కోర్టు నిర్ధోషి అని తేల్చేసినా 7ఏళ్లు జైల్లోనే మగ్గాడు.. ఈ నరకానికి పరిహారం 30లక్షలు!
| ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవిలాల్ గోండ్‌కు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018 జనవరిలో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినా, అధికారుల సమన్వయ లోపంతో మే 2025 వరకు జైల్లోనే ఉన్నాడు. ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని తప్పుబట్టిన ధర్మాసనం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
కోర్టు అతడిని నిర్ధోషి అని తీర్పు వెలువరించింది. అయితే అతడి నిర్ధోషిత్వం అతడికి తెలియనే తెలీదు. తీర్పు తర్వాత కూడా ఏడేళ్ల పాటు జైల్లోనే మగ్గాడు. చివరికి ఈ అన్యాయం పంచాయితీ మళ్లీ కోర్టు గడపపైకి వెళ్లింది. పర్యవసానంగా న్యాయం కళ్లు తెరిచి 30లక్షలు అతడికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవిలాల్ గోండ్ అనే వ్యక్తికి అన్యాయంగా జరిగిన జైలు శిక్షకు గాను రూ. 30 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది. ఈ మేరకు జస్టిస్ ఆగర్ సింగ్ మసీహ్- జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
నిందితుడి నిర్దోషిత్వ తీర్పు జైలు అధికారులకు సరైన సమయంలో చేరకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కోర్టు గుర్తించింది. 2018 జనవరిలోనే హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పునిచ్చినా.. సరైన సమన్వయం లేకపోవడం వల్ల మే 2025 వరకు అతడు అనధికారికంగా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులు- స్వేచ్ఛ హరించుకుపోవడానికి ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమే కారణమని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.
ఇలాంటి చట్టవిరుద్ధ నిర్బంధాలకు గురయ్యే బాధితులకు నష్టపరిహారం అందించేందుకు దేశంలో నిర్దిష్టమైన చట్టం లేకపోవడాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన శాసనపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే మధ్యప్రదేశ్ హైకోర్టు అమలు చేస్తున్న `ఆన్‌లైన్ క్రిమినల్ జస్టిస్ ఎకోసిస్టమ్` వంటి డిజిటల్ విధానాలను అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు అందించిన రూ. 30 లక్షల నష్టపరిహారంలో రూ. 5 లక్షలను నేరుగా బాధితుడి సేవింగ్స్ ఖాతాలో జమ చేయాలని..మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంచి ప్రతినెల వడ్డీ అందేలా చూడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థలో అధికారుల జవాబుదారీతనం -పారదర్శకత ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది.
ఈ ప్రపంచం అంతా బాధ్యతారాహిత్యమే!
భారతదేశంలో .. అలాగే ప్రపంచవ్యాప్తంగా నిర్దోషులుగా విడుదలైనా కోర్టు ఉత్తర్వులు సకాలంలో జైలు అధికారులకు అందక లేదా యంత్రాంగం వైఫల్యం వల్ల సంవత్సరాల తరబడి జైళ్లలోనే మగ్గిపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. దేవీలాల్ గోండ్ విషయంలోనే కాదు.. గతంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి కోర్టు ఆలస్యం వల్ల నిర్దోషిగా తేలిన వ్యక్తి పదేళ్లకు పైగా అదనంగా జైలు శిక్ష అనుభవించిన ఘటన సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. అలాగే అంతర్జాతీయంగా చూస్తే అమెరికా వంటి దేశాల్లోనూ పరిపాలనాపరమైన లోపాలు - డాక్యుమెంటేషన్ ఆలస్యం కారణంగా విడుదల కావాల్సిన ఖైదీలు నెలలు లేదా సంవత్సరాల తరబడి అన్యాయంగా నిర్బంధానికి గురైన ఉదంతాలు మానవ హక్కుల సంఘాల నివేదికల్లో తరచూ వెలుగుచూస్తుంటాయి. అయితే ఇలా బాధ్యతారాహిత్యంగా ఉండే జైళ్ల శాఖలు లేదా సంబంధిత అధికారులకు ఎలాంటి శిక్షలు వేయాలో ఇప్పటికీ సరైన చట్టాలు లేవనే వాదన బలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులలో అలసత్వం లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా విధాలుగా ప్రజలకు పెను ముప్పుగా మారుతున్న ఆధారాలు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో కోకొల్లలు.