నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. తీరానికి భారీ ముప్పు
| బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుపానుగా బలపడనుంది. మంగళవారం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రైతులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. గత ఆరు గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రానికి తుపానుగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం చెన్నైకు 720 కిలొమీటర్లు, విశాఖపట్నానికి 820 కి.మీ., గోపాల్‌పూర్ కు 940 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు చెబుతున్నారు. సాయంత్రానికి దక్షిణ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని, మంగళవారం తీవ్రతుపానుగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుపానుగా మారినందున అక్వాన్ గా నామకరణం చేశారు. తీవ్ర తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని సమాచారం. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
తీవ్ర నష్టంపై భయాందోళనలు
తీవ్రవాయుగుండం ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రానికి తుపానుగా మారిన తర్వాత దీని వేగం పెరుగుతుందా? లేదా? అన్న కచ్చితమైన అంచనాలు ప్రకటించలేదు. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఇదే వేగంతో తుపాను తీరం వైపు వస్తే అత్యంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని భయపడుతున్నారు. సాధారణంగా ఉష్ణ మండల తుపానులు గంటకు 15 నుండి 25 కి.మీ. వేగం లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంటాయని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా వల్ల పెద్దగా వర్షాలు కురవలేదు. కానీ తుపానుగా మారిన తర్వాత తీరానికి సమీపించగానే ప్రభావం చూపూ అవకాశం ఉందని అంటున్నారు. తుపాను ఇంత నెమ్మదిగా కదలడం వల్ల ఆ ప్రాంతంపై దాని ప్రభావం చాలా తీవ్రంగా దీర్ఘకాలికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలతో ఊహించిన నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని భయపడుతన్నారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఒక తుపాను నెమ్మదిగా కదిలినప్పుడు, అది ఒకే ప్రాంతంపై ఎక్కువ సమయం నిలబడిపోతుందని అంటున్నారు. దీనివల్ల ఆ నిర్దిష్ట ప్రాంతంలో విపరీతమైన వర్షపాతం కురిసి, నగరాలు, గ్రామాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉందని, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తాయని అంటున్నారు. ఇప్పటికే గత రెండు తుపాన్ల కారణంగా ఏపీ తీర ప్రాంతంలో చెరువులు, రిజర్వాయర్లు నిండిపోయాయి. చాలావరకు పంట నష్టం సంభవించింది. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు, వరద ముప్పు ఉందనే భయాందోళన రైతన్నలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంట చేతికి అందుతున్న సమయంలో వరుస విపత్తులతో దిగుబడి తగ్గిపోతుందని భయాందోళన చెందుతున్నారు.
గాలులు, అలల పోటు
తుపాను కారణంగా ఈదురుగాలులు భయపెడుతున్నాయి. ప్రస్తుత హెచ్చరికలతో గాలుల వేగం ఎక్కువగా లేకపోయినప్పటికీ, బలమైన ఈదురుగాలులు ఎక్కువ గంటల పాటు నిరంతరం వీయడం వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు క్రమంగా దెబ్బతిని కూలిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా తుపాను తీవ్రాన్ని తాకేటప్పుడు సముద్రపు అలలు మామూలు కంటే ఎక్కువ ఎత్తులో ఎగసిపడటమే కాకుండా, ఎక్కువ కాలం పాటు తీరాన్ని తాకుతూనే ఉంటాయని భావిస్తున్నారు. దీనివల్ల తీర ప్రాంత కోత విపరీతంగా పెరిగి, ఉప్పునీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతుందని దీనివల్ల నష్టం దీర్ఘకాలం ఉంటుందని భయపడుతున్నారు.