పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?
| ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కరువు, తాగునీటి ఎద్దడి ఏర్పడితే ప్రభుత్వాలకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. పంట దిగుబడులు తగ్గడం, నిత్యావసరాల ధరలు పెరగడం ప్రజల్లో అసంతృప్తికి దారితీయవచ్చని నేతలు భయపడుతున్నట్లు కథనం పేర్కొంది. 1999-2004 మధ్య కరువు ప్రభావం చంద్రబాబు ప్రభుత్వ ఓటమికి ఒక కారణమైందని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితులు వస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
‘‘జూన్ తర్వాత కూడా పరిస్థితులు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను..’’ తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి అన్నట్లుగా ప్రచారంలో ఉన్న ఈ ఒక్క మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. గ్రామాల్లో త్వరలోనే తాగునీటి కటకట ఏర్పడబోతోందని, ఈ గండం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదనే ఆందోళన ఆయన మాటల్లో ధ్వనిస్తోందని చెబుతున్నారు. సదరు మంత్రి నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన వ్యక్తం చేసిన భయంలో మాత్రం నిజం లేకపోలేదని అంటున్నారు. ఎందుకంటే ప్రకృతి ప్రకోపం ముందు ఏ ప్రభుత్వమైనా తలవంచాల్సిందేనని అంటున్నారు.
ప్రస్తుతం వాతావరణ నిపుణుల హెచ్చరికలు గమనిస్తే, ‘ఎల్ నినో’ ప్రభావంతో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర కరువు తాండవించనుందని అంటున్నారు. ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఒక వైపు పంట దిగుబడులు దారుణంగా పడిపోయి రైతు కుదేలవుతుంటే, మరోవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి వినియోగదారుడు విలవిలలాడుతున్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో ధరలను అదుపు చేయడం, అన్నదాతను ఆదుకోవడం ప్రభుత్వాలకు తక్షణ సవాలుగా మారింది. అంతకంటే ముఖ్యంగా, ఈ ధరల పెరుగుదల తమ చేతుల్లో లేదని జనానికి నచ్చజెప్పడం పాలకులకు కత్తిమీద సాములా మారింది. మరోవైపు వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ప్రభుత్వాధినేతలకు కంటి మీద కునుకు కరువు చేస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రబలుతుందని నేతలు భయపడుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వాలు ఎంత సమర్థంగా ఎదుర్కొన్నా, ఆ కష్టాల తాలూకు రాజకీయ సెగ నుంచి పాలకులు తప్పించుకోలేరనడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు. 1999-2004 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఐటీ, మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన, ఆర్థిక సంస్కరణతో దేశం దృష్టిని ఆకర్షించారు. కానీ, ఆ ఐదేళ్లూ వెంటాడిన తీవ్ర కరువు ఆయన కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేసిందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆకలి, దాహార్తితో అల్లాడిన జనం ముందు ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం చిన్నబోయాయని చెబుతున్నారు. ఫలితంగా 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతమయ్యేలా కనిపిస్తున్నాయనే ఆందోళన తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలను వెంటాడుతోందని చెబుతున్నారు.
అటు తెలంగాణ, ఇటు ఏపీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చుతోంది. కానీ, అనుకోని విధంగా ఎల్ నినో కారణంగా ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వాలను సవాల్ చేస్తున్నాయని అంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణలో వేసంగి పంట వేయొద్దని ప్రభుత్వం కోరుతోంది. మరోవైపు హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేయడం ప్రభుత్వానికి భారంగా పరిణమించనుందని అంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయమే ప్రధాన ఆధారమైన రెండు రాష్ట్రాల్లో రైతులు ఆర్థికం చితికిపోతారని, మళ్లీ కోలుకోడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషిస్తారు.
ఆ సమయంలో ఎన్నికలు జరిగితే అంతిమంగా ప్రభుత్వ వ్యతిరేకతకు మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని పలువురు నేతలు మదనపడుతున్నారని చెబుతున్నారు. కష్టకాలంలో ప్రజలు ప్రభుత్వాల నుంచి తక్షణ ఉపశమనాన్ని కోరుకుంటారే తప్ప, పాలకులు చెప్పే సాంకేతిక కారణాలను, సాకులను వినే ఓపిక ప్రజలకు ఉండదనే భయం నేతలను కలవర పెడుతోందని అంటున్నారు. కరువు అనేది ఒక రోజులో పరిష్కారమయ్యే సమస్య కాదు. కానీ, అది సృష్టించే అసంతృప్తి మాత్రం ప్రభుత్వాల పునాదులను కదిలిస్తుందనే భయమే తెలంగాణ మంత్రి మాటలలో కనిపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.