గిద్దలూరులో ఓడించారు...బాబు సంచలన కామెంట్స్
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో బాబాయిని చంపేసి ఆ హత్య నేరాన్ని తన మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు అని బాబు విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గిద్దలూరు పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్ధి వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మి గిద్దలూరులో 2019 ఎన్నికల్లో టీడీపీని భారీ తేడాతో ఓడించారు అని అన్నారు. ఆనాడు వైసీపీ నేతలు చేసిన మోసపూరితమైన ప్రచారాన్ని జనాలు కూదా నమ్మేశారు అని బాబు చెప్పుకొచ్చారు. తన చేతిలో కత్తి పెట్టి మరీ వైసీపీ అనుకూల పత్రికలో వార్తలు రాశారు అని ఆయన ఆనాటి విషయాలను గుర్తు చేశారు.
అందుకే ఓడామని :
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో బాబాయిని చంపేసి ఆ హత్య నేరాన్ని తన మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు అని బాబు విమర్శించారు. దానిని గిద్దలూరు ప్రజలు కూడా నమ్మేశారు అన్నారు. అందుకే 65 వేల ఓట్ల తేడాతో టీడీపీ ఇక్కడ ఓడింది అన్నారు. అయితే గిద్దలూరులో 2019 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ 81 వేల 35 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. ఆనాడు టీడీపీ నుంచి పోటీ చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి ఓటమి పాలు అయ్యారు.
స్వల్ప ఆధిక్యతతోనే :
అయితే అదే అశోక్ రెడ్డి 2024 ఎన్నికలలో 973 స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఇక్కడ వైసీపీ టీడీపీకి గట్టి పోటిని ఇచ్చినట్లుగా అర్ధం అవుతోంది. టీడీపీకి 98 వేల 463 ఓట్లు వస్తే వైసీపీకి 97 వేల 490 ఓట్లు దక్కాయి. ఇక కాంగ్రెస్ కి 2 వేల 879 ఓట్లు వస్తే నోటాకు 2 వేల 251 ఓట్లు రావడం విశేషం. అంటే నోటా కంటే కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మెజారిటీ సగానికి కంటే తక్కువ ఉండడం విశేషం. దీనిని బట్టి ఈ నియోజకవర్గం వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు అని అర్ధం అవుతోంది అంటున్నారు.
అందుకే అలెర్ట్ గా :
ఈ డేటా అంతా టీడీపీ అధినాయకత్వం వద్ద ఉంటుంది. పైగా గిద్దలూరులో 2014, 2019లలో వైసీపీ గెలిచింది. ఇక 2024లో స్వల్ప మెజారిటీతో నెగ్గింది. అందుకే చంద్రబాబు గిద్దలూరు మీద ఎమ్మెల్యేతో పాటు అధికారులను అలెర్ట్ చేస్తున్నారు. ఇక ఆయన ప్రసంగంలో కూడా వైసీపీని తీవ్రంగా విమర్శించారు. వైసీపీది విద్వంశ పాలన అని మండిపడ్డారు. వారు అయిదేళ్ల పాలన అంతా ఏపీని వెనక్కి నెట్టిందని దానిని గాడిలో పెట్టాలంటే ఏకంగా 15 ఏళ్ల సమయం పడుతుందని కూడా బాబు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి పదే పదే ముఖ్యమంత్రి ప్రజలకు వివరిస్తున్నారు. మొత్తం మీద చూస్తే గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో బాబు చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా ఆలోచించేలాగానే ఉన్నాయని అంటున్నారు.