ఆరేళ్ల తర్వాత భారత్‌కు ట్రంప్ తాత.. కానీ ఈసారి హగ్గులు లేవు.. అంతా ట్యాక్సులే

ట్రంప్ గారు రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కారో లేదో.. అప్పుడే మనోళ్లకు వలసల సెగ మొదలైంది.

Update: 2026-06-28 04:03 GMT

గుర్తుందిగా? ఆరేళ్ల క్రితం 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో లక్షల మంది జనం మధ్య "నమస్తే ట్రంప్" అంటూ డొనాల్డ్ ట్రంప్ తాత చేసిన హడావుడి.. అప్పట్లో దోస్తీ అంటే అలా ఉండేది మరి. కట్ చేస్తే... ఇప్పుడు సీన్ మారింది, స్క్రీన్ ప్లే మారింది, అసలు ట్రంప్ మార్కే మారింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మన 'ట్రంప్ తాత' మళ్లీ భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఈసారి పరిస్థితులు "నమస్తే" చెప్పుకునేంత సాఫ్ట్‌గా మాత్రం లేవు సార్.. అంతా ఫుల్ టైట్!

వీసాలు టైట్.. వీకెండ్‌లు ఫ్లాట్

ట్రంప్ గారు రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కారో లేదో.. అప్పుడే మనోళ్లకు వలసల సెగ మొదలైంది. "అక్రమ వలసదారులను ఏరిపారేస్తాం, వీసా నిబంధనలు మార్చేస్తాం" అంటూ ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు చూసి మన హైదరాబాద్, బెంగళూరు ఐటీ బాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ రూల్ మారుతుందో, ఎవరి వీసా క్యాన్సిల్ అవుతుందో తెలియక అమెరికాలోని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు రాత్రిళ్లు నిద్రపోవడం మానేశారు. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు ఎంత కఠినంగా మారాయంటే.. అమెరికా వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారు. "అప్పట్లో హగ్గులు.. ఇప్పుడు మాత్రం వీసాల దగ్గర అడ్డగోలు ట్యాగ్గులు!" అన్నట్టుంది అమెరికా వ్యవహారం.

50 శాతం సుంకాల షాక్.. అయినా వస్తున్నారు!

ఇక మన దేశం నుంచి అమెరికా వెళ్లే దిగుమతులపై ఏకంగా 50 శాతానికి పైగా సుంకాలు బాదేసి.. భారత్‌కు గట్టి షాకే ఇచ్చారు ట్రంప్. వ్యాపారంలో మనోడు పక్కా "బిజినెస్ మ్యాన్" అని మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి టైంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో గారు ఒక బాంబు పేల్చారు. 2027 ప్రారంభంలో ట్రంప్ భారత్ రాబోతున్నారట.. మరి ఇంతా చేసి ఎందుకు వస్తున్నారబ్బా అంటే.. భారత్-అమెరికా మధ్య చాలా కాలంగా నలుగుతున్న "వాణిజ్య ఒప్పందం" తుది దశకు చేరిందట. అంటే వ్యాపారాలు, రక్షణ, ఇంధనం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు లాంటి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పడానికి రూట్ మ్యాప్ రెడీ అవుతోంది.

అప్పట్లాగా కేవలం స్టేడియంలలో చేతులు ఊపడం, రాజకీయ మర్యాదలు చూపిస్తూ మురిసిపోవడానికి ఈసారి ట్రంప్ రావడం లేదు. భారత్ కూడా ఈసారి గట్టిగానే తగ్గేదేలే అన్నట్టు కూర్చోక తప్పదు. మరి మన ఐటీ ఉద్యోగుల వీసాల కష్టాలు తీరుస్తారా? లేక మన దిగుమతులపై బాదిన పన్నులు తగ్గించి "మేం ఫ్రెండ్స్" అని నిరూపిస్తారా? అనేది చూడాలి.

ఏదేమైనా ట్రంప్ తాత రాకపై అటు పొలిటికల్ సర్కిల్స్ లో.. ఇటు ఐటీ కారిడార్లలో గట్టి చర్చే నడుస్తోంది. ఈసారైనా మనోళ్లకు కాస్త ఊరట దక్కుతుందో.. లేక "వచ్చారు, చూశారు, ట్యాక్సులు బాదారు, వెళ్లారు" అన్నట్టు సాగుతుందో కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News