రూ.4.75 కోట్ల రోడ్డును ట్రాక్టర్ తో వైసీపీ నేతలు దున్నేశారు.. పవన్ సంచలన నిర్ణయం
చెమటోడ్చి పన్నులు కట్టే సామాన్యుడి సొమ్ముతో ఒక రహదారి పురుడుపోసుకుంటే.. దాని వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ, మరెన్నో గ్రామాల ఆశలు దాగి ఉంటాయి.
చెమటోడ్చి పన్నులు కట్టే సామాన్యుడి సొమ్ముతో ఒక రహదారి పురుడుపోసుకుంటే.. దాని వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ, మరెన్నో గ్రామాల ఆశలు దాగి ఉంటాయి. పల్లె ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని.. పొలానికి వెళ్లే రైతు.. బడికి వెళ్లే పిల్లవాడు ప్రశాంతంగా ప్రయాణిస్తారని ఆశపడ్డారు. కానీ ఆ సంతోషం వారం రోజులు కూడా నిలవలేదు. అధికార గర్వమో, స్వార్థమో తెలియదు కానీ.. నిర్మించిన కొద్ది రోజులకే ఆ రహదారిని వైసీపీ నేతలు దున్నేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో వెలుగుచూసిన ఈ ఘోరం ప్రతి పౌరుడి మనసును తీవ్రంగా కలచివేస్తోంది.
అనంతసముద్రం నుంచి పాపక్కగారిపల్లె వరకు 'పల్లె పండుగ' పథకం కింద రూ.4.75 కోట్ల వ్యయంతో ఎంతో నాణ్యతగా నిర్మించిన ఆ బీటీ రోడ్డు ఇప్పుడు అంతులేని ఆవేదనకు ప్రతీకగా మారింది. వైఎస్సార్సీపీకి చెందిన స్థానిక నాయకుడు సుబ్బారెడ్డి రోడ్డు తన వ్యవసాయ భూమికి సమీపంలో ఉందనే నెపంతో ట్రాక్టర్‌తో దాదాపు 100 మీటర్ల మేర దాన్ని దున్ని పడేసినట్లు ఆరోపణలు రావడం అత్యంత దిగ్భ్రాంతికరం. చట్టాన్ని, వ్యవస్థలను, ప్రజా ప్రయోజనాలను బొందపెట్టి.. ఒక వ్యక్తిగత అభ్యంతరం కోసం ప్రజల ఆస్తిని ఇలా చిత్తు చేయడం ఏ రకమైన కక్షసాధింపు? ఈ ఘాతుకంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సీనియర్ అధికారులతో సమీక్ష జరిపి చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. సదరు వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కేసు నమోదు చేసినప్పటికీ.. కూలిపోయిన ఆ రోడ్డును చూసి స్థానిక ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య నడిచే వివాదం కాదు.. ఇది కోట్ల మంది ప్రజాధనంపై జరిగిన దాడి.. ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసిన పన్నుల డబ్బుతో ఏర్పడిన ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ధ్వంసమైన ఆ 100 మీటర్ల రహదారి పునరుద్ధరణకు అయ్యే ప్రతి పైసానూ ఆ ధ్వంసం చేసిన వ్యక్తి నుంచే వసూలు చేయాలి. భవిష్యత్తులో ఏ ఒక్కరూ ప్రభుత్వ ఆస్తుల జోలికి రావడానికి భయపడేలా కఠినమైన శిక్షలు అమలు చేయాలి. ప్రజా ఆస్తులు ఏ ఒక్కరి సొంతం కావు.. అవి సమాజపు ఊపిరి.. ఆ ఊపిరిని తీసే హక్కు ఎవరికీ లేదు.