ఐబొమ్మ రవికి బెయిల్ ఇవ్వొద్దు.. ఇస్తే పారిపోతాడు
ఇదిలా ఉండగా.. ఐబొమ్మ రవి పాస్ పోర్టును పోలీసులు సీజ్ చేసిన నేపథ్యంలో అతను విదేశాలకు పారిపోయే అవకాశం లేదని రవి తరఫు లాయర్ వాదన వినిపించారు.;
పైరసీ కేసుకు సంబంధించి మూడు నెలలుగా జైల్లో ఉంటున్న ఐబొమ్మ రవి బెయిల్ కు సంబంధించిన పిటిషన్ తాజాగా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఐ బొమ్మ రవి తరఫు న్యాయవాది అతనికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. గడిచిన మూడు నెలలుగా జైల్లో ఉండటం.. ఇప్పటికే విచారణ పూర్తి కావటంతో అతనికి బెయిల్ ఇవ్వాలని కోరారు.
దీనికి ప్రభుత్వ న్యాయవాది వాదన వేరేలా ఉంది. ఐబొమ్మ రవికి విదేశీ పౌరసత్వం ఉందని.. అతనికి బెయిల్ ఇస్తే అక్కడకు వెళ్లిపోతాడని వాదించారు. ఐబొమ్మ రవికి చెందిన వెబ్ సైట్ నుంచి ఇప్పటికి ఫిర్యాదులు అందుతున్నాయని.. చిత్రపరిశ్రమ నుంచి వినతలు వస్తున్నట్లుగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో మరింత విచారణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఐబొమ్మ రవి పాస్ పోర్టును పోలీసులు సీజ్ చేసిన నేపథ్యంలో అతను విదేశాలకు పారిపోయే అవకాశం లేదని రవి తరఫు లాయర్ వాదన వినిపించారు. పాస్ పోర్టు సీజ్ చేసిన తర్వాత ఎలా పారిపోతారు? అని ప్రశ్నించారు. దీంతో రవి పాస్ పోర్టు సీజ్ చేశారో లేదో తెలపాలని కోరుతూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఐబొమ్మ రవి బెయిల్ పై నిర్ణయం వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందంటున్నారు.