కాశ్మీర్ ని మళ్ళీ కెలుకుతున్న పాక్-మధ్యలోకి ఐక్య రాజ్యసమితి

ఇక ఈ సందర్భంగా కాశ్మీర్‌ వివాదంపై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. కాశ్మీర్ ని ఏకంగా తమ దేశంలో అంతర్భాగంగా ఆయన ప్రకటించారు.;

Update: 2026-02-07 01:30 GMT

దాయాది పాక్ కి బుద్ధి మారదు అని అందరికీ తెలిసిందే. ఆ దేశం ఆకలితో దరిద్రంతో మట్టికొట్టుకునిపోయినా భారత్ మీద తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. వేయ్యేళ్ళు భారత్ మీద అలుపెరగని యుద్ధం చేస్తామని ప్రకటించిన పాక్ నుంచి ఏమీ ఆశించకుండా ఉండడమే మేలు. ఆపరేషన్ సింధూర్ తో గత ఏడాది దారుణంగా దెబ్బ తిన్నా కూడా భారత్ మీద తన ఉక్రోషం అలా వ్యక్తం చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా కాశ్మీర్ ని మరోసారి పాక్ కెలికింది.

సంఘీభావ దినోత్సవం :

కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం అని పాక్ నిర్వహించింది. ఇది తనకు తానుగా పాక్ పెట్టుకుని 1990 నుంచి నిర్వహిస్తున్న దినోత్సవం. కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం అనేది ఇలా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 5న పాకిస్తాన్‌లో పాటించే ఒక జాతీయ సెలవుదినంగా ఉంది. భారత పరిపాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రజలకు భారతదేశం నుండి విడిపోవడానికి ప్రయత్నిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాదులకు పాకిస్తాన్ తన మద్దతును సంఘీభావాన్ని తెలియజేయడానికి ఈ రోజుని నిర్వహిస్తోంది. అలాగే ఈ సంఘర్షణలో మరణించిన కాశ్మీరీలకు నివాళులర్పించడానికి దీనిని పాటిస్తారు. పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న ఆజాద్ జమ్మూ కాశ్మీర్ భూభాగంలో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తారు.

తొలిసారిగా అపుడు :

ఇక కాశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని మొదటిసారిగా 1990లో జమాతే ఇస్లామీ పాకిస్తాన్‌కు చెందిన ఖాజీ హుస్సేన్ అహ్మద్ ప్రతిపాదించారు. దీనికి నాటి పాక్ పాలకుడు నవాజ్ షరీఫ్ మద్దతు ఇచ్చారు. షరీఫ్ అంతకు ముందు సంవత్సరంలో జమాత్ సహాయంతో అధికారంలోకి వచ్చారు ఈ ఒక్కటే కాదు జనవరి 19వ తేదీని పాక్ జమ్మూ కాశ్మీర్ వలస దినోత్సవంగా నిర్వహిస్తోంది. జూలై 13 వ తేదీని కాశ్మీర్ అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తోంది.

పాక్ వివాదాస్పద వ్యాఖ్యలు :

ఇక ఈ సందర్భంగా కాశ్మీర్‌ వివాదంపై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వివాదాస్పదమైన వ్యాఖ్యలే చేశారు. కాశ్మీర్ ని ఏకంగా తమ దేశంలో అంతర్భాగంగా ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని . కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని ఆయన కోరారు. అప్పటిదాకా దక్షిణాసియాలో శాంతి అన్న మాటకు అర్థం లేదని అన్నారు. కాశ్మీర్ పేరుతో భారత్‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ దారుణమైన వ్యాఖ్యలనే షరీఫ్ చేయడం విశేషం.

పాక్ సైన్యాధిపతి సైతం :

ప్రధాని ఈ విధంగా మంటెక్కించేలా మాట్లాడితే పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఊరుకుంటారా. ఆయన ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా కాశ్మీర్ తమ దేశంలో అంతర్భాగం అవుతుందని ఆయన కూడా అంటున్నారు. ప్రాంతీయ అస్థిరతకు కాశ్మీర్ ఒక కారణం అని ఆయన అంటూ భారత్ ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు కాశ్మీర్ పాకిస్థాన్ విదేశాంగ విధానంలో భాగంగా ఉందని కూడా ఆసిమ్ మునీర్ చెప్పుకున్నారు.

మద్దతు ఎప్పుడూ ఉంటుందని :

కాశ్మీరీలకు తమ దేశం తరఫున నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆసిమ్ మునీర్ ప్రకటించారు. భారత సైనియం కాశ్మీరీలను అణచివేస్తోంది అని ఆయన ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అని పెద్ద మాటలే వాడారు, భారత్ మీద అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచే కాశ్మీర్ విషయంలో పరిష్కారం చూపాలని ఆయన కోరడం మరో విశేషం. మొత్తానికి భారత్ ని మళ్ళీ కెలకాలని పాక్ నిర్ణయించుకున్నట్లుగా ఉంది.

Tags:    

Similar News