వైసీపీని తగ్గొద్దు అంటున్న పవన్ !

రేపటి రోజున ఒక్క సీటుకి పరిమితం అయినా కూడా ఎక్కడా తగ్గకండి, మీరు కరిగిపొండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి.

Update: 2026-06-27 22:30 GMT

విసీపీ నేతల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన పొగిడారా లేక తెగిడారా అన్నది ఎవరికి వారుగానే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వైసీపీ నేతలూ ఎక్కడా తగ్గొద్దు అంటూ జనసేన పార్టీ మీటింగులో పవన్ చేసిన కామెంట్స్ సెటైరికల్ గానే అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు ఇష్టారాజ్యంగా మాట్లాడారు అని ఇపుడు విపక్షంలో 11 సీట్లకు పరిమితం అయినా కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు అని పవన్ అంటూనే మీ కమిట్మెంట్ ని పూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. రేపటి రోజున ఒక్క సీటుకి పరిమితం అయినా కూడా ఎక్కడా తగ్గకండి, మీరు కరిగిపొండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి.

మీ నుంచి నేర్చుకోవాలి :

వైసీపీ నేతల నుంచి నేర్చుకోవాలని ఇదే సందర్భంలో పవన్ అనడం విశేషం. అధికారం లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారే అదే మీ గొప్పతనం అని అన్నారు. మీరు తగ్గకండి, తగ్గమని ఎవరు చెప్పారు అని అన్నారు. మీరు అలాగే మాట్లాడండి, 11 సీట్లు వచ్చినా తగ్గమని అంటున్నారు, ఒక్క సీటు వచ్చినా తగ్గ వద్దు అని ఆయన అన్నారు. విధానపరమైన విషయాల గురించి మాట్లాడుతామని కానీ వైసీపీ నేతల తీరే వేరు అన్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు.

వ్యతిరేకత లేదంటూ :

ఇదే మీటింగులో పవన్ తనకు వైసీపీ వారి మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదని వారి విధానాల మీదనే తన పోరాటం అని అన్నారు. అందుకే వారిని విమర్శించల్సి వస్తోంది అని అన్నారు. అధికారంలో ఉన్నపుడు అభివృద్ధి గురించి వైసీపీ నేతలు ఎక్కడా పట్టించుకోలేదని పవన్ విమర్శించారు. కేవలం బటన్ నొక్కుతూస్ సంక్షేమ పధకాలు ఇస్తే చాలు అనుకున్నారని అన్నారు. బటన్ నొక్కితే ఓట్లు పడతాయని అనుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే మౌలిక సదుపాయాల కల్పనను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన నిందించారు. సంక్షేమ పధకాలకే ఓట్లు పడతాయని అనుకోలేమని ఆయన అన్నారు. అందుకు వైసీపీ ప్రభుత్వమే ఒక ఉదాహరణ అని చెప్పారు. జనసేన సంక్షేమ పధకాలకు వ్యతిరేకం కాదని అభివృద్ధి విషయంలోనూ ఆలోచనలు జరగాలని ఆయన అన్నారు.

మంచి నాయకులు వెళ్ళిపోయారు :

ఇక పార్టీలో మంచి నాయకులు అంతా వెళ్ళిపోవడానికి క్యాడర్ చేసే గోలలే కారణం అని పవన్ అనడం విశేషం. ఈ విధంగా క్రమశిక్షణ లేకుండా వ్యవహరించవద్దు అని ఆయన సున్నితంగా మందలించారు. ఇక తనకు కులాలను ఆపాదించడం మీద కూడా వైసీపీ మీద ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను కులానికి పరిమితం అయిన వాడిని కానని అన్ని పార్టీలకు చెందిన వారంతా తన పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాలకు పల్లెలకు రోడ్లు పడ్డాయని ఆయన వివరించారు. రోడ్లు లేకపోతే గ్రామాల నుంచి అభివృద్ధికి అను సంధానం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ హయాంలో వీటిని పూర్తిగా విస్మరించారు అని అన్నారు.

ఉద్యమి సాధక్ అంటూ :

జనసేన పార్టీలో ఉద్యమి సాధక్ అన్న పదవుల ద్వారా నిర్వహిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. జనసేన సభ్యత్వం గతం కంటే పెరగడానికి వీరు కారకులు అయ్యారని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో వైసీపీ మీద సెటైరికల్ గానే కామెంట్స్ చేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News