సుప్రీంకోర్టుకు వైసీపీ...నామినేషన్ల గడువు పొడిగిస్తారా ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ పీక్స్ మీద ఉంది. చాలా చోట్ల నామినేషన్లు వేయనీయలేదని వైసీపీ ఆరోపిస్తోంది.

Update: 2026-10-19 17:29 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ పీక్స్ మీద ఉంది. చాలా చోట్ల నామినేషన్లు వేయనీయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఇపుడు ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తడుతోంది. స్థానిక ఎన్నికలలో అధికార కూటమి అక్రమాలకు పాల్పడుతోంది అని అంటూ సుప్రీంకోర్టులో వైసీపీ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. అంతే కాదు ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుందని కూడా ఆరోపిస్తోంది. దాని వల్లనే తమ పార్టీకి చెందిన అభ్యర్థులు నామినేషన్లు సైతం దాఖలు చేసుకోలేకపోయారని ఆ పిటిషన్ లో వైసీపీ స్పష్టం చేసింది.

ఏకగ్రీవాలపైన స్టే :

అంతే కాదు ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఏకగ్రీవాల మీద స్టే ఇవ్వాలని కూడా వైసీపీ పిటిషన్ లో కోరింది. అలాగే నామినేషన్లు దాఖలు చేసే తమ పార్టీకి చెందిన అభ్యర్ధులకు పోలీసు రక్షణ కల్పించాలని కూడా పేర్కొంది. అదే విధంగా నామినేషన్ల పత్రాల స్వీకరణ కోసం ప్రత్యామ్నాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ ఈ నెల 21న విచారణకు రానుందని అంటున్నారు.

హైకోర్టులో కొట్టివేత :

ఇదిలా ఉంటే నామినేషన్ల గడువు పొడిగించాలని ఏపీ హైకోర్టులో వైసీపీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టేసింది. ఇపుడు ఇదే అంశంతో సుప్రీంకోర్టుకు వైసీపీ వెళ్తోంది. దీనికి హైకోర్టు చెప్పిన కారణం ఏమిటి అంటే ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని. దాంతో ఇపుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేశారు.

భారీ సీట్లలోనే అంటూ :

ఏపీలో చూస్తే 22 స్థానిక సంస్థల పరిధిలోని 488 స్థానాలలో భయాందోళనల వల్ల వైసీపీ నామినేషన్లు వేయలేకపోయిందని వైసీపీ పిటిషన్ లో పేర్కొంది. ఇక అధికార బలం ఉపయోగించి బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారని, అనేక చోట్ల తమ పార్టీ అభ్యర్ధుల మీద జరిగిన దాడుల కారణంగా ఏకగ్రీవంగా మారాయని సుప్రీంకోర్టు దృష్టికి వైసీపీ తీసుకుని వస్తోంది. ఇక అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ నుండి కౌంటింగ్ ముగిసే వరకు మొత్తం ప్రక్రియను నిరంతరాయంగా వీడియోగ్రఫీ చేయాలని కూడా వైసీపీ సుప్రీం కోర్టుని కోరింది.

అత్యున్నత న్యాయ స్థానంలో :

వైసీపీ ఇపుడు సుప్రీంకోర్టు మీద ఆశలు పెట్టుకుంది. అత్యున్నత న్యాయ స్థానంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తోంది. అయితే హైకోర్టులో చెప్పిన ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కోర్టుల జోక్యం ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. అందువల్ల నామినేషన్ల గడువు పొడిగించే విషయంలో సుప్రీం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆలోచించాలి. ఇక అభ్యర్ధులకు రక్షణ వంటి విషయాల మీద అయితే కోర్టు ఏమైనా సూచనలు ఇస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News