మద్రాస్ రాజధాని ఆంధ్రులకు ఎందుకు దక్కలేదు ?
అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టేనాటికి ఆయన వయసు 51 ఏళ్ళు. ఆయన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతగానో పోరాడారు.
అమరజీవి అంటే ఒక్కరి పేరే వినిపిస్తుంది. ఆయనే పొట్టి శ్రీరాములు. ఆయన చేసిన త్యాగం ఆత్మ బలిదానం వల్లనే ఈ రోజు ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు సరిగ్గా ఇదే రోజున అంటే అక్టోబర్ 19న అమరణ దీక్షను ప్రారంభించారు. అది 1952వ సంవత్సరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా అయిదేళ్ళు పూర్తి అయింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనే ఆంధ్ర ప్రాంతం ఉంది. దాంతో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని ఆంధ్రులకు అన్ని విధాలుగా వివక్ష సాగుతోంది అన్నది మెల్లగా అసంతృప్తిగా మారింది. దాంతో ఈ రకమైన విధానాలను ప్రశ్నిస్తూ పొట్టి శ్రీరాములు మాకు ఒక సొంత రాష్ట్రం కావాలని తలపెట్టారు
దృఢ సంకల్పంతోనే :
అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్ష చేపట్టేనాటికి ఆయన వయసు 51 ఏళ్ళు. ఆయన దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతగానో పోరాడారు. గాంధీజీ ప్రియ శిష్యుడిగా మెలిగారు. తీరా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రులకు వాటి ఫలితాలు పూర్తిగా దక్కడం లేదని స్వీయ పాలన రావాలని కోరుకున్నారు. అందుకే దృఢ సంకల్పంతోనే పొట్టి శ్రీరాములు ఏకంగా అమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మద్రాస్ రాజధానిగా కోరుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నారు అన్నది ఇక్కడ కీలకం.
మద్రాస్ మీద హక్కు :
ఆంధ్రులు ఎంతో కష్టపడి మద్రాస్ నగరాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి మద్రాస్ నే రాజధానిగా చేస్తూ ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు డిమాండ్ చేశారు. నిజానికి మద్రాస్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినది ఆంధ్రులే. ఆనాటి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. మద్రాస్ నగర అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర మాత్రమే కాదు వారి శ్రమ ఎంతగానో ఉంది అన్నది వాస్తవం. ఈ కారణంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంతో పాటు మద్రాస్ మనదే అనే ఉద్యమాన్ని కూడా సమాంతరంగా తెలుగు నాయకులు ఆ రోజులలో నడిపించారు.
కేంద్రం ఉదాశీనతతో :
అయితే గట్టి పట్టుదలతో పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన అమరణ దీక్ష పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాశీనతను ప్రదర్శించింది. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు మంచి నీళ్ళు కూడా ముట్టకుండా దీక్షలో ఉన్నా కేంద్రానికి పట్టకుండా పోయింది అన్న విమర్శలు ఉన్నాయి. రోజులు నెలలు గడచినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో 58 రోజుల పాటు కఠోర ఉపవాసం చేసిన పొట్టి శ్రీరాములు 1952 డిసెంబరు 15న ప్రాణత్యాగం చేశారు. నిజానికి ఇది ఆంధ్రుల పట్ల చిన్న చూపుగానే అంతా నాడు భావించారు.
డిమాండ్ సగం మాత్రమే :
ఇక కేంద్ర ప్రభుత్వం శ్రీరాములు మరణం తరువాత ఉవ్వెత్తుల లేచిన ఉద్యమ ఫలితంగానే కదిలింది. కానీ ఒక ఏడాది ఆలస్యం చేసి 1953 అక్టోబర్ 1న ఆనాటి పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ఇచ్చింది. అయితే అందులోనూ శ్రీరాములు డిమాండ్లు సగం మాత్రమే నెగ్గాయి. మద్రాస్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం కోరితే దానిని కాకుండా కర్నూల్ ని రాజధానిగా చేసింది. దాంతో అమరజీవి త్యాగాలని నాటి కేంద్ర ప్రభుత్వం తక్కువ చేసి చూసిందన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక కర్నూల్ లో కనీస సదుపాయాలు లేక మూడేళ్ళు తిరగకుండానే అప్పటి హైదరాబాద్ స్టేట్ లో ఆంద్రా కలసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయి. ఆ తరువాత కధ తెలిసింది. అరవై ఏళ్ళు కలసి ఉన్నా 2014 లో ఆంధ్రా విడిపోయింది. అది కూడా రాజధాని లేకుండానే. మొత్తానికి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రమే కాదు రాజధానిని కూడా కోరుకుంటూ పొట్టి శ్రీరాములు సాగించిన పోరాటంలో డిమాండ్లు కేంద్రం పూర్తిగా అమలు చేసి ఉంటే ఏపీ ఈ రోజున మద్రాస్ రాజధానిగా ఒక వెలువు వెలిగేది అన్న భావన అందరిలో ఉంది. ఇక తమిళనాడుకు ఇతర నగరాలు ఎన్నో రాజధాని స్థాయిలో ఉన్నాయన్నది వాస్తవం.