మాజీ మంత్రి మాస్టారుగా...లోకేష్ స్టూడెంట్ గా !

ఇదిలా ఉంటే ఈ ఆత్మీయ సమావేశంలో శివాజీ తన అనుభవాలనే పాఠాలుగా లోకేష్ కి చెప్పారు.;

Update: 2026-02-07 00:30 GMT

నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు అన్నది తెలిసిందే. ఆయన యువ నాయకుడిగా యూత్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో సీనియర్లకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. పార్టీలో సీనియర్లకు తగిన మర్యాద వారి స్థానం అన్నీ లోకేష్ ఇస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన సమావేశానికి లోకేష్ తెర తీశారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీని స్వయంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేష్ ఆహ్వానించారు.

సలహా సూచనలతో :

ఆయనతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయనతో కలసి లంచ్ చేశారు. చాలా సేపు ఆయనతో మాట్లాడారు, ఆయన నుంచి ఎన్నో విలువైన సలహా సూచనలను తీసుకున్నారు. టీడీపీ బలోపేతం మీద శివాజీ నుంచి సజెషన్స్ తీసుకున్నారు రాజకీయాల్లో విలువల గురించి నాటి పరిస్థితులు నేటి రాజకీయాల మీద కూడా కలసి కూర్చుని చర్చించారు. ఈ సమావేశం ఇపుడు టీడీపీలో ఎంతో చర్చకు తావిస్తోంది. అసలు రాజకీయాల్లో ఈ తరహా సమావేశాలు జరగడం అన్నది కూడా కొత్త సంప్రదాయం అని అంటున్నారు.

లచ్చన్న కుమారుడిగా :

ఇక శివాజీ విషయానికి వస్తే సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. బీసీల బాంధవుడిగా లచ్చన్నకు పేరు. ఆయన తనయుడిగా శివాజీ కూడా తండ్రి పేరుని నిలబెడుతూ అనేక సార్లు టీడీపీ నుంచి గెలిచి వచ్చారు. మంత్రిగా పనిచేశారు. ఏనాడూ వెనక్కి తగ్గకుండా రాజీ పడకుండా విలువలతో కూడిన రాజకీయాలనే ఆయన చేశారు అన్న పేరు సంపాదించారు. ఆయన కింజరాపు ఎర్రన్నాయుడు 1983లో ఒకేసారి టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇద్దరినీ జంట ఎమ్మెల్యేలు అని పిలిచేవారు. ఈ ఇద్దరూ ఎన్టీఆర్ కి అలాగే చంద్రబాబుకు ఎంతో ఇష్టులుగా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం శివాజీ కుమార్తె గౌతు శిరీష పలాస ఎమ్మెల్యేగా ఉంటున్నారు.

అనుభవాలే పాఠాలుగా :

ఇదిలా ఉంటే ఈ ఆత్మీయ సమావేశంలో శివాజీ తన అనుభవాలనే పాఠాలుగా లోకేష్ కి చెప్పారు. తాను మంత్రిగా ఉన్న కాలంలో ఎదురైన ఇబ్బందులు సవాళ్ళు, ఆనాటి రాజకీయ పరిస్థితులు అన్నీ వివరించారు. వాటిని లోకేష్ సైతం ఆసక్తిగా విన్నారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీని క్షేత్ర స్థాయిలో ఎలా బలోపేతం చేయాలో ఎంతో విలువైన సలహాలను కూడా లోకేష్ కి ఈ మాజీ మంత్రి అందించారు అని అంటున్నారు.

మరిన్ని సమావేశాలు :

లోకేష్ పార్టీలో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. దాంతో సీనియర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం ద్వారా గ్రౌండ్ లెవెల్ లో పార్టీని మరింతగా పటిష్టం చేయాలని చూస్తున్నారు. రానున్న రోజులలో ఇదే తరహాలో మరిన్ని ఆత్మీయ సమావేశాలను సీనియర్ నేతలతో మాజీ మంత్రులతో నిర్వహించే ఆలోచనతో లోకేష్ ఉన్నట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద పెద్దలను సీనియర్లను గౌరవైంచడం వారి అనుభవాలను తెలుసుకోవడం ఒక విద్యార్ధిగా వాటిని పాటించడానికి సిద్ధంగా ఉండడం లోకేష్ లోని మరో కోణాన్ని తెలియచేస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News