రేవంతొద్దీన్ వ్యాఖ్యకు.. సీఎం రియాక్షన్ చదవాల్సిందే
ఘాటు వ్యాఖ్యతో డ్యామేజ్ చేయాలన్న రాంచందర్ ప్లాన్ ను దెబ్బ తీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.;
బహిరంగ సభలో వేలాది మంది ఎదుట మాట్లాడేటప్పుడు అన్నీ అదిరే పంచ్ డైలాగులు రావు. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసేలా గట్టి మాటలు ఎదురవుతాయి. అయితే.. తనను టార్గెట్ చేస్తూ మాట్లాడే ఏ మాట అయినా.. విసిరే ఏ పంచ్ అయినా సరే అంతే సీరియస్ గా తన మాటలతో రిటర్న్ పంచ్ విసిరే తీరులో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ కు ప్రత్యేకమైన నైపుణ్యం ఉందని చెప్పాలి. తాజాగా జరుగుతున్న మున్సిపోల్స్ వేళ.. తన ఉనికిని చాటాలని తపిస్తోంది బీజేపీ.
విపక్ష బీఆర్ఎస్ కంటే కూడా తామే మెరుగైన స్థానంలో ఉన్నామన్న విషయాన్ని తాజా ఎన్నికల ఫలితాల్లో నిరూపించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మున్సిపోల్స్ ను సీరియస్ గా తీసుకొని.. కొన్ని మున్సిపాలిటీలు.. కొన్ని కీలకమైన కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరాలని తపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. తమ రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం.. సీఎం రేవంత్ పై ఘాటు విమర్శలతో పంచ్ లు విసురుతున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ను.. రేవంతొద్దీన్ అంటూ పంచ్ విసిరారు.దీనికి తన రియాక్షన్ ను నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. తనపై విసిరిన పంచ్ లను అంతే తెలివిగా విసిరిన టాలెంట్ చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం.
ఘాటు వ్యాఖ్యతో డ్యామేజ్ చేయాలన్న రాంచందర్ ప్లాన్ ను దెబ్బ తీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇంతకూ సీఎం రేవంత్ ఏమన్నారన్నది చూస్తే.. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నన్ను రేవంతొద్దీన్ అన్నందుకు నేనేమీ బాధ పడలేదు. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ నన్ను రేవంత్ గౌడ్ అని పిలిచారు. ఎస్సీ వర్గీకరణ వేళ ఉప ముఖ్యమంత్రి భట్టి నన్ను రేవంత్ మాదిగ అన్నారు. వాకిటి శ్రీహరిని మంత్రిని చేసిప్పుడు రేవంత్ ముదిరాజ్ గా, అనిల్ యాదవ్ ను రాజ్యసభ ఎంపీగా చేసినప్పుడు రేవంత్ యాదవ్ గా.. సిక్కులు సర్దార్ రేవంత్ సింగ్ గా సంబోధించారు. అన్ని కులాలు, అన్ని వర్గాల వారు తమలో నన్ను కలుపుకొని ఆదరిస్తున్నప్పుడు నాకు అభ్యంతరం ఎందుకు ఉంటుంది? అంటూ తనకు విసిరిన పంచ్ ను అంతే లాఘవంగా తిప్పి కొట్టారు. ఇదంతా చూస్తే.. సీఎం మాటల టాలెంట్ కు ఫిదా కావాల్సిందే.
సాధారణంగా ఇరుకున పెట్టేలా మాట్లాడినప్పుడు ఫస్ట్రేట్ కావటం మామూలే. ఇలాంటి సమయాల్లోనే తప్పులు చేస్తారు. అందుకు భిన్నంగా తనను ఎంతలా చికాకు పెడితే అందుకు రెట్టింపు రియాక్షన్ ను ప్రదర్శించటం.. తనపై చేసిన డ్యామేజింగ్ వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇవ్వటం చూస్తే.. ఈ తరహా ముఖ్యమంత్రి రేర్ అనకుండా ఉండలేం.