నాదెండ్ల సందేశం....జనసేనకు ఎన్ని సీట్లు ?

జనసేన ఈసారి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి భారీగానే ఆశలు పెట్టుకుంది. మరీ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్నద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, అలాగే క్యాడర్ కూడా ఎక్కువ సీట్లు పోటీ చేయాలని చూస్తున్నారు.

Update: 2026-09-20 11:47 GMT

జనసేన ఈసారి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి భారీగానే ఆశలు పెట్టుకుంది. మరీ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ లో ఉన్నద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, అలాగే క్యాడర్ కూడా ఎక్కువ సీట్లు పోటీ చేయాలని చూస్తున్నారు. దాని వల్ల తమకు అవకాశాలు వస్తాయని పదేళ్లకి పైగా పార్టీ కోసం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని కూడా భావిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా జనసేనలో ఉన్న అభిప్రాయాలు వారి ఆలోచనలకు తగిన విధంగా అధినాయకత్వం కూడా రియాక్ట్ అయింది. జనసేన 2024 ఫార్ములాతో కాదని 2026 కి వచ్చేసరికి బలం పెరిగింది కాబట్టి ఎక్కువ సీట్లు దక్కాలని కూడా నేతల నుంచి డిమాండ్ వచ్చింది. దానికి తగినట్లుగానె 30 శాతం ఫార్ములా అన్నది ఇపుడు ప్రచారంలో ఉంది.

ఈ రేషియో అమలు అయితే :

జనసేన పెద్దలు ఈ మధ్య దాకా చెప్పినట్లుగా 30 శాతం సీట్ల సర్దుబాటు కనుక అమలు అయితే ఏపీలో ఉన్న 17 కార్పోరేషన్లలో అయిదారు మేయర్ పీఠాలు దక్కాలి. అలాగే ఎనభై కి పైగా ఉన్న మునిసిపాలిటీలు నగర పాలికలలో 30 దాకా లభించాయి. ఇక 28 దాకా ఉన్న జెడ్పీ పీఠాలలో తొమ్మిది దాకా లభించాలి. రెండు వందల జడ్పీటీసీలు, వేలాదిగా ఉన్న

ఎంపీటీసీలు కూడా పొత్తు వాటాలో దక్కాలి. మరి ఈ విధంగానే ఆశలు పెంచుకుని జనసేన నేతలు దిగువ స్థాయిలో పని చేసుకుని పోతున్నాయి. అయితే జనసేనలో నంబర్ టూ అయిన మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తాపీగా చెప్పాల్సింది చెబుతున్నారు. అదేంటి అంటే ఎక్కువగా అంచనాలు పెంచుకోవద్దు అని. దాంతోనే ఇపుడు జనసేన నేతలలో కొత్త రకం ఆందోళన పెరిగిపోతోంది అని అంటున్నారు.

జనసేన సమావేశంలో నాదెండ్ల :

విశాఖలో తాజాగా జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో జనసేన నంబర్ టూ నేత అయిన నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆ పార్టీలో రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఆయన అన్నది చూస్తే జనసేనకి 60-70 సీట్లని ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదు అని. అనే కాదు పదవి అధికారంతో పాటు పార్టీకి బాధ్యత కూడా ఉంది అని అన్నారు. , మనం గెలిచే సీట్లు తప్పకుండా తీసుకుందామని మరో మాట అన్నారు. ఇక ఆయన చెప్పినది చూస్తే కూర్చొన్న కొమ్మను నరుక్కోవద్దు అన్న సందేశం కూడా ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనలను సైనికులే అర్థం చేసుకోకపోతే ఎలా అని కూడా నాదెండ్ల ప్రశ్నించారు.

సంస్థాగతంగా బలం :

అదే మీటింగులో నాదెండ్ల మరిన్ని వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. సంస్థాగతంగా జనసేన ఇంకా బలపడాల్సి ఉందని ఆయన చెప్పారు అని చెబుతున్నారు. ఒక పార్టీగా జనసేన నెమ్మదిగా ఎదగాల్సి ఉందని కూడా సూచించారు. ఏతా వాతా నాదెండ్ల మనోహర్ చెప్పేది ఏంటి అంటే బలం ఉన్న చోటనే పోటీ అని. మరి ఆ బలం ఎంత ఉంది ఏమిటి అన్నది ఎవరు తేలుస్తారు అన్నదే ఇపుడు జనసైనికులకు కలుగుతున్న కీలక ప్రశ్న. జనసేన బలం ఇంతే అని ఇచ్చినన్ని సీట్లు తీసుకుంటే ఇంక మనం ఎప్పటికి ఎదిగేది అని జనసైనికులు అయితే మండిపడుతున్నారు. ఏ పార్టీ అయినా కొత్తగా స్థానాలలో పోటీ చేస్తే కదా బలం ఎంత ఉంది అన్నది తెలిసేది అని ప్రశ్నిస్తున్నారు.

ఆ నాలుగు జిల్లాలు చాలవా :

జనసేనకు ఏపీ అంతా అవసరం లేదు కేవలం కృష్ణా,ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఇలా చూస్తే నాలుగు జిల్లాల్లో టీడీపీ-జనసేన బలం 60-40 గా ఉంటునని కూడా జనసైనికులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ నాలుగు జిల్లాల్లో అయినా 60-40 పద్దతిలో సీట్లు పంచటం న్యాయం అని వాదిస్తున్నారు. ఇక్కడ చూస్తే మేయర్ జెడ్పీ పీఠాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు మునిసిపాలిటీలలో కూడా జనసేనకు న్యాయమైన వాటా ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి నాదెండ్ల అయితే చెప్పాల్సింది చెప్పారు అంటే జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయన్న గుబులు అయితే పార్టీ వర్గాలలో ఉంది. తొందరలోనే చంద్రబాబు పవన్ బీజేపీ నేతలు సీట్ల సర్దుబాటు మీద కూర్చో బోతున్నారు అని అంటున్నారు. జనసేనకు నిజంగా 30 శాతం ఫార్ములా ప్రకారం సీట్లు వస్తాయా లేక నాదెండ్ల చెప్పినట్లుగా బలం ఉన్న చోట్ల సీట్లు దక్కుతాయా అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News