ఐదు పెళ్లిళ్లు.. ఎదురుకట్నంతో మోసాలు.. అనంతపురంలో 'నిత్య పెళ్లికూతురు' అరెస్ట్

సాధారణంగా పెళ్లి పేరుతో అమ్మాయిలను ముంచే ‘నిత్య పెళ్లికొడుకుల’ గురించి వింటుంటాం. కానీ ట్రెండ్ మారింది బాస్.

Update: 2026-06-27 14:30 GMT

సాధారణంగా పెళ్లి పేరుతో అమ్మాయిలను ముంచే ‘నిత్య పెళ్లికొడుకుల’ గురించి వింటుంటాం. కానీ ట్రెండ్ మారింది బాస్. తానేమీ తక్కువ కాదంటూ అనంతపురం జిల్లాలో ఒక ‘నిత్య పెళ్లికూతురు’ ఏకంగా ఐదుగురు వరులను బురిడీ కొట్టించి రివర్స్ గేర్‌లో షాకిచ్చింది. ప్రేమ, పెళ్లి, ఆపై ఎదురుకట్నం.. ఇదీ ఈ కిలాడీ లేడీ ఫార్ములా. మూడు ముళ్లు పడటమే ఆలస్యం, మూడు రోజులు కూడా గడవకముందే కోట్లకు పడగలెత్తినట్టు కలలు గంటూ లక్షల రూపాయలతో జంప్ అయిపోవడం ఆమె నైజం. చివరికి ఈ ‘సప్తపది’ సుందరి పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి చేరింది.

ఎలా ముంచేదంటే..? సినిమాను మించిన స్క్రీన్ ప్లే

తూర్పుగోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27) అనే ఈమె గారికి పేర్లలోనే కాదు, పెళ్లిళ్లలోనూ వెరైటీ అంటే ఇష్టం. ఈమెకు ఒక పెద్ద ‘మ్యాచ్ మేకింగ్’ ముఠానే ఉంది. విజయవాడకు చెందిన సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ అనే మధ్యవర్తులు ఈమెకు బ్రోకర్లుగా వ్యవహరించేవారు. వీరంతా కలిసి అమాయక వరులను టార్గెట్ చేసి, మణికి పెళ్లి సంబంధాలు కుదిర్చేవారు. అమ్మాయి తరఫున ‘ఎదురుకట్నం’ కావాలని లక్షలకు లక్షలు వసూలు చేసేవారు. తీరా పెళ్లయ్యాక ఆ డబ్బులో సింహభాగం బ్రోకర్లే నొక్కేసి.. మన ‘పెళ్లికూతురు’ చేతిలో కేవలం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు పెట్టేవారట. ఎంతైనా టీమ్‌వర్క్ కదా..

రైలెక్కిన పెళ్ళాం.. నంద్యాలలో జంప్

గత ఏడాది అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన యాపర్ల సుధీర్‌రెడ్డి అనే వరుడు ఈమె ట్రాప్‌లో పడ్డాడు. అక్షరాలా రూ.3.80 లక్షల ఎదురుకట్నం సమర్పించుకుని మరీ మణిని ఇంటికి తెచ్చుకున్నాడు. పెళ్లయిన మూడు రోజులకే మన పెళ్లికూతురు గారికి ‘హెల్త్ ప్రాబ్లం’ వచ్చేసింది. పుట్టింటికి వెళ్తానని మారాం చేయడంతో భర్తగారు ప్రేమతో రైలెక్కించారు. ఇంకేముంది నంద్యాల రైల్వే స్టేషన్ రాగానే ‘నేను కాసేపు అలా వెళ్లొస్తా’ అని దిగిన శ్వేతారెడ్డి శాశ్వతంగా మాయమైపోయింది.

దిక్కుతోచని భర్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆరా తీస్తే.. అమ్మడు అప్పటికే ఐదుగురిని పెళ్లి చేసుకుని ఒక పాప, బాబుకు కూడా తల్లి అయిందని తెలిసి దిమ్మతిరిగిపోయింది.

కర్ణాటక స్కెచ్.. మదనపల్లెలో ఎండ్ కార్డ్

ఇంత జరుగుతున్నా ఈమె గారి పెళ్లిళ్ల వేట ఆగలేదు. తాజాగా కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన మరో బకరాను పెళ్లాడి, అక్కడి నుంచి మదనపల్లెకు వస్తుండగా ఎస్సై ఆంజనేయులు బృందం స్కెచ్ వేసి మరీ ఈమెను అదుపులోకి తీసుకుంది. దీనితో పాటు ఆమె వెనకుండి నడిపించిన బ్రోకర్ల గ్యాంగ్‌పై కూడా పోలీసులు ఖాకీ మార్క్ కేసులు బనాయించారు.

వరుసగా ఇలాంటి ‘పెళ్లి’ మోసాలు వెలుగుచూస్తుండడంతో.. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే ముందు మధ్యవర్తుల మాటలు నమ్మి లబోదిబో మనకుండా అమ్మాయి లేదా అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని వారి విశ్వసనీయతను ఆధార్ కార్డులతో సహా చెక్ చేసుకోవాలని పోలీసులు ప్రజలకు సుతిమెత్తగా సూచిస్తున్నారు. లేదంటే ఎదురుకట్నం పోయి.. చివరకు చేతిలో ‘చిప్ప’ మిగలడం ఖాయం.

Tags:    

Similar News