భారత స్టాక్ మార్కెట్ ఎందుకు కుప్పకూలుతోంది?
భారత ఈక్విటీ మార్కెట్లలో గత కొన్ని వారాలుగా నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారత ఈక్విటీ మార్కెట్లలో గత కొన్ని వారాలుగా నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు వరుస నష్టాలను చవిచూడటంతో ఇన్వెస్టర్ల సంపద రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో పయనిస్తున్నప్పటికీ మార్కెట్లు ఈ స్థాయిలో బలహీనపడటంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అధిక లిక్విడిటీ లేదా నగదు లభ్యత కూడా మార్కెట్ అస్థిరతకు ఒక రకంగా కారణమవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండటం అనేది కొనుగోళ్లు, విక్రయాలను సులభతరం చేసే అనుకూల అంశంగా పరిగణిస్తారు. అయితే నిధుల లభ్యత సులభంగా ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడులను అంతే వేగంగా వెనక్కి తీసుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యల సారాంశం. ఇన్వెస్టర్లు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవని భావించిన తక్షణమే తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించి నగదుగా మార్చుకోవడం వల్ల మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి అనూహ్యంగా పెరుగుతోంది. అయితే లిక్విడిటీ ఒక్కటే ఈ పతనానికి కారణం కాదని.. దీని వెనుక పలు అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక సమీకరణాలు దాగి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) భారీ విక్రయాలు భారత మార్కెట్ పతనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కేవలం ఒకే నెలలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి సుమారు రూ.27,048 కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం.. అమెరికా వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయిస్తున్నారు. దీనివల్ల 2026 ప్రారంభం నుండి ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్ నుంచి జరిగిన నికర విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు రూ.2.2 లక్షల కోట్లకు పైగా దాటిపోవడం ఈ విక్రయాల తీవ్రతకు అద్దం పడుతోంది.
ఒకవైపు దేశ జీడీపీ వృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు సానుకూలంగా ఉన్నప్పటికీ కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తోంది. గతంలో పెరిగిన షేర్ల ధరలు వారి వాస్తవ విలువల కంటే అధికంగా ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయనే భావన కూడా ఈ విక్రయాలకు దారితీసింది. ప్రస్తుతం దేశీయ మ్యూచువల్ ఫండ్లు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (ఎస్ఐపీ) ద్వారా వస్తున్న పెట్టుబడులు మార్కెట్‌కు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ.. విదేశీ నిధుల ప్రవాహంలో అస్థిరత రాబోయే రోజుల్లోనూ.. ముఖ్యంగా 2027 నాటికి కూడా ప్రధాన రిస్క్‌గా పరిణమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ రకమైన సంక్షోభ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ పడుతోందని ప్రతీ పతనాన్ని కొనుగోలు అవకాశంగా భావించడం కానీ.. లేదా నష్టభయంతో తక్కువ ధరకు షేర్లను విక్రయించడం కానీ సరైన వ్యూహాలు కావు. ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టిన కంపెనీల ఆర్థిక బలాబలాలు, అప్పులు. భవిష్యత్తు లాభాల అవకాశాలను లోతుగా సమీక్షించుకోవాలి. స్వల్పకాలిక అవసరాల కోసం కేటాయించి.., దీర్ఘకాలిక లక్ష్యాలతో తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వైవిధ్యభరితమైన డైవర్సిఫైడ్ పెట్టుబడి ప్రణాళికతో ముందుకు సాగడమే ఈ సమయంలో సురక్షితమైన మార్గం.