ఓటుకు నాలుగు వేలు...ఇవేమి మాటలు రాచమల్లూ !

వైసీపీలో ఆయన సీనియర్ నేత. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 2024లో మాత్రం 22 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.

Update: 2026-10-20 03:15 GMT

వైసీపీలో ఆయన సీనియర్ నేత. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 2024లో మాత్రం 22 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. అయితే వైసీపీలో కీలకంగా వ్యవహరించే ఈ నేత ఫైర్ బ్రాండ్ గానే గుర్తింపు పొందారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన నియోజకవర్గంలో టీడీపీ ఏకగ్రీవాలు చేసుకుందని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పోటీ ఉంటే ఓటుకు చెరో పార్టీ నుంచి రెండేసి వేలు వంతున నాలుగు వేల రూపాయలు ఓటరుకి దక్కేవి కదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజానికి ఓటుకు నోటు అన్నది చట్టపరంగా నేరంగా ఉంది అన్నది తెలిసిందే. కానీ మరీ ఇంత ఓపెన్ గా ఒక సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం పట్ల చర్చ సాగుతోంది.

ఓట్ల పండుగ అంటూ :

రాచమల్లు వాస్తవానికి చెప్పాలనుకుంది టీడీపీ తమను పోటీకి నిలబడనీయకుండా చేసి ఏకగ్రీవాలు చేసుకుంది అన్న పాయింట్. నిజానికి ఇది ఆ పార్టీ అధినేత జగన్ నుంచి అంతా చేస్తున్న సీరియస్ ఆరోపణ. దాని మీద నియోజకవర్గ ఇంచార్జిగా ఆయన మాట్లాడి ఉంటే ఒక విధంగా ఉండేది. కానీ ఆయన దాన్ని కాస్తా వేరే విధంగా మాట్లాడడం ద్వారా అటు టీడీపీ మీద విమర్శలు కంటే ఓటరుని కించపరచినట్లుగానే ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఓటుకు నోటు తీసుకుంటున్నారా లేదా అన్నది ఎవరూ బయటకు వచ్చి చెప్పేది ఉండదు, అలాంటి దానిని పట్టుకుని ఓట్ల పండుగ అని చెప్పడం, దసరా పండుగ వేళ వారికి ఎంతో ఆనందంగా ఉంటుందని రాచమల్లు చెప్పుకొచ్చారు. అలా ఓటర్ల వైపు మాట్లాడుతున్నాను అని ఆయన అనుకుంటూనే ఓటుకు నోటు విషయాన్ని ఏకంగా ఓపెన్ చేసేశారు అని అంటున్నారు.

వైసీపీ కూడా :

తమ పార్టీ కూడా ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వాలనుకుందని రాచమల్లు చెప్పడం ద్వారా ఎమ్మెల్యే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అని అంటున్నారు. నిజానికి ఓటుకి నోటు నేరం అని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన రాచమల్లుకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఈ విధంగా ఓటర్లను ఓటుకు నోటుతో కొనాలని చూడడం వల్లనే వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది అని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. బాధ్యత గల పదవులు చేసిన వారు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అలాగే ఎన్నికల వ్యవస్థను కూడా కించపరుస్తున్నామని ఎందుకు ఆలోచించడం లేదని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

పేదలు ఓట్లు అమ్ముకుంటారా :

పేదలు తమకు రెండు పార్టీల నుంచి తలా రెండేసి వేలు వస్తాయని ఆశించారు అని రాచమల్లు చెప్పడం ద్వారా వారిని కూడా అవమానించారు అని అంటున్నారు. పేదలు అయినంత మాత్రాన నోటుకు ఓటు అమ్ముకుంటారు అని చెప్పడమేంటని కూడా మండిపడుతున్నారు. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసే వారు ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు. అసలు ఓటుకు నోటుని అలవాటు చేసింది రాజకీయ నాయకులు కాదా అని కూడా అంటున్నారు. మరి ఇపుడు ప్రజల మీదకు తోసేయడమేంటని అంటున్నారు. ఏది ఏమైనా రాచమల్లు చేసిన ఈ వ్యాఖ్యలు అయితే విమర్శల పాలు అవుతున్నాయి. దీని మీద ఆయన ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News