బర్త్ డే స్పెషల్ : 28 ఏళ్లలో సెర్చ్ ఇంజిన్ నుంచి ప్రపంచాన్ని నడిపించే టెక్ సామ్రాజ్యంగా గూగుల్ ఎలా అవతరించింది?
ఉదయం కన్ను విప్పగానే నోటిఫికేషన్లు చూసే గూగుల్ సర్వీసుల నుంచి రాత్రి నిద్రపోయే ముందు రిలాక్స్ అయ్యే యూట్యూబ్ వరకు.. మన డిజిటల్ జీవితంలో ‘గూగుల్’ లేని క్షణాన్ని ఊహించుకోవడం కష్టం.
ఉదయం కన్ను విప్పగానే నోటిఫికేషన్లు చూసే గూగుల్ సర్వీసుల నుంచి రాత్రి నిద్రపోయే ముందు రిలాక్స్ అయ్యే యూట్యూబ్ వరకు.. మన డిజిటల్ జీవితంలో ‘గూగుల్’ లేని క్షణాన్ని ఊహించుకోవడం కష్టం. నేడు ఏ చిన్న సందేహం వచ్చినా మనకు గుర్తొచ్చే మొదటి మాట “గూగుల్ చేయ్”. సెప్టెంబర్ 27న 28వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. ఒక చిన్న పరిశోధన ప్రాజెక్టుగా మొదలై ప్రపంచ సాంకేతిక రూపురేఖలనే మార్చేసిన ఈ టెక్ దిగ్గజం విజయగాథపై ప్రత్యేక కథనం..
1990ల చివర్లో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులైన ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ ఒక పరిశోధన ప్రాజెక్టును చేపట్టారు. వెబ్‌పేజీల మధ్య ఉన్న లింకులను విశ్లేషించి ప్రాధాన్యతను ఇచ్చే ఈ సాంకేతికతకు మొదట్లో 'బ్యాక్ రబ్’’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ అధికారికంగా కంపెనీగా నమోదైంది. ప్రారంభంలో వేర్వేరు తేదీల్లో వార్షికోత్సవం జరుపుకున్నా 2006 నుంచి సెప్టెంబర్ 27ను అధికారిక పుట్టినరోజుగా పాటిస్తున్నారు.
కాలక్రమంలో గూగుల్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్‌గానే కాకుండా మన దైనందిన జీవితంలో భాగమైన ఒక సమగ్ర డిజిటల్ ఆవరణ వ్యవస్థగా మారింది. జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ట్రాన్స్‌లేట్, గూగుల్ ఫోటోస్ వంటి సేవలు కోట్లాది మంది వినియోగదారులకు ఉచితంగా అందుతున్నాయి. వినియోగదారులకు ఇవి ఉచితమే అయినప్పటికీ డిజిటల్ ప్రకటనలు, గూగుల్ క్లౌడ్ సేవల ద్వారా దీని మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్' బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
గూగుల్ దిగ్గజ ప్రయాణంలో భారతీయులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే పేరు సుందర్ పిచాయ్. 2004లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన ఆయన గూగుల్ క్రోమ్ వంటి కీలక ఉత్పత్తులను విజయవంతంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ గూగుల్ , ఆల్ఫాబెట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టి ప్రపంచ సాంకేతిక పటంలో భారతీయ ప్రతిభను సమున్నత స్థాయిలో నిలిపారు.
గూగుల్ ప్రయాణంలో కొన్ని ఆసక్తికర విశేషాలతో పాటు విఫలమైన ప్రయోగాలు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయం వద్ద గడ్డిని కత్తిరించేందుకు యంత్రాల శబ్దం, పొగ రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మేకలను నియమించడం అందులో ఒకటి. అలాగే 2013లో గూగుల్ సేవలకు కేవలం కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగినప్పుడు ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ దాదాపు 40 శాతం పడిపోవడం ఇంటర్నెట్ వ్యవస్థలో దీని ప్రాధాన్యతను చూపుతుంది. మరోవైపు టెక్నాలజీ ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుండే గూగుల్ ఆర్కుట్, గూగుల్ టాక్, గూగుల్ ప్లస్ వంటి కొన్ని సేవలను వినియోగదారుల ఆదరణ తగ్గడంతో మూసివేసింది.
ప్రస్తుతం గూగుల్ ప్రయాణం సెర్చ్ బాక్స్ పరిధిని దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిశగా వేగంగా సాగుతోంది. జెమినీ ఏఐ మోడల్స్ ద్వారా కేవలం సమాచారాన్ని వెతికి ఇవ్వడమే కాకుండా వినియోగదారుల ఆలోచనలకు తగినట్లుగా పనులను పూర్తి చేసే సహాయకుడిగా గూగుల్ మారుతోంది. భవిష్యత్తులో రోబోటిక్స్, డ్రోన్లు, డ్రైవర్ లేని కార్ల సాంకేతికతలతో ఇంటర్నెట్ తదుపరి తరాన్ని ఏలేందుకు గూగుల్ సిద్ధమవుతోంది.
ఒకప్పుడు "సమాచారం ఎక్కడ ఉంది?" అని వెతకడానికి పుట్టిన సెర్చ్ బాక్స్.. నేడు మన భవిష్యత్తును ఆలోచించే స్థాయికి చేరింది. 28 ఏళ్ల ఈ ప్రయాణం కేవలం ఒక కంపెనీ ప్రగతి మాత్రమే కాదు.. మానవ నాగరికత డిజిటల్‌గా మారిన తీరుకు నిలువెత్తు సాక్ష్యం. హ్యాపీ బర్త్‌డే గూగుల్..