మైనర్ భార్యతో శృంగారం నేరం.. తేల్చేసిన ఢిల్లీ హైకోర్టు

ఒక కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో ఒక అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్య చేసింది.

Update: 2026-09-27 04:26 GMT

ఒక కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు పూర్తి స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో ఒక అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్య చేసింది. ముస్లిం పర్సనల్ లా అన్నది కేవలం సివిల్ వ్యవహారాలకు సంబంధించిందే తప్పించి.. క్రిమినల్ చర్యల విషయంలో అందులోని అంశాలు వర్తించవని స్పష్టం చేసింది. పద్దెనిమిదేళ్లు దాటకుండానే తల్లి అయిన బాలికకు సంబంధించి ఢిల్లీకి చెందిన ఆసుపత్రి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు బాలిక భర్తపై ఫోక్సో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ తాజాగా ఢిల్లీ హైకోర్టులో జరిగింది.

ఫోక్సో కేసు నమోదైన అంశంపై సదరు భర్త.. తాను ముస్లిం పర్సనల్ లా ప్రకారం రెండు కుటుంబాల సమ్మతితో.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పెళ్లి జరిగినట్లుగా పేరకొన్నారు. పరస్పర అంగీకారంతో తామిద్దరం శృంగారంలో పాల్గొన్నట్లుగా తెలిపారు. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మైనర్ గా ఉన్నప్పుడే తల్లి అయిన విషయాన్ని గమనించిన అధికారులు తనపై ఫోక్సోచట్టం కింద కేసు పెట్టారని.. దీన్ని కొట్టేయాలని అతను అభ్యర్థించాడు.

సదరు యువకుడి వయసు 28 ఏళ్లు కాగా.. సదరు మైనర్ బాలికకు పదహారేళ్లు ఉన్న సమయంలో వీరిద్దరికి..ఇరు వర్గాల పెద్దల అనుమతితో పెళ్లి జరిగింది. వైద్యుల సమాచారంతో సదరు భర్తపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) (అత్యాచారం), పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. తమ పెళ్లి ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరిగినందున.. భార్య యుక్త వయస్సుకు వచ్చిన నేపథ్యంలో తమ పెళ్లి చెల్లుతుందని..తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఢిల్లీకి చెందిన ఈ మధ్యతరగతి వర్గానికి చెందిన ఈ వ్యక్తి పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ కొట్టేసేందుకు నిరాకరిస్తూ.. తన అభిప్రాయాన్ని సూటిగా.. స్పష్టంగా తేల్చి చెప్పింది. 23 పేజీల తీర్పులో కీలక అంశాల్ని బెంచ్ పేర్కొంది. పెళ్లి ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరిగిందా? లేదా? అనేది పెళ్లి చట్టబద్ధతను నిర్ణయించొచ్చు. కానీ.. పార్లమెంట్ చేసిన క్రిమినల్ చట్టాల నుంచి నిందితుడికి ఎలాంటి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ పర్సనల్ లా పేరుతో మినహాయింపు ఇస్తే.. బాలిక వయసుతో సంబంధం లేకుండా కేవలం పెళ్లి జరిగిందన్న కారణంతో నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంటుందని.. అదే జరిగితే పోక్సో చట్ట ఉద్దేశాన్ని దెబ్బ తీసినట్లు అవుతుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

భారతదేశంలో పద్దెనిమిదేళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించటం కోసం పోక్సో చట్టం తీసుకొచ్చారని.. బాధితురాలి వయసు పద్దెనిమిదేళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు.. భర్త అయినా సరే ఆమెతో లైంగిక చర్యకు పాల్పడితే అది నేరంగానే పరిగణిస్తామని కోర్టు తేల్చేసింది. మైనర్ల రక్షణ విషయంలో పర్సనల్ లా కంటే దేశ రాజ్యాంగబద్ధమైన క్రిమినల్ చట్టాలే అత్యున్నతమైనవన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేసింది. ‘పెళ్లి జరిగినంత మాత్రాన బాలిక వయసు పెరగదు. పెళ్లికి ముందు పదహారేళ్లు ఉన్న వ్యక్తి వయసు ఆ తర్వాత కూడా పదహారేళ్లే ఉంటుంది. సమ్మతి తెలిపే చట్టపరమైన సామర్థ్యాన్ని వయసే నిర్ధేశిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

ఇక్కడే మరో ఆసక్తికర ప్రశ్న మదిలోకి వస్తుంది. భారత చట్టాల ప్రకారం ఒక అమ్మాయి వయసు పద్దెనిమిదేళ్ల కంటే తక్కువగా ఉండటం మైనర్ కిందకు వస్తుంది కదా? పర్సనల్ లా ప్రకారం పెళ్లి చేసుకుంటే బాల్య వివాహం కిందకు వస్తుంది కదా? అలాంటప్పుడు ఈ ఉదంతంలో బాల్య వివాహానికి సంబంధించిన నేరం కూడా కలిసి ఉంది కదా అని? బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం మైనర్లనుబాధితులుగా చూస్తారు. అదే సమయంలో పెళ్లి జరిపించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.

పర్సనల్ లా ప్రకారం సాధారణంగా పదిహేనేళ్లు వస్తే పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నా.. భారతదేశ లౌలిక చట్ట ప్రకారం వీరి పెళ్లి కచ్ఛితంగా బాల్య వివాహమే అవుతుంది. అయితే.. పోక్సో కేసు నుంచి తనను బయట పడేయాలన్న అంశంపై పిటిషన్ కోర్టు ముందుకు వచ్చింది కాబట్టి.. ఆ అంశంపై కోర్టు క్లారిటీ ఇచ్చి.. పోక్సో కేసు పెట్టటం తప్పు కాదని తేల్చింది. ఈ కేసు విచారణలో భాగంగా పెళ్లి జరిపించిన వారిపై బాల్యవివాహ నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పర్సనల్ లా పేరుతో కొన్ని మినహాయింపులు ఉంటాయి. అవన్నీ సివిల్ వ్యవహారాల్లోనే తప్పించి.. క్రిమినల్ చర్యలుగా ఉండే వాటికి పర్సనల్ లా పేరుతో రక్షణ ఉండదన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేసిందని చెప్పాలి.

Tags:    

Similar News