గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!
| పల్లె రాజకీయాల్లో సర్పంచ్ పదవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రామంలో ప్రథమ పౌరుడిగా గౌరవం, ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే అవకాశం, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర ఈ పదవికి ఆకర్షణగా నిలుస్తున్నాయి. శుభకార్యాల నుంచి వివాదాల వరకు ప్రతి విషయంలో సర్పంచ్‌కు ప్రాధాన్యత ఉంటుంది. పదవితో వచ్చే హోదా, ప్రజల ఆదరణ, నాయకత్వ అనుభూతి కోసం ఎంతోమంది లక్షలు ఖర్చు పెట్టి మరీ పోటీ పడుతున్నారు.
పల్లెటూరి రాజకీయాల్లో ‘సర్పంచ్’ అనే మూడు అక్షరాలకు ఉండే పవర్, క్రేజ్ వేరే లెవల్. ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఉండే స్థాయి వేరు కావచ్చు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై, ప్రతి ఇంటి గడపతో సంబంధం కలిగి ఉండే ఏకైక రాజ్యాంగబద్ధమైన పదవి సర్పంచ్. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆ కుర్చీలో కూర్చోవాలని ఎందరో ఆరాటపడటానికి కారణం కేవలం అధికారం మాత్రమే కాదు, దాని వెనుక ఉండే ప్రెస్టేజ్ (హోదా), మానసిక సంతృప్తి, ఊరిపై ఉండే తిరుగులేని ఆధిపత్యం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సర్పంచ్ పదవిలో ఉండే అసలైన కిక్, ఆ పదవితో వచ్చే గౌరవం కోసం ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తుంటారు. ప్రభుత్వం తరఫున వచ్చే వేతనం తక్కువే అయినప్పటికీ, ఆ పదవి ద్వారా వచ్చే మానసిక సంతృప్తి రూపాయల్లో వెలకట్టలేనిదిగా చెబుతారు. ఇక రాజ్యాంగ ప్రకారం కూడా దేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అయితే, గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచే.. అంతేకాదు ప్రభుత్వంలో ఎవరికీ లేని చెక్ పవర్ గ్రామ సర్పంచ్ సొంతం. ఈ ఒక్క పవర్ ఆ పదవికి ఉన్న ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని అంటున్నారు.
ఊరి పెద్దగా దక్కే రాజభోగం
గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా, ఏ వివాదం తలెత్తినా అందరి చూపు మొదట పడేది సర్పంచ్ పైనే. ఊరిలో పెళ్లయినా, పండగైనా, జాతరైనా మొదటి ఆహ్వానం, మొదటి మర్యాద సర్పంచ్‌కే దక్కుతాయి. రచ్చబండ దగ్గర వేసే ప్రత్యేక కుర్చీ ఆ వ్యక్తికి ఊరిలో ఉన్న స్థానాన్ని చాటిచెబుతుంది. జిల్లా కలెక్టర్ నుంచి స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సై ఇలా ఏ అధికారి అయినా గ్రామానికి వస్తే ముందుగా సర్పంచ్‌తోనే చర్చిస్తారు. ఊరి తరఫున ప్రభుత్వంతో మాట్లాడే అధికారిక ప్రతినిధి సర్పంచ్ మాత్రమే. ఒకసారి సర్పంచ్‌గా గెలిస్తే, పదవీకాలం ముగిసినా జీవితాంతం "మాజీ సర్పంచ్ గారు" లేదా "ప్రెసిడెంట్ గారు" అనే పిలుపు వెన్నంటే ఉంటుంది. తరతరాలకు చెప్పుకునే ఒక శాశ్వత గుర్తింపు ఈ పదవి ద్వారా లభిస్తుంది. అందుకే గ్రామస్థాయి నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా ఆ పదవిని అనుభవించాలని తాపత్రయపడతారు.
పదవితో వచ్చే మానసిక ఆనందం
అధికారం కంటే కూడా, ఒకరి కష్టాన్ని తీర్చగలిగే శక్తి మన చేతిలో ఉందనే భావన మనిషికి అత్యున్నతమైన మానసిక ఆనందాన్ని ఇస్తుంది. వీధిలో లైటు వెలగకపోయినా, నీటి కుళాయి రాకపోయినా, ఒక నిరుపేదకు పెన్షన్ ఆగిపోయినా.. సర్పంచ్ ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క సంతకంతో ఆ పనిని పూర్తి చేయగలరు. మన వల్ల ఒక కుటుంబానికి మేలు జరిగినప్పుడు, ఆ పేదవాడి కళ్లలో కనిపించే ఆనందం, వారు పెట్టే దీవెనలు ఏ కోట్లు పెట్టినా కొనలేనివి. "మా ప్రెసిడెంట్ గారు లేకపోతే ఈ పని అయ్యేది కాదు" అనే ఒక్క మాట ఇచ్చే సంతృప్తి వర్ణనాతీతం.
గ్రామంపై తిరుగులేని ఆధిపత్యం
సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. ఊరి రూపురేఖలను మార్చే శక్తి ఆ స్థానానికి ఉంటుంది. ఊరిలో సిమెంట్ రోడ్లు వేయాలన్నా, డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలన్నా, పాఠశాలను తీర్చిదిద్దాలన్నా సర్పంచ్ చొరవ అత్యంత కీలకం. పదేళ్ల తర్వాత కూడా ఆ రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరూ "ఇది ఫలానా సర్పంచ్ హయాంలో వేసింది" అని గుర్తుచేసుకుంటారు. పల్లెల్లో చిన్నచిన్న తగాదాలు, కుటుంబ కలహాలు పోలీస్ స్టేషన్ గడప తొక్కకుండా రచ్చబండ దగ్గరే పరిష్కారమవుతాయి. ఇరువర్గాలను ఒప్పించి, న్యాయం చెప్పే ‘గ్రామపెద్ద’ హోదా సర్పంచ్‌కు సమాజంలో తిరుగులేని పట్టును ఇస్తుంది.
సర్పంచ్ పదవిలో అసలైన కిక్
ఎన్నికల సమయంలో నిద్రాహారాలు మాని గెలవాలని పట్టుబట్టడానికి వెనుక కొన్ని బలమైన మానసిక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పల్లె రాజకీయాల్లో గెలుపు అనేది వ్యక్తిగత ప్రతిష్టకు, కుల, వర్గ బలానికి నిదర్శనంగా మారింది. ప్రత్యర్థిపై గెలిచి, ఊరి జనం తనవైపు ఉన్నారని నిరూపించుకోవడంలో ఉండే కిక్ నాయకులకు ఒక వ్యసనం లాంటిదని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగిన ఎందరో మహామహులు తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్‌గానే ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది. ఉన్నత రాజకీయాలకు సర్పంచ్ పదవి ఒక బలమైన పునాది. వందల మంది తన వెనుక నడుస్తుంటే, తన మాట కోసం ఊరంతా ఎదురుచూస్తుంటే కలిగే ఆ ‘నాయకత్వపు అనుభూతి’ మనిషిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.