కళ్ళు మూసి తెరచే లోపు...జగన్ జోస్యమిదే !

తప్పు ఎవరైతే చేస్తారో వారిని చట్టబద్ధంగానే శిక్షిస్తామని జగన్ అనడం విశేషం. వారిని న్యాయ స్థానాలలో నిలబెట్టి మరీ శిక్షలు పడేలా చూస్తామని అన్నారు.;

Update: 2026-02-06 19:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరోసారి తనదైన రాజకీయ జోస్యం చెప్పారు. వైసీపీ వారికి ధీమా కలిగించేలా కూడా ఆయన మాట్లాడారు, ఏపీలో రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ జరిగేది చెబుతూనే జరగబోయేది కూడా చెప్పారు, జగన్ ఆత్మ విశ్వాసంతో ఈ వ్యాఖ్యలు చేశారు అనుకున్నా అవి మాత్రం ఆసక్తికరంగా సంచలనంగా ఉన్నాయి.

జస్ట్ కొంతకాలమే :

జగన్ ఎపుడూ ఒకే మాట అంటూ వస్తున్నారు. 11 సీట్లకే పరిమితం అయి వైసీపీ ఓడిన నాడు కూడా అయిదేళ్ళే కదా ఇట్టే గడచిపోతాయని ఆయన అన్నారు. ఆ తరువాత అదే మాటను రిపీట్ చేస్తూ వచ్చారు. ఇక ఆయన ఏ వేదిక మీద మాట్లాడినా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అంటూ వచ్చారు, నిన్నటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడినా నేడు మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద మాట్లాడినా జగన్ చెప్పేది ఒక్కటే జస్ట్ కొంతకాలమే కూటమి ప్రభుత్వం ఉంటుందని.

ఇలా గడిస్తే చాలు :

ఏముంది అపుడే రెండేళ్ళు గడచిపోయాయి, కళ్ళు మూసి తెరచే లోపు మరో మూడేళ్ళు కాలం ఇట్టే గడిచిపోతుంది అని జగన్ కామెంట్స్ చేశారు ఇక వచ్చేది ఆరు నూరు అయినా వైసీపీ ప్రభుత్వమే అని ఆయన నిబ్బరంగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం రాగానే ఎవరినీ విడిచిపెట్టే సమస్యే లేదని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అరాచకం సృష్టించిన నాయకులను కానీ అలాగే గూండాలను వారికి సహకరించిన పొలీసులను సైతం వదిలేది లేదని ఆయన గట్టిగానే చెబుతున్నారు.

అక్కడ నిలబెట్టి మరీ :

తప్పు ఎవరైతే చేస్తారో వారిని చట్టబద్ధంగానే శిక్షిస్తామని జగన్ అనడం విశేషం. వారిని న్యాయ స్థానాలలో నిలబెట్టి మరీ శిక్షలు పడేలా చూస్తామని అన్నారు. మాజీ మంత్రులు అంబటి జోగి రమేష్ ల ఇళ్ళ మీద దాడులు పోలీసుల సమక్షంలోనే జరిగాయని ఇది ఆటవీక పాలన కాక మరేమిటి అని జగన్ ప్రశ్నించారు. పక్కా పధకం ప్రకారమే కాపు బీసీ నేతల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు అని జగన్ ఆరోపిస్తున్నారు.

ధీమా ఏమిటో :

ఏపీలో వచ్చేది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని జగన్ అంటున్నారు. 2029 లో తాము అధికారంలోకి రాబోతున్నామని రెండేళ్ళ ముందే ఆయన ప్రకటిస్తున్నారు. మరి జగన్ ధీమా ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మూడు పార్టీలతో కలసి బలంగా ఉంది. బీజేపీ దాని మిత్రులు కలసి పోటీ చేసిన చోట ఎక్కడా ఓటమి జరిగిన దాఖలాలు లేవు. అలాంటిది ఏపీలో ఎందుకు వ్యతిరేకంగా జరుగుతుంది అన్నది కూడా చర్చ గా ఉంది.

సోలోగా పోటీ అంటే :

సరే ప్రజా వ్యతిరేకత అంటూ అయిదేళ్లు పాలన చేసిన ప్రభుత్వం మీద ఉంటుంది అనుకున్నా మూడు పార్టీలు కలిస్తే ఓటు షేర్ ఎంత తగ్గినా సోలోగా పోటీ చేస్తే వైసీపీ కంటే ఎక్కువే ఉంటుందన్నది రాజకీయ లెక్కలు చెబుతున్నాయి. బీభత్సమైన వ్యతిరేకత వచ్చిన సందర్భాలలో మాత్రమే కూటములు కట్టినా ఓటములు సంభవిస్తాయి. మరి కూటమిని దారుణమైన ప్రజా వ్యతిరేకత ఉందని జగన్ భావిస్తున్నారా తొలి రెండేళ్ళలోనే వ్యతిరేకత ఎంతో కొంత ఉందని అది ఎన్నికల నాటికి తారస్థాయికి చేరుకుంటుందని అంచనా కడుతున్నారా లేక గ్రౌండ్ రిపోర్ట్స్ ఆయన రివ్యూ చేసి చెబుతున్నారా లేక రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రత్యర్ధులను హెచ్చరించడానికి చెబుతున్నారా అన్నది పక్కన పెడితే జగన్ మాత్రం వైసీపీ తప్పక వస్తుందని అంటున్నారు. అది క్యాడర్ లో అయితే జోష్ నింపుతోంది. మరి మూడేళ్ళలో ఏమి జరుగుతుంది అంటే జోస్యాలే తప్ప ఎవరూ వాస్తవాలు అయితే ఈ రోజుకి చెప్పలేరు. సో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News