హ్యాకింగ్‌ పరీక్షల్లో గూగుల్ జెమినీ.. సైబర్ సెక్యూరిటీలో మొదలైన 'ఏఐ వర్సెస్ ఏఐ' యుగం

సైబర్ భద్రతా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతోంది.

Update: 2026-09-20 16:45 GMT

సైబర్ భద్రతా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకు కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి.. కోడ్ రాయడానికి లేదా సమాచారాన్ని విశ్లేషించడానికి మాత్రమే పరిమితమైన ఏఐ మోడళ్లు, ఇప్పుడు సైబర్ ప్రపంచంలో స్వతంత్రంగా ‘చర్యలు’ తీసుకునే స్థాయికి ఎదిగాయి. ఇటీవల గూగుల్ జెమినీ మోడల్‌పై నిర్వహించిన హ్యాకింగ్ పరీక్షలు డిజిటల్ భద్రతా ప్రపంచంలో సరికొత్త చర్చకు తెరలేపాయి.

ఏజెంటిక్ ఏఐ ప్రవేశం.. ఆలోచన నుంచి ఆచరణ వైపు..

సాధారణ చాట్‌బాట్‌లు మనుషులు ఇచ్చే ఆదేశాలకు బదులిస్తాయి. కానీ ‘ఏజెంటిక్ ఏఐ’ సాంకేతికత దానికి పూర్తి భిన్నమైనది. ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. మనుషుల ప్రమేయం లేకుండా సమాచారాన్ని సేకరించడం.. తదుపరి అడుగులు ప్రణాళిక వేయడం.. వివిధ డిజిటల్ టూల్స్‌ను ఉపయోగిస్తూ స్వతంత్రంగా పని పూర్తి చేయడం దీని ప్రత్యేకత. గూగుల్ సెక్యూరిటీ విభాగానికి చెందిన జెమినీ మోడల్ ఒక పరీక్షలో భాగంగా ఆన్‌లైన్ సమాచారాన్ని విశ్లేషించి కొన్ని సంస్థల వెబ్‌సైట్లలోకి ప్రవేశించేందుకు అవసరమైన లాగిన్ ఆధారాలను అంచనా వేసింది. ఈ క్రమంలో మూడు సంస్థలకు చెందిన భద్రతా ఉల్లంఘనలను గుర్తించి ఆయా కంపెనీలను హెచ్చరించింది.

ఏఐ vs ఏఐ : సరికొత్త సైబర్ యుద్ధం

ఏఐ టెక్నాలజీ ఒకవైపు సైబర్ దాడులకు ఉపయోగపడేంతగా రూపాంతరం చెందుతుంటే మరోవైపు అదే టెక్నాలజీ శక్తివంతమైన రక్షణ వ్యవస్థగానూ మారుతోంది. గూగుల్ ఇప్పటికే 'బిగ్ స్లీప్' వంటి ఏఐ వ్యవస్థల ద్వారా సాఫ్ట్‌వేర్ లోపాలను గుర్తించడం, 'కోడ్ మెండర్' సహాయంతో వాటికి పరిష్కారాలు చూపించడం చేస్తోంది. రాబోయే రోజుల్లో సైబర్ ప్రపంచం "ఏఐ దాడి వర్సెస్ ఏఐ రక్షణ" అనే కొత్త యుగాన్ని చూడబోతోంది.

స్వేచ్ఛ ఎంత ఉంటే.. నియంత్రణ అంత అవసరం

ఈ పరీక్షలు కేవలం హ్యాకింగ్ సంచలనాలకు పరిమితం కాక ఏఐ భద్రత, పరిమితులపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. స్వతంత్రంగా పనిచేసే ఏఐకి ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలి? అది ఎక్కడ ఆగాలి? అనుమతి లేకుండా ఏ చర్యలు తీసుకోకూడదు? అనే అంశాలపై కఠినమైన నిబంధనలు అవసరం.

గతంలో మనుషులు కంప్యూటర్లకు ప్రతి అడుగులో ఆదేశాలు ఇచ్చేవారు. కానీ రాబోయే రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఇస్తే ఏఐ స్వయంగా అన్ని దశలను పూర్తి చేసే పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో చోటుచేసుకునే ఒక చిన్న భద్రతా లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఏఐని అభివృద్ధి చేయడంతో పాటు దాని చుట్టూ బలమైన భద్రతా గోడలను నిర్మించడం.. సరైన నియంత్రణ సూత్రాలను అమలు చేయడం ప్రపంచ సాంకేతిక రంగానికి అత్యంత కీలకంగా మారింది.

Tags:    

Similar News