ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..
| తెలంగాణలోని జనగామ జిల్లాలో భూ వివాదానికి సంబంధించి కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల రూపకల్పనలో ఏఐ టూల్స్ ఉపయోగించారంటూ హైకోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. అధికారుల విచక్షణకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది.
జనాలు మరీ బద్దకస్తులు అయిపోయారబ్బా.. ఏదైనా ఈజీగా రావాలని.. కావాలని అనుకుంటున్నారు. కొన్ని సీరియస్ నిర్ణయాల్లోనూ ఈజీవేలో వెళితే ఎంతటి అనర్థమో తాజాగా ఓ కలెక్టర్ కు బాగా అర్థమైంది. అధికారులు బుర్రకు బద్దకం వదిలించి కంప్యూటర్ స్క్రీన్ కి పాలనాధికారం అప్పగిస్తే ఎలా ఉంటుందో జనగామ జిల్లా యంత్రానికి లైవ్ లో అర్థమైపోయింది.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన మెడిపల్లి కొమురయ్య భూవివాదంలో కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చూస్తే ఇకపై తహసీల్దార్ కార్యాలయాల్లో కుర్చీల్లో మనుసులకు బదులు ఏఐ బాట్లు ఉంటే సరిపోతుంది కదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. గత సెప్టెంబర్ 8న జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు తన హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినకుండానే క్షేత్రస్థాయిలో భూమికి సంబంధించిన వాస్తవాలను పరిశీలించకుండానే అధికారులు నిర్ణయం తీసుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే ఈ కేసులో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మరోటి. కలెక్టర్ కార్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించి వివాదాస్పద ఉత్తర్వులను రూపొందించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం. మాధవరెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇది కేవలం ఒక వ్యక్తి భూ వివాదంగా కాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో ఏఐ పాత్ర ఎంతవరకు ఉండాలనే విస్తృతమైన చర్చకు దారితీసింది.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆ ఉత్తర్వులు చూసి బాధితుడు కొమురయ్య లబోదిబోమంటూ హైకోర్టును ఆశ్రయించాడు. క్షేత్రస్థాయిలో భూమి పరిశీలించలేదు.. కనీసం రెండో ఓపినియన్ కూడా తీసుకునే తీరికలేదు.. అంతా ఏఐ మాయ.. కలెక్టర్ కార్యాలయంలో ఏఐ టూల్స్ తయారు చేసిచ్చిన ఆదేశాలపై గుడ్డిగా సంతకాలు చేస్తే ఇక ప్రజల తరతరాల జీవనాధారమైన భూములు గాలిలో కలిసిపోవాల్సిందేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు అధికారులపై తీవ్రంగా మండిపడింది. టెక్నాలజీ అనేది అధికారుల స్వతంత్ర విచక్షణకు ప్రత్యామ్మాయం కాదని గట్టిగా హెచ్చరిస్తూ ఆ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. ఏఐతో పాత రికార్డులను, అసంపూర్ణ సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉత్తర్వులు ఇస్తే సామాన్యుడి బతుకు రోడ్డున పడడం ఖాయం.. కనీసం అధికారులు చూసుకోకుండా సంతకాలు పెట్టడం మరీ ఘోరం..
ఏఐ వేగంగా ఫైళ్లను క్లియర్ చేయగలదేమో కానీ.. సామాన్యుడి ఆవేదనను , న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ఇవ్వలేదని అర్థమైంది. ఈ కలెక్టర్ గారి ఏఐ ప్రయోగం ఇప్పుడు భూపరిపాలన వ్యవహారాల్లో ఎంత డేంజరో మరోసారి అర్థమవుతోంది. ప్రజల హక్కులను కూడా అల్గారిథమ్ దయకే వదిలేయడంపై జనాలు మండిపడుతున్నారు.