'గ్రేటర్' విశాఖలో జనసేన సునామీ... !
| గ్రేటర్ విశాఖలో జనసేన తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. 2021 స్థానిక ఎన్నికల్లో 58 వార్డులకు పోటీ చేసి కేవలం 3 స్థానాలే గెలిచిన పార్టీ.. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 32 వార్డుల్లో పోటీ చేసి 25 చోట్ల విజయం సాధించింది. దక్షిణ విశాఖ, అనకాపల్లి, పెందుర్తి, పశ్చిమ నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించింది. ఈ విజయంతో ఉత్తరాంధ్రలో పార్టీ విస్తరణకు మరింత ఊతం లభించనుందని జనసేన నేతలు భావిస్తున్నారు.
గ్రేటర్ విశాఖపట్నంలో జనసేన సునామీ సృష్టించింది. నిజానికి ఉత్తరాంధ్రపై కూటమి పట్టుబిగించింది. దీనిలో నూ జనసేన గత 2019 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింతగా విశాఖపై పట్టు పెంచుకోవడం గమనార్హం. అప్పట్లో పవన్ గాజువాక నుంచి ఓడిపోయిన దరిమిలా.. పార్టీ పుంజుకునే విషయంపై చర్చసాగింది. పైగా అదే ఎన్నికల్లో జనసేన విశాఖ నుంచి పోటీ చేసి కూడా.. పరాజయం పాలైంది. దీంతో గ్రేటర్ విశాఖలో గ్లాసు పరిస్థితి సమస్యగా మారింది. కానీ.. అక్కడే ఇప్పుడు పార్టీ పుంజుకోవడం గమనార్హం.
వాస్తవానికి జనసేన 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ పెద్దగా పోటీ ఇవ్వలేక పోయింది. అప్పట్లో పవన్ కల్యాణ్ పోటీ చేసేవారు చేసుకోండి అనిపిలుపునిచ్చి వదిలేశారు. దీంత 58 వార్డుల్లో జనసేన నాయకులు పోటీ చేయగా.. కేవలం ముగ్గురంటే ముగ్గురు నాయకులు మాత్రమే గెలిచారు. కానీ.. దీనికి భిన్నంగా 2024 ఎన్నికల నుంచి కూడా జనసేన విశాఖలో పుంజుకోవడం ప్రారంభించింది. ఒక ఎమ్మెల్యే స్థానంతో పాటు తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ జనసేన దూకుడు చూపింది.
ప్రస్తుతం మిత్రపక్షాల తరఫున 32 వార్డుల్లో పోటీ చేసింది. అయితే.. కొన్ని కొన్ని మినహా అన్ని చోట్లా జనసేన విజయం దక్కించుకుంది. ఇది ఆ పార్టీకి మంచి ఊపును తెచ్చే వ్యవహారంగానే నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులోనూ ఉత్తరాంధకు కీలకమైన గ్రేటర్ విశాఖలో పార్టీ పుంజుకునేందుకు.. మరింతగా పార్టీ విస్తరించేందుకు కూడా ఇది దోహద పడుతుందని అంటున్నారు. పైగా ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో పార్టీ పుంజుకోవడం ద్వారా.. అధికారంలోకి రావడం కూడా సునాయాసం అవుతుందని లెక్కలు వేస్తున్నారు.
ఎక్కడెక్కడ గెలిచారంటే..
1) విశాఖ దక్షిణంలో 8 వార్డుల్లో పోటీ చేసి 1 వార్డు మినహా మిగిలిన 7 గెలుచుకున్నారు.
2) గాజువాకలో 6 వార్డుల్లో పోటీ చేయగా, 4 చోట్ల విజయం సాధించింది.
3) అనకాపల్లి పరిధిలో 3 వార్డుల్లో పోటీ చేయగా, మూడింటిలో గెలిచింది.
4) భీమిలి పరిధిలో 3 వార్డుల్లో పోటీ చేసి రెండింటిలో గెలిచారు.
5) పెందుర్తి పరిధిలో రెండు చోట్ల పోటీ చేసిన రెండూ సొంతం చేసుకున్నారు.
6) విశాఖ తూర్పులో 4 చోట్ల పోటీ చేసి రెండు గెలిచారు.
7) పశ్చిమ నియోజకవర్గం పరిధిలో మూడు వార్డుల్లో పోటీ చేసి 3 కైవసం చేసుకున్నారు.
8) ఉత్తర నియోజకవర్గంలో 3 వార్డులు కేటాయించగా ఒకటి మినహా మిగిలిన 2 చోట్ల గెలిచారు.