బీజేపీలో అద్వానీకి అన్యాయం జరిగిందా ?
అంది వచ్చిన ప్రధాని పదవిని ఆయన వాజ్ పేయికి అప్పగించి ఉప ప్రధానిగా సర్దుకున్నారు. తీరా తన వేళకు వచ్చేసరికి మాత్రం ఆయనకు ఆ అధికార ఫలం అందకుండా పోయింది.
ఈ ఏడాది నవంబర్ 27 నాటికి బీజేపీ వరిష్ట నేత ఎల్ కే అద్వానీ 99 ఏళ్ళు పూర్తి చేసుకుని 100వ ఏట అడుగు పెడతారు. బీజేపీ కంటే ముందు జనసంఘ్ నుంచి పార్టీని భుజాన మోసిన వారు ఎల్ కే అద్వానీ. ఆయన రెండు సీట్లు ఉన్న బీజేపీని ఏకంగా అధికారంలోకి తీసుకుని వచ్చిన వారు . ఆయన చలవతోనే బీజేపీలో ఈ రోజు కనిపిస్తున్న నాయకులు అంతా ఎదిగారు. అద్వానీ రాజకీయ ప్రస్థానం అంతా పోరాటాలతోనే సరిపోయింది. అంది వచ్చిన ప్రధాని పదవిని ఆయన వాజ్ పేయికి అప్పగించి ఉప ప్రధానిగా సర్దుకున్నారు. తీరా తన వేళకు వచ్చేసరికి మాత్రం ఆయనకు ఆ అధికార ఫలం అందకుండా పోయింది.
ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసిన వెంకయ్య :
ఇదిలా ఉంటే తాజాగా వెంకయ్య నాయుడు జీవిత చరిత్రను ఒక పుస్తకంగా రాసిన దానిని ఆవిష్కరించిన కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుస్తకంలో ఉన్న అంశాలు అన్నీ తన జీవితంలో జరిగినవి జాగ్రత్తగా రాశారు అన్నారు. అదే సమయంలో ఆనాడు కేంద్రంలో జరిగిన పరిణామాలను ఆయన మరోసారి గుర్తు చేసుకుంటూ జనం ముందు ఉంచారు. 2014 ఎన్నికలకు ముందు ఎల్ కే అద్వానీని కాకుండా నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా తామంతా కలసి ఎంపిక చేసి జనం ముందు పెట్టామని అన్నారు. అప్పటికి రెండు ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఓడిందని మళ్లీ ఓడితే క్యాడర్ డీమోరలైజ్ అవుతుందని భావించి యువ నేతగా ఉన్న మోడీకి పగ్గాలు ఇస్తే జనం నుంచి సానుకూలత ఉంటుందని భావించామని అన్నారు. గుజరాత్ ని అప్పటికే మోడీ విజయవంతంగా పాలిస్తున్నారు కాబట్టి ఆయన పట్ల జనంలో సానుకూలత కూడా కలసి వస్తుందని అంచనా వేశామని చెప్పారు. తమ అంచనా ఫలించి బీజేపీ 2014 ఎన్నికల్లో గెలిచిందని అన్నారు. అంతే కాదు ఈ రోజున మూడు సార్లు అధికారంలోకి వచ్చిందని మోడీ సారధ్యం వల్లనే ఈ విజయాలు అని వెంకయ్య నాయుడు చెప్పారు.
కొడుకులా చూసుకున్నారు :
ఇక ఇదే సమయంలో ఆయన మరో మాట చెప్పారు. తనను కొడుకుగా అద్వానీ చూసుకున్నారు అని అన్నారు. కానీ పార్టీ కోసం దేశం కోసం అద్వానీని పక్కన పెట్టి మోడీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని నాటి సంగతులను నెమరువేసుకున్నారు. తానే కాదు అనేక మంది నేతలను అద్వానీ చేయి పట్టి పెంచి పెద్ద వారిని పార్టీ పరంగా చేశారు అని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాతో పాటు అంతటా వైరల్ అవుతున్నాయి. వెంకయ్య నాయుడు చెప్పిన దానిని బట్టి చూసినా గతంలోకి ఒక్కసారి వెళ్ళినా బీజేపీలో భీష్మ పితామహుడు లాంటి అద్వానీకి అన్యాయం జరిగిందా అన్న కొత్త చర్చ మొదలైంది. దీని మీద గతంలో అంటే 2014 లోనూ ఆ తరువాత 2017 లో రాష్ట్రపతి ఎన్నికల వేళ కూడా చర్చ సాగింది. అయితే వెంకయ్య నాయుడు లాంటి దిగ్గజ నేత పాత విషయాలను మననం చేసుకోవడంతో అంతా మళ్లీ వీటి మీద దృష్టి పెట్టారు.
రాష్ట్రపతి అయినా :
ఇక దీని మీద నెటిజన్లు కూడా తలో విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీని ప్రధానిగా చేసినా 2017 లో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా అద్వానీని ఆ ఉన్నత పదవిలో కూర్చోబెట్టాల్సింది అన్నది అంతా అంటున్నారు. ప్రధాని పదవిని అద్వానీ తగిన వారు అని చాలా మంది చెబుతున్న మాట. మోడీ బీజేపీని అధికారంలోకి తెచ్చినా ఆనాడు అద్వానీ వాజ్ పేయిని గౌరవించి ప్రధాని పదవి అప్పగించిన తీరులో కొన్నాళ్ళు అయినా పెద్దాయనకు ఆ పదవి ఇచ్చి ఉండాల్సింది అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా బీజేపీని పెంచి పోషించిన ఒక కురు వృద్ధుడికి అదే పార్టీలో అన్యాయం జరిగింది అన్నది మాత్రం ఇపుడు మళ్ళీ చర్చల సందర్భంగా అంతా అంటున్న మాటగా ఉంది.