డాలర్ల కల చెదిరింది.. సొంతగూటికి చేరుతున్న టెకీలు.. అమెరికాలో అభద్రత నుంచి ఆత్మీయతల వైపు

గమ్యస్థానంలో భద్రత కొరవడినప్పుడు.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే సొంతగూడే మహానిధిగా కనిపిస్తుంది.

Update: 2026-10-19 19:30 GMT

గమ్యస్థానంలో భద్రత కొరవడినప్పుడు.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే సొంతగూడే మహానిధిగా కనిపిస్తుంది. ఒకప్పుడు అమెరికా బాట పట్టడం ప్రతీ భారతీయ ఐటీ నిపుణుడి జీవితంలో ఒక పెద్ద కల. డాలర్ల వర్షం.. విలాసవంతమైన జీవితం.. ప్రశాంతమైన భవిష్యత్తు కోసం వేలాది మంది టెకీలు ఆశలతో సముద్రాలు దాటారు. కానీ నేడు ఆ అమెరికా కల వెనుక దాగి ఉన్న వేదన, అభద్రతా భావం వారిని తిరిగి కన్నతల్లి లాంటి స్వదేశం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి.

అభద్రత నీడలో అమెరికా కల

అమెరికాలో ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా నెలకు లక్షల జీతం పడుతున్నా.. మనశాంతి మాత్రం కరువైపోతోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడి జీవిస్తున్న భారతీయ కుటుంబాలకు ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన నిరంతరం వెంటాడుతోంది. కంపెనీ లేఆఫ్ ప్రకటించిన మరుక్షణమే ఇల్లు, పిల్లల చదువులు, వీసా గడువు.. ఇలా ఒక్కసారిగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూడటం, డోలాయమానంలో బతకడం వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. దానికితోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని ఉద్యోగ భద్రత మరీ క్షీణించింది.

సొంతగూటి వైపు అడుగులు.. గణాంకాలు చెబుతున్న సత్యం

ఈ అనిశ్చితి వల్లే ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు దాదాపు 12,700 మంది వైట్ కాలర్ ఉద్యోగులు అమెరికాను వదిలి భారత్‌కు తిరుగుముఖం పట్టారు. గతేడాది మొత్తం వచ్చిన 15,100 మందితో పోలిస్తే.. ఈ తొమ్మిది నెలల్లోనే 84 శాతం మంది రావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

డాలర్ల కంటే కన్నవారి ప్రేమే మిన్న

పైసలు ఎంత సంపాదించినా కుటుంబానికి దూరంగా ఉండటం.. కష్టకాలంలో తల్లిదండ్రుల పక్కన ఉండలేకపోవడం, పండగలకూ పబ్బాలకూ దూరంగా ఏకాకిలా జీవించడం ప్రవాసుల మనసులను తొలిచేస్తోంది. "జాబ్ ఊడిపోతుందేమో" అనే నిరంతర భయం కన్నా జీతం కొంచెం తగ్గినా కన్నవారి సమక్షంలో.. సొంత గడ్డపై బతకడమే గొప్ప ఊరటనిస్తుందని చాలామంది భావిస్తున్నారు.

భారత్‌లోనూ సవాళ్లు, కొత్త పోటీలు ఉన్నప్పటికీ.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఫిన్‌టెక్, ఏఐ ఆధారిత సంస్థలు విదేశీ అనుభవం ఉన్న నిపుణులకు ఆశారేఖగా నిలుస్తున్నాయి. డాలర్ల సంపాదన కంటే కుటుంబంతో గడిపే ప్రశాంతమైన జీవితమే మిన్న అని టెకీలు గ్రహిస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగాల మార్పు కాదు.. విదేశీ భ్రమలు వీడి, ఆత్మీయతల వైపు సాగుతున్న ఒక భావోద్వేగ ప్రయాణం

Tags:    

Similar News