కొత్త ఇంటికి మారారా? ఇమ్మిగ్రెంట్లకు యూఎస్.సీఐఎస్ కీలక హెచ్చరిక.. 10 రోజుల్లో ఇది చేయాల్సిందే..

సొంత ప్రతిభను నమ్ముకుని.. కన్నోళ్ల కలలను గుండెల్లో నింపుకుని.. వేల మైళ్ల దూరంలోని అమెరికా గడ్డపై అడుగుపెట్టిన ప్రతి ఇమ్మిగ్రెంట్‌కు అక్కడ స్థిరపడటం ఒక నిరంతర పోరాటం.

Update: 2026-09-27 07:05 GMT

సొంత ప్రతిభను నమ్ముకుని.. కన్నోళ్ల కలలను గుండెల్లో నింపుకుని.. వేల మైళ్ల దూరంలోని అమెరికా గడ్డపై అడుగుపెట్టిన ప్రతి ఇమ్మిగ్రెంట్‌కు అక్కడ స్థిరపడటం ఒక నిరంతర పోరాటం. అహోరాత్రులు శ్రమించి అడుగడుగునా నిబంధనలు పాటిస్తూ.. ఒక చిన్న గూటి నుంచి మరో మంచి ఇంటికి మారినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. కానీ ఆ కాసేపటి సంతోషంలో చేసే ఒకే ఒక్క చిన్న నిర్లక్ష్యం.. అమెరికాలో భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తుందని మీకు తెలుసా? అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్.సీఐఎస్) తాజాగా విదేశీయులకు మరొక అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇల్లు మారిన తర్వాత కేవలం సామాన్లు సరిదుద్దుకోవడమే కాదు.. ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో అడ్రస్ మార్చడం కూడా అంతే ప్రధానం.

అమెరికాలో నివసిస్తున్న నాన్-యూఎస్ పౌరులు ఎవరైనా సరే.. తమ నివాస చిరునామా మారిన పది రోజుల్లోపు ఆ విషయాన్ని తప్పనిసరిగా యూఎస్.సీఐఎస్ కు తెలియజేయాలి. ముఖ్యంగా గ్రీన్ కార్డ్, వర్క్ పర్మిట్, హెచ్1బీ , స్టేటస్ మార్పు లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుని.. కేసులు పెండింగ్‌లో ఉన్నవారు ఈ విషయంలో క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఈ పది రోజుల నిబంధనను పక్కన పెడితే యూఎస్.సీఐఎస్ నుంచి వచ్చే అతి ముఖ్యమైన బయోమెట్రిక్ నోటీసులు, అపాయింట్‌మెంట్ లేఖలు, చివరికి ఆశగా ఎదురుచూసే గ్రీన్ కార్డ్ లేదా వర్క్ పర్మిట్ డాక్యుమెంట్లు పాత చిరునామాకే వెళ్లిపోతాయి. ఫలితంగా కేస్ ప్రాసెసింగ్ నిలిచిపోవడం.. అవసరమైన చర్యలకు గడువు ముగిసిపోవడం.. చివరకు ఇమ్మిగ్రేషన్ హోదానే కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఇమ్మిగ్రెంట్లు అత్యధికంగా చేసే పొరపాటు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వడంతోనే పని పూర్తయిందని అనుకోవడం. ఇంటి మార్పు తర్వాత స్థానిక పోస్టల్ సర్వీస్ (యూఎస్పీఎస్) వద్ద అడ్రస్ చేంజ్ ఇస్తే యూఎస్.సీఐఎస్ రికార్డుల్లో కూడా అది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుందని భావిస్తుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని యూఎస్.సీఐఎస్ స్పష్టం చేసింది. యూఎస్పీఎస్ లో అడ్రస్ మార్చినంత మాత్రాన ఇమ్మిగ్రేషన్ డేటాబేస్‌లో మారదు. పైగా యూఎస్.సీఐఎస్ పంపించే సున్నితమైన ఇమ్మిగ్రేషన్ మెయిల్స్‌ను ముందుకు ఫార్వర్డ్ చేయకుండా యూఎస్.పీఎస్ వెనక్కి పంపే అవకాశాలే ఎక్కువ. కాబట్టి యూఎస్.పీఎస్ తో పాటు యూఎస్.సీఐఎస్ వద్ద కూడా ప్రత్యేకంగా అడ్రస్ అప్‌డేట్ చేయడం అత్యంత ఆవశ్యకం.

సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో అడ్రస్ అప్‌డేట్ చేయడం చాలా సులభం. మీ యూఎస్.సీఐఎస్ ఆన్‌లైన్ అకౌంట్‌లో లాగిన్ అయి, "మై అకౌంట్ " విభాగంలో ఉన్న ఎంటర్ ప్రైజ్ చేంజ్ ఆఫ్ అడ్రస్ (ఈ-సీఓఏ) సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అడ్రస్ మార్చడం వల్ల సమాచారం తక్షణమే డిపార్ట్‌మెంట్‌కు చేరుతుంది, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులకు కొత్త చిరునామా త్వరితగతిన అనుసంధానమవుతుంది, కాగితాలు పంపాల్సిన అవసరం ఉండదు. ముఖ్యమైన నోటీసులు సురక్షితంగా కొత్త ఇంటికే చేరుతాయి. ఇప్పటికే పేపర్ రూపంలో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు పంపినవారు కూడా ఆన్‌లైన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అడ్రస్ మార్చుకునే వెసులుబాటు ఉంది.

ఒక వ్యక్తికి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అడ్రస్ మార్చే సమయంలో ప్రతి ఒక్క రిసీట్ నంబర్‌ను స్పష్టంగా నమోదు చేయాలి. ఆన్‌లైన్ విధానం అందుబాటులో లేనివారు ఫామ్ ఏఆర్-11ను మెయిల్ ద్వారా పంపవచ్చు. అయితే పేపర్ ఫారమ్ ద్వారా సమాచారం పంపితే పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులకు అడ్రస్ ఆటోమేటిక్‌గా మారకపోవచ్చని ఏజెన్సీ హెచ్చరిస్తోంది. అందుకే ఈ-సీఓఏ ఆన్‌లైన్ విధానానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. కాగా ఏ, జీ వీసా హోల్డర్లు, వీసా వీవర్ ప్రోగ్రాం కింద స్వల్పకాలిక పర్యటనకు వచ్చిన సందర్శకులకు మాత్రమే ఈ పది రోజుల నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.

అమెరికా కలల సాకారంలో ప్రతి అడుగు ఎంతో కీలకమైనది. రాత్రింబవళ్లు పడిన కష్టం, కుటుంబ భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలు.. ఒక చిన్న అడ్రస్ అప్‌డేట్ పొరపాటు వల్ల బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. ఇల్లు మారిన తక్షణమే.. క్యాలెండర్‌లో ఆ పది రోజుల గడువును గుర్తుపెట్టుకుని యూఎస్.సీఐఎస్, యూఎస్.పీఎస్ రెండింటిలోనూ చిరునామాను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించవచ్చు.

Tags:    

Similar News