విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?
| విశాఖ ఏపీలో అతి పెద్ద కార్పొరేషన్ అన్నది తెలిసిందే. పైగా విశాఖలో కూటమిలోని మూడు పార్టీలకు సొంతంగా బలం ఉంది.
విశాఖ ఏపీలో అతి పెద్ద కార్పొరేషన్ అన్నది తెలిసిందే. పైగా విశాఖలో కూటమిలోని మూడు పార్టీలకు సొంతంగా బలం ఉంది. టీడీపీకి కంచుకోట విశాఖ. అలాగే బీజేపీకి కూడా కొన్ని కీలక ప్రాంతాలలో బలం మొదటి నుంచి ఉంది. జనసేనకు సామాజిక రాజకీయ సమీకరణ పరంగా అండదండలు ఉన్నాయి. దాంతో ఈ మూడు పార్టీల కాంబినేషన్ ఎంతా విజయవంతం అయింది అంటే 120 ఉన్న విశాఖ కార్పొరేషన్ లో ఏకంగా 98 వార్డులు గెలుచుకున్నాయి. ఇక ఇండిపెండెంట్లుగా గెలిచిన 8 మంది కూడా కూటమి రెబెల్స్ కావడంతో ఆ బలం కూడా కలుపుకుంటే 106 మంది ఆ వైపే ఉన్నారు. 13 వార్డులను గెలుచుకుని వైసీపీ ప్రతిపక్షంగా ఉండనుంది. ఒక్క సీటులో సీపీఎం గెలిచింది.
డిప్యూటీ కోసం :
ఈ నేపధ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమిలో అతి పెద్ద చర్చ సాగుతోంది. విశాఖ తమకు కీలకమైనది కాబట్టి మేయర్ సీటు ఇవ్వాలని బీజేపీ మొదటి నుంచి కోరుతూ వచ్చింది. 2024 ఎన్నికల్లో ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని బీజేపీ టీడీపీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళింది. అయితే డిప్యూటీ మేయర్ సీటు హామీ ఆనాడే లభించింది అని ప్రచారం సాగుతోంది. ఈ హామీ మేరకే విశాఖ బీజేపీ అధ్యక్షుడు పరశురాం రాజు కార్పోరేటర్ గా పోటీ చేశారు అని అంటున్నారు. ఇపుడు ఆయనే డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నారు అని అంటున్నారు. ఆయనకి ఈ పదవి ఇప్పించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ గట్టిగా కృషి చేస్తున్నారు అని అంటున్నారు.
జనసేన సైతం :
ఇక ఇదే డిప్యూటీ మేయర్ పదవి కోసం జనసేన కూడా ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ అయితే 26 కార్పోరేటర్లతో బలమైన రెండవ పార్టీగా ఉంది. దాంతో తమకు ఈ కీలక స్థానం ఇవ్వాలని కోరుతోంది. ఇక బీజేపీ వైపు నుంచి చూస్తే ఆ పార్టీకి ఎనిమిది మంది కార్పోరేటర్లు మాత్రమే ఉన్నారు. దాంతో తమకు చాన్స్ ఇవ్వాలని జనసేన నుంచి డిమాండ్ గా ఉంది. అయితే ఇక్కడ సంఖ్యాబలం ప్రాధాన్యత కాదని బీజేపీకే అవకాశం ఉండొచ్చు అని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఉత్తరాంధ్రాలో మూడు కార్పోరేషన్లు ఉన్నాయి. విశాఖ విజయనగరం టీడీపీ సొంతం అయ్యాయి. త్వరలో శ్రీకాకుళం కార్పోరేషన్ ఎన్నికలు ఉన్నాయి. అది జనసేనకు ఇచ్చారు. అలా జనసేనకు ఉత్తరాంధ్రాలో మేయర్ సీటు ఉంటుందని అంటున్నారు. అవసరం అయితే విజయనగరం డిప్యూటీ మేయర్ పీఠం ఇస్తారని చెబుతున్నారు. అలా మూడు పార్టీలూ కూటమిలో సమ న్యాయం చేసుకుంటాయని చెబుతున్నారు.
కాషాయం పార్టీ ప్లాన్ :
దీంతో విశాఖ మేయర్ పీఠం టీడీపీకి వెళ్తే డిప్యూటీ మేయర్ పీఠం బీజేపీకి దక్కుతుందని అంటున్నారు. బీజేపీ నుంచి 1980 లో మేయర్ తొలిసారి విశాఖ కార్పోరేషన్ అయ్యాక నెగ్గారు. మళ్ళీ ఇన్నేళ్ళకు డిప్యూటీ మేయర్ పీఠం దక్కితే తమకు సగం బలం అయినా విశాఖలో దక్కుతుందని రానున్న ఎన్నికల్లో పాటు విశాఖ రాజకీయాల్లో ఈ పదవి ఎంతో ఉపయోగపడుతుందని ఆ పార్టీ లెక్క వేసుకుంటోంది. చూడాలి మరి బీజేపీకి దక్కుతుందని ప్రచారంలో ఉన్న ఈ డిప్యూటీ మేయర్ సీటు ఎంత దూరమో మరెంత ఎంత దగ్గరో.