏమి ఉంటుందని తమ్ముళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతో జనసేనకు వేరే చోట ఇవ్వాలని అంటున్నారు. అయితే జనసేన శ్రీకాకుళంతో పాటు అనకాపల్లి జెడ్పీ పీఠం కానీ లేదా విశాఖ లేదా పార్వతీపురం మన్యం పీఠం కానీ కోరుకుంటోంది అని ప్రచారంలో ఉంది. అదే విధంగా కృష్ణా, కాకినాడ స్థానాలపై విషయంలో ఉత్కంఠ సాగుతోంది. ఇక్కడ టీడీపీ జనసేన రెండూ జెడ్పీ పీఠాల విషయంలో పోటీ పడుతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి, సత్యసాయి స్థానాల పైనా పోటీ వాతావరణ నెలకొంది అని అంటున్నారు.
బీజేపీతో తమ్ముళ్ళు :
ఇక మరో వైపు చూస్తే కడప జెడ్పీ పీఠం మీద పీట ముడి పడింది అని అంటున్నారు. ఈ కీలక పదవి కోసం బీజేపీ పట్టు బడుతోంది జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్ పర్సన్ గా అభ్యర్ధిని కూడా సిద్ధం చేశారని అంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలని తమ్ముళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. ఇక ఇక్కడ కాకపోతే బీజేపీకి ఎక్కడ సర్దుబాటు చేస్తారు అన్నది మరో చర్చగా ఉంది. అసలే బీజేపీ తమకు కనీసం రెండు అయినా జెడ్పీలు ఇవ్వాలని కోరుతోంది అని అంటున్నారు. దాంతో కమలం పార్టీకి ఎక్కడ ఇస్తారు, ఎన్ని ఇస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. దీంతో ఎవరికి ఎక్కడ ఎన్ని జెడ్పీ పీఠలు దక్కుతాయి అన్నది ఇపుడు అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అంతే కాదు వైస్ జెడ్పీ చైర్ పర్సన్ పదవులు కూడా కీలకం కాబోతున్నాయి. వీటిని కూడా మిత్రులు పంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నాయని అంటున్నారు.