నేటి నుంచి లోకల్ ఫైటింగ్స్ 2.0

కాగా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా పరిషత్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Update: 2026-10-19 12:30 GMT

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల రెండో దశకు సోమవారం తెర లేచింది. వరుసగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల సంఘం జడ్పీ, మండల పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సంగ్రామం ముగిసిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం అలుముకున్నట్లైంది. సోమవారం మొదలు కానున్న జడ్పీ, మండల పరిషత్తు ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతుంది.

రాష్ట్రంలో 659 జడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దీనిప్రకారం 21 నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇస్తారు. వచ్చేనెల 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 659 ఎంపీపీ, 659 జడ్పీటీసీల ద్వారా 28 మంది జడ్పీ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఓటర్లు నేరుగా ఎన్నుకోగా, మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులను పరోక్ష విధానంలో ఎన్నుకుంటారు.

కాగా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా పరిషత్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రేపటిలోగా ప్రతి మండల, జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్ ను కూడా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల అధికార, విపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పరిషత్ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఎన్నికల సంఘం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని అంటున్నారు.

ఇక పరిషత్ ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమవడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సర్దుబాట్లపై చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 28 జడ్పీ స్థానాలు, 659 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను కూటమిలో మూడు పార్టీలు సర్దుబాటు చేసుకోవాల్సివుందని అంటున్నారు. దీంతో మూడు పార్టీలలో ఎవరు ఎన్ని స్థానాలు చొప్పున తీసుకుంటారనే చర్చ ఆసక్తి రేపుతోంది. మున్సిపల్ స్థానాల నిష్పత్తిలోనే సర్దుబాట్లు ఉంటాయా? లేదా? అనేది చూడాల్సివుందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల తిరుగుబాట్లు కూటమిలో తలనొప్పులు తెస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జడ్పీల విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

మరోవైపు చూస్తుండగానే నామినేషన్ల ప్రక్రియకు సమయం ఆసన్నమవడం, ఇప్పటివరకు పొత్తులపై కనీస చర్చలు జరిగినట్లుగా సమాచారం లేకపోవడంపై కూటమిలో జడ్పీ ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏ జడ్పీని ఎవరికి కేటాయిస్తారనేది తెలిస్తే తమ ప్రయత్నాలు చేసుకొందామని భావిస్తున్న నేతలు అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలతో టచ్ లో ఉంటూ ఆరా తీస్తున్నారు. మరోవైపు వందల సంఖ్యలో స్థానాలపై చర్చలు జరగాల్సివుండటంతో అధిష్టానాలు జిల్లా నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో సీట్ల సర్దుబాటు నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వరకు అన్ని అంశాలు ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News