సన్ ఆఫ్ బొత్స...సొంత ఇలాకాలో మెరిసేనా ?

సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర నేతగా ఎదిగిన క్రమంలో ఆయన తరఫున జిల్లా రాజకీయాలను మొత్తం చూసి నమ్మిన బంటుగా ఉన్న వారు చిన్న శ్రీను.

Update: 2026-09-27 05:30 GMT

సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర నేతగా ఎదిగిన క్రమంలో ఆయన తరఫున జిల్లా రాజకీయాలను మొత్తం చూసి నమ్మిన బంటుగా ఉన్న వారు చిన్న శ్రీను. దగ్గర బంధుత్వం ఉన్నా కూడా దానికి మించి గురు శిష్య బంధమే ఈ ఇద్దరినీ నడిపించింది అని చెబుతారు. బొత్స వ్యూహాలు ఆయన చాతుర్యం, పట్టూ అన్నీ కూడా అచ్చంగా అభ్యసించి అందుకున్న వారుగా చిన్న శ్రీనుని చెబుతారు. బొత్స ఆలోచనలను అమలులో నూరు శాతం పక్కాగా నెరవేర్చిన క్రెడిట్ కూడా ఆయనదే అని అంటారు. అలాంటి చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం బొత్సకు నిజంగా భారీ షాక్ అని చెప్పాలి. చిన్న శ్రీను ఉన్నారన్న నిబ్బరంతో ఆయన అంతే స్థాయి నేతను మరొకరిని తయారు చేసుకోలేకపోయారు. దాంతో ఇపుడు ఆయన రాజకీయానికి అదే పెద్ద లోటుగా మారుతోంది అంటున్నారు.

చీపురుపల్లిలోనూ :

బొత్స కుటుంబానికి సొంత ఇలాకా చీపురుపల్లి నియోజకవర్గం. ఇక్కడ ఆయన అయిదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచారు. గెలిచిన ప్రతీ సారీ మంత్రిగా ఉన్నారు. ఆయనకు అంతగా ఆదరించిన ఈ నియోజకవర్గం అంతటా బొత్స బంధువులు, సన్నిహితులు అతి పెద్ద అనుచరణ గణం కనిపిస్తారు. విభజన తరువాత బొత్స 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కూడా 40 వేల పై చిలుకు ఓట్లు సాధించారు అంటే అది ఆయన వ్యక్తిగత బలం అని కూడా చెబుతారు. అయితే ఇదే నియోజకవర్గం మొత్తం మీద పట్టు చిన్న శ్రీనుకు ఉంది. ఆయన బొత్స పరోక్షంలో పూర్తిగా చక్రం తిప్పేవారు. అలా బొత్స కంటే కూడా అందరితో సాన్నిహిత్యం ఆయనకే సొంతం. ఇపుడు ఆ గొలుసు బంధం తెగిపోయింది. గ్యాప్ అయితే పెరిగిపోయింది. అదే బొత్స వర్గీయులలో చింతగా మారింది.

బొత్స తరఫున ఆయన :

ఈ నేపధ్యంలో బొత్స తరఫున ఆయన కుమారుడు డాక్టర్ సందీప్ చీపురుపల్లిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఒక విధంగా ఆయనకు అనధికారికంగా ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. నిజానికి 2029 ఎన్నికల్లో సందీప్ పోటీ చేస్తారు అన్నది చాలా కాలంగా ఉన్న ప్రచారం. ఎపుడైతే చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరారో బొత్స కూడా తన వ్యూహం మార్చారు. కుమారుడికి బదులుగా తానే బరిలోకి దిగుతాను అని స్పష్టం చేశారు. తాను ఉంటే కనుక రేపటి రోజున చిన్న శ్రీను పోటీ చేసినా తన వైపే మొత్తం అనుచరులు బంధు గణం నిలుస్తారు అన్నది కూడా ఆయన వ్యూహంగా ఉంది అని అంటున్నారు. ఇక బొత్స మరో మాట చెప్పారు, తాను ప్రజలతో పార్టీ జనాలతో మరింతగా సాన్నిహిత్యం నెరుపుతాను అని. అందుకే ఆయన తన కుమారుడు సందీప్ కే బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.

రాణించగలరా :

ఇప్పటిదాకా ఈ బాధ్యతలను చిన్న శ్రీను చూశారు. ఇటీవలనే బొత్స కుమార్తె అనూష కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నం చేస్తూండగానే ఆమెని భీమిలీ వైసీపీ ఇంచార్జిగా చేశారు. దాంతో ఇపుడు డాక్టర్ సందీప్ మొత్తం పార్టీ కార్యక్రమాలను చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఒక వైపు తండ్రి అండ ఉన్నా సలహా సూచనలు ఆయనవి అయినా కూడా రాజకీయాలు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని అంటున్నారు. పైగా అవతల వైపు చిన్న శ్రీను వ్యూహాలు ఎటూ పదును తేరి ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ యువ నేతకు మొదట్లోనే కఠిన పరీక్ష సొంత ఇలాకాలోనే ఎదురవుతోంది అని అంటున్నారు. 2029 లో బొత్స పోటీకి తగిన సంపూర్ణమైన సానుకూల వాతావరణం ఉండేలా చూడాల్సిన బృహత్తర బాధ్యత అయితే సందీప్ మీద ఉందని అంటున్నారు.

Tags:    

Similar News