రక్తసిక్తమైన యెమెన్ అంతర్యుద్ధం : హౌతీల పాశవిక దాడికి 53 మంది బలి.. 200 మందికి పైగా తీవ్ర గాయాలు
దక్షిణ యెమెన్‌లో ఘోర విపత్తు సంభవించింది. మానవత్వం సిగ్గుపడేలా.. మృత్యువు క్షిపణి రూపంలో విరుచుకుపడింది.
దక్షిణ యెమెన్‌లో ఘోర విపత్తు సంభవించింది. మానవత్వం సిగ్గుపడేలా.. మృత్యువు క్షిపణి రూపంలో విరుచుకుపడింది. కలల బాటలో పయనిస్తూ దేశ సేవలో భాగమవ్వాలని ఆశించిన నవయువకుల జీవితాలు సెకన్ల వ్యవధిలో బూడిదయ్యాయి. హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన అమానుష క్షిపణి దాడిలో 53 మంది యువ సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలతో జీవిత మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
కలల శిఖరం... ఒక్కసారిగా శ్మశాన వాటిక
దక్షిణ యెమెన్‌లోని షబ్వా ప్రావిన్స్, జర్దాన్ ప్రాంతంలోని 'అల్-అలామ్' మిలిటరీ శిక్షణ శిబిరం ప్రతిరోజూ ఉదయాన్నే ఉత్సాహంతో, దేశభక్తి నినాదాలతో ప్రతిధ్వనించేది. దేశం కోసం ఏదో ఒకటి సాధించాలని, కష్టాల్లో ఉన్న తమ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఎందరో నవయువకులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. సోమవారం ఉదయం కూడా తమ రోజువారీ శిక్షణలో లీనమై ఉన్నారు.
అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా వరుసగా మూడు బాలిస్టిక్ క్షిపణులు ఆ శిబిరంపై పడ్డాయి. మరుక్షణంలోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. పేలుడు దాటికి దేహాలు ముక్కలై గాలిలో ఎగిరిపడ్డాయి. ఆక్రోశాలు, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. తమ కళ్ల ముందే సహచరులు ప్రాణాలు విడుస్తుంటే మిగిలిన వారు చేసిన హాహాకారాలు రాతి గుండెలను సైతం పిండేశాయి.
కన్నీటి సముద్రంలో నిరుపేద కుటుంబాలు
ఈ దారుణ దాడి వార్త విన్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. "మా బాబు ఇక లేడు" అంటూ తల్లులు కన్నీరుమున్నీరవుతుంటే కుమారుడి భవిష్యత్తు కోసం కష్టపడ్డ తండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. జీవితంలో స్థిరపడి కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడనుకున్న కొడుకులు ఇలా ఆకస్మికంగా శవాలై రావడం ఆ కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీసింది. ఆసుపత్రుల వద్ద క్షతగాత్రుల బంధువుల అవేదన వర్ణనాతీతంగా మారింది.
శాంతికి దూరమవుతున్న యెమెన్
2014 నుంచి సాగుతున్న ఈ రక్తసిక్త అంతర్యుద్ధంలో ఇప్పటికే ఎన్నో వేల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. 2022 నాటి కాల్పుల విరమణతో ప్రజలు ఎంతో కొంత ఉపశమనం పొందుతారని భావించినప్పటికీ ఈ దాడి వారి ఆశలను ఆవిరి చేసింది. ఒకరి రాజకీయ స్వార్థం, ఆధిపత్య పోరు కోసమే అమాయక యువత బలైపోతోందని స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘోరకలికి మూలకారకులైన హౌతీల చర్యను ప్రభుత్వ అధినేత రషాద్ అల్-అలీమి తీవ్రంగా ఖండించారు. మరణించిన యోధుల త్యాగం వృథా పోదని.. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయితే రాజకీయ నాయకుల హెచ్చరికలు, యుద్ధ తంత్రాల మధ్య... మళ్లీ పూడ్చలేనిది మాత్రం ఆయా కుటుంబాల్లో ఏర్పడిన శూన్యమే.. యుద్ధ జ్వాలలకు ఇకనైనా అంతం దొరకాలని.. శాంతి వర్ధిల్లాలని యెమెన్ ప్రజలు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు.