కేంద్రమంత్రికి ₹99 లక్షల సబ్సిడీ.. తన శాఖ నుంచి ఇప్పించుకున్న ఘనుడు

మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది.

Update: 2026-06-28 05:54 GMT

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన సొంత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక పథకం కింద దాదాపు రూ.99 లక్షల సబ్సిడీ పొందడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఒక పక్క సాధారణ రైతులు చిన్నపాటి ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంటే, కేంద్ర మంత్రిగా ఉంటూ కోట్ల రూపాయల లబ్ధి పొందడం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం కాస్తా "ప్రయోజనాల ఘర్షణ" నైతికతపై పెద్ద చర్చకు దారితీసింది.

అసలు వివాదం ఏమిటి?

రాజస్థాన్‌లోని పర్బత్‌సర్ తహసీల్ పరిధిలో ఉన్న తన స్వగ్రామం పీహ్‌లో భగీరథ్ చౌదరి వాణిజ్యపరంగా దోసకాయల సాగు కోసం ఒక అత్యాధునిక 'పాలీహౌస్‌'ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఆయనకు రూ.99.03 లక్షల భారీ సబ్సిడీ మంజూరైనట్లు ఓ ఇన్వెస్టిగేటివ్ మీడియా నివేదిక వెల్లడించింది. అయితే ఇక్కడే అసలు లింక్ బయటపడింది. ఈ సబ్సిడీని మంజూరు చేసి.. పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ బోర్డుకు భగీరథ్ చౌదరి స్వయంగా ఎక్స్-అఫిషియో వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. తానే అధికారిక హోదాలో ఉన్న బోర్డు నుంచి, తన సొంత ప్రాజెక్టుకు అంత పెద్ద మొత్తంలో సబ్సిడీలు అందుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

మంత్రి వివరణ.. 'నేను పుట్టుకతో రైతును'

ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరి స్పందించారు. ఈ విమర్శలను ఆయన పూర్తిగా ఖండించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే రైతునని, వ్యవసాయమే తన కుటుంబ వృత్తి అని చెప్పుకొచ్చారు. "దేశంలో వేలాది మంది రైతులు పాలీహౌస్‌ల కోసం సబ్సిడీలు పొందుతున్నారు, నేను కూడా ఒక రైతుగానే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నాను. ఈ ప్రక్రియ 2018లోనే ప్రారంభమైంది. నేను దేన్నీ దాచలేదు, నా ఫామ్‌హౌస్ వద్ద సబ్సిడీ, బ్యాంక్ రుణాల వివరాలతో బోర్డు కూడా ఏర్పాటు చేశాను. అక్కడ రైతులకు ఆధునిక సాంకేతికతలు, ప్రకృతి వ్యవసాయంపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం," అని ఆయన స్పష్టం చేశారు.

విపక్షాల విమర్శల పర్వం

మంత్రి వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "మోదీ ప్రభుత్వంలో ఇది ఒక కొత్త తరహా అవినీతి నమూనా. సాధారణ రైతులు ప్రభుత్వ పథకాల కోసం, సబ్సిడీల కోసం చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. కానీ కేంద్ర మంత్రులు మాత్రం తమ సొంత శాఖల నుంచే కోట్ల విలువైన ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, నైతికతకు ఏమాత్రం మంచిది కాదు " అని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ పారదర్శకత, ప్రజాప్రతినిధుల నైతిక ప్రమాణాలపై ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తింది. చట్టపరంగా మంత్రి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తానే లబ్ధిదారుడిగా ఉండి, తానే నిర్ణయాత్మక బోర్డులో కీలక పదవిలో ఉండటం "ప్రయోజనాల ఘర్షణ" కిందికే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తెరపడుతుందా? లేక రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా ఈ వ్యవహారం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News