తొలి అడుగులోనే అగ్నిపరీక్ష.. బొత్స కూతురు పాస్ అవుతారా?

రాజకీయ వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందునా ఉద్దండ నేతల ఇళ్ల నుంచి వచ్చే కొత్త గళాలపై అందరి ఫోకస్‌ మరింత ఎక్కువగా ఉంటుంది.

Update: 2026-09-27 07:30 GMT

రాజకీయ వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందునా ఉద్దండ నేతల ఇళ్ల నుంచి వచ్చే కొత్త గళాలపై అందరి ఫోకస్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సరిగ్గా అలాంటి ఆసక్తే నెలకొంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన వేళ.. ఆమెకు తొలి అడుగులోనే భారీ అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది.

ఇటీవల జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాల మార్పుల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా పరిషత్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొత్తగా ఏర్పాటైన పరిమిత మండలాల జెడ్పీలో ఎక్కువ భాగం భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఉండటం గమనార్హం. భీమిలి, ఆనందపురం, పద్మనాభం వంటి కీలక మండలాలతో పాటు పెందుర్తి పరిధి కూడా జెడ్పీ పరిధిలోకి రావడంతో.. ఇక్కడ రాజకీయ వ్యూహాలు తలకిందులవుతున్నాయి. బలం ఎక్కడుందో అక్కడే రాజకీయం నడవాల్సి ఉండటంతో, ప్రత్యక్ష యుద్ధానికి అధికార, విపక్షాలు రెడీ అవుతున్నాయి.

కూటమి వ్యూహాలను ఎదుర్కోవడం సులువేనా?

భీమిలి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కూటమికి క్షేత్రస్థాయిలో గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రమే కాకుండా, మూడు జెడ్పీటీసీ స్థానాలు, సుమారు యాభైకి పైగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవాల్సిన బాధ్యత అనూషపై ఉంది. జీవీఎంసీలో విలీనం కాగా మిగిలిన ఐదు డివిజన్లలోనూ సత్తా చాటాల్సిన పరిస్థితి. విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి భీమిలి నుంచే బలమైన రాజకీయ పునాది అవసరం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సులువుగా లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఇక్కడ అనుభవం ఉన్న సీనియర్ నేతలే కూటమి ఉధృతిని తట్టుకోలేక వెనకడుగు వేసిన దాఖలాలున్నాయి.

అయితే రాజకీయాల్లో చాణక్యుడిగా పేరున్న బొత్స సత్యనారాయణ తన అనుభవంతో కూతురికి దిశానిర్దేశం చేయగలరు. కానీ ఆయన ఏకకాలంలో తన సొంత ప్రాంతమైన విజయనగరం జిల్లా రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎటుచూసినా సవాళ్లతో కూడుకున్న ఈ రాజకీయ రణరంగంలో బొత్స అనూష తన తొలి ప్రయత్నంలోనే ఏ మేర రాణిస్తారు? అనుభవజ్ఞులైన ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొని పార్టీకి విజయాన్ని అందిస్తారా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News