టీడీపీని టెన్షన్ పెడుతున్న పల్లా సిస్టర్ !

ఆయన ఏపీ టీడీపీకి అధ్యక్షుడు. సొంత పార్టీని కో ఆర్డినేట్ చేసుకోవడంతో పాటు కూటమి పార్టీలను మొత్తంగా ఏకత్రాటిపైన నడిపించాల్సిన వారు.

Update: 2026-10-20 03:16 GMT

ఆయన ఏపీ టీడీపీకి అధ్యక్షుడు. సొంత పార్టీని కో ఆర్డినేట్ చేసుకోవడంతో పాటు కూటమి పార్టీలను మొత్తంగా ఏకత్రాటిపైన నడిపించాల్సిన వారు. ఆయనే పల్లా శ్రీనివాసరావు. ఇపుడు ఆయన ఇంటి నుంచే టీడీపీ రెబెల్ అభ్యర్ధి వచ్చారు. దాంతో ఇదే అతి పెద్ద చర్చగా మారుతోంది. ఇక విశాఖ జిల్లాకు చెందిన పల్లా గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి నెగ్గారు. ఆయన తన తండ్రి దివగంత నేత మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం వారసుడిగా రాజకీయాలోకి పెట్టారు. అయితే ఆయన సొంత సోదరి పులిచెర్ల రాజేశ్వరి ఆయన కంటే ముందే రాజకీయాల్లో ఉన్నారు. ఆమె గాజువాక మున్సిపాలిటీలో గతంలో కౌన్సిలర్ గా వ్యవహరించడమే కాదు మూడు దశాబ్దాల పాటు సుదీర్ఘమైన రాజకీయ అనుబంధం టీడీపీతో కలిగి ఉన్నారు.

మేయర్ గా పోటీ :

అయితే ఆమె విశాఖ మేయర్ స్థానానికి పోటీ పడాలనుకున్నారు. రాజకీయ కుటుంబం, బలమైన యాదవ సామాజిక నేపథ్యం, రాజకీయ అనుభవం అన్నీ కలసి తనకు టికెట్ కచ్చితంగా దక్కుతుందని భావించారని చెబుతున్నారు. పైగా సోదరుడే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కాబట్టి తనకు సిఫార్సు చేస్తే కచ్చితంగా మేయర్ పీఠం దక్కేది అన్నది ఆమెకు ఉందని అంటారు. కానీ అలా జరగలేదు, ముక్కా శ్రావణికి పార్టీ టికెట్ ఇచ్చింది. దాంతో టీడీపీ నుంచి చాన్స్ దక్కకపోవడంతో రాజేశ్వరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో టీడీపీలోనూ కూటమిలోనూ ఇది అతి పెద్ద సంచలనంగా మారింది.

యాదవుల మద్దతుతోనే :

విశాఖ మేయర్ సీటు తమకు కేటాయించాలని యాదవ సామాజిక వర్గం గట్టిగా కోరారు. అయితే టీడీపీ నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి ఈ సీటు ఇచ్చారు. దాంతో జీవీఎంసీలో అధిక జనాభా ఉన్న యాదవులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. వారి మద్దతుతోనే పులిచెర్ల రాజేశ్వరి బరిలోకి దిగుతున్నారని అంటున్నారు. నగర పరిధిలో యాదవులు లక్షల జనాభాతో బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. యాదవ సామాజిక వర్గం రాజకీయంగా, సామాజికంగా బలమైన ప్రభావం కలిగి ఉంది. జీవీఎంసీలోని తూర్పు నియోజకవర్గం, గాజువాక, భీమిలి వంటి నియోజకవర్గాలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు జనాభా అధిక సంఖ్యలో విస్తరించి ఉన్నారు.

వార్డులలో పట్టు :

అంతే కాకుండా ఇటీవల జీవీఎంసీ వార్డుల సంఖ్యను 98 నుండి 120 కి పెంచుతూ ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసింది. ఈ కొత్త వార్డుల విభజనలో చూస్తే స్థానిక సర్వేల ద్వారా యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న వార్డులలో వారి రాజకీయ ప్రాతినిధ్యం మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకునే పల్లా సోదరి రాజేశ్వరి జీవీఎంసీ మేయర్ పదవికి పోటీ పడుతున్నారని అంటున్నారు.

టీడీపీకే షాక్ :

రాజేశ్వరి ఇండిపెండెంట్ గా బరిలో ఉంటే టీడీపీ మేయర్ అభ్యర్థికే నష్టం చేకూరుతుందని అంటున్నారు. టీడీపీకి పడాల్సిన ఓట్లలో ఎంతో కొంత ఆమె చీలుస్తారు అన్నది కూడా కూటమిలో ఉంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 21న ఉంది. ఆ రోజున ఆమె చేత నామినేషన్లు విత్ డ్రా చేయించగలిగితే కూటమికి పెద్ద టెన్షన్ తప్పుతుందని భావిస్తున్నారు. అలా కాదు అనుకుంటే టీడీపీ ఈజీగా గెలుస్తామనుకుంటున్న మేయర్ సీటు విషయంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News