దేవుడు వర్సెస్ మనిషి !

దేవుడు అనే వాడు ఉన్నాడా. ఇది అతి తెలివి ఎక్కువగా ఉండి ఆలోచించే వారికి కలిగే నిత్య సందేహం.

Update: 2026-09-20 14:30 GMT

దేవుడు అనే వాడు ఉన్నాడా. ఇది అతి తెలివి ఎక్కువగా ఉండి ఆలోచించే వారికి కలిగే నిత్య సందేహం. వారికి దేవుడు అంటే భౌతిక రూపంలో కనిపించాలి. అన్ని వస్తువులు కళ్ళకు కనిపించినట్లుగా దేవుడు కూడా ఎదుట సాక్షాత్కరించాలి. అలా అయితేనే తప్ప నమ్మేది లేదు అంటారు వీరు. భౌతిక వాదాన్ని నమ్మే వీరికి దేవుడు లేడు అన్నది ప్రగాఢమైన ఆలోచన. అన్నీ కళ్ళ ముందు ఉన్నాయిగా. దేవుడు కూడా వాటి మాదిరిగా ఎందుకు కనిపించడు అని లాజిక్ పాయింట్ తో ఆస్తికులు అనబడే వారిని వీరు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దానికి ఆస్తికులు చెప్పే జవాబులు తర్కానికి అందకపోవడం వల్ల వీరిదే పైచేయి అనుకుంటారు.

సర్వాంతర్యామిగా :

అలాగని ఆస్తికులు చేసే వాదనలో తప్పు ఉందా అంటే అదీ ఎవరూ కాదనలేరు. దేవుడు ఉండకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తుంది అన్నది వారి మాట. దేవుడు అత్యంత శక్తిమంతుడు కాబట్టి ఒక్క చోట ఉండడని సర్వాంతర్యామి అని వీరు చెబుతారు. అసలు ఈ రోజుకీ ఎంతగానో అభివృద్ధి చెందినా ఈ ప్రపంచంలో ఇంకా తెలియని వింతలు విశేషాలూ అనేకం ఉన్నాయని అవన్నీ ఏమిటి అని ఆస్తికులు సూటిగానే ప్రశ్నిస్తారు. అందువల్ల దేవుడు ఉన్నాడు అని వారు బలంగా బల్ల గుద్ది మరీ చెబుతారు. పైగా మరో మాట అంటారు దేవుడు అందరి కంటే ఎక్కువ. ఆయన పై స్థాయిలో ఉంటాడు. ఆయన అందరి మాదిరిగా కంటికి కనిపించడు అని అంటారు. దేవుడిని చూడాలి అంటే సామాన్యుడి వల్ల కాదని దానికి సాధన ఒకటి చేయాలని కూడా వీరు గట్టిగా నొక్కి వక్కాణిస్తారు. ఈ చరాచర జగత్తు అంతా సాగేది ఎవరి వల్ల అంటే దేవుడి వల్లనే అని వీరు గట్టిగా వాదించి మరీ వివరిస్తారు.

యుగాల వాదన :

ఇలా దేవుడు ఉన్నారు అనే వారికి లేరు అనే వారికి మధ్య యుగాల బట్టి వాదన కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు ఇంతకీ ఉన్నాడా లేడా అన్నది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఉన్నారు అని నమ్మే సగటు జనాలు కూడా ఒక్కోసారి హేతుబద్ధమైన వాదన అని చెప్పే వారి వైపు చూస్తూంటారు. నిజమే కదా దేవుడు ఉంటే కంటికి కనిపించాలి కదా అని అనుకుంటారు. అలాగని వీరు నాస్తికులు కారు, ఆస్తికులే. కానీ సందేహాస్పదులు అన్న మాట. ఇలా దేవుడి విషయంలో లేరన్న వారు ఉన్నారని వాదించే వారు, ఉన్నారా లేరా అని అయోమయంలో పడేవారు వర్గాలుగా చీలి పోయి అందులో పడి కొట్టు మిట్టాడుతుంటారు.

మనుషులు చేసిన దేవుడు :

దేవుడిని మనిషి సృష్టించాడు అని మేధావులు కొందరు అంటారు. సమాజాన్ని కట్టుబాట్లలో ఉంచడానికి ఏదో ఒక భయాన్ని భక్తిని కలుగచేయడానికి ఈ విధంగా దేవుడి స్థానం రూపొందించబడింది అని వారు చెబుతారు. ముందు మనిషి ఆ తరువాతనే దేవుడు అన్నది వీరి నిశ్చితాభిప్రాయం. అంటే మనిషి పుట్టాక దేవుడు పుట్టాడని వీరు నమ్ముతారు. ఇక దేవుడే మనుషులను సృష్టించాడు అని ఎటూ ఆస్తిక జనం చెబుతూనే ఉంటుంది. ఎవరు ఎవరిని సృష్టించినా దేవుడు అన్నది మానసిక భావన అని మనిషి మాత్రమే ఊనికిలో ఉన్నాడు కదా అన్నది వీరి బలమైన థియరీ. ఇలా ఎడతెగని వాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. కాలగమనంలో మనిషి కొనసాగుతున్నాడు, దేవుడు మాత్రం యుగాలు గడుస్తున్నా ప్రత్యక్షం కావడం లేదు. దాంతో మనిషే శాశ్వతం అన్న వాదన బలపరచేవారు ఎక్కువ అవుతున్న నేపధ్యం కూడా ఉంది.

ఆ భావన మంచిదే :

దేవుడు అనేది మనిషి మంచి సమాజం కోసం బరితెగించకుండా ఉండే జీవన విధానం కోసం కట్టుబాట్ల కోసం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అని అనుకుంటే అందులో తప్పేముంది అన్నది కూడా మరో వాదన. సమాజం ఒక పద్ధతి ప్రకారం నడవాలి కదా. గుంపులుగా మారి సమూహాలుగా చేరి అశాంతికి అలజడికి కారణం అయి తమనే తాము చంపుకునే తీరుగా ఆటవిక విధానంగా సాగే దానిని అరికట్టి అడ్డు కట్ట వేసే ఒక ఆయుధం దేవుడు అన్న భావన అయితే అందులో తప్పేముంది అన్నది కూడా తర్కానికి దగ్గరగా ఉండే వాదన. దేవుడు ఉన్నాడు అన్న భయం ఉన్నపుడే ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. లేడు అని ఒక్కసారి ఫిక్స్ అయితే ఈ సమాజం బరితెగింపును ఎవరు ఆపగలరు అన్నది కూడా అతి పెద్ద ప్రశ్న. అందువల్ల దేవుడు ఉన్నాడు అన్న భావన మంచిదే అని అంటున్న వారు అధిక శాతం ఉన్నారు. పైగా దేవుడు అండ ఉంది అన్నది ఒక సానుకూల దృక్పథాన్ని కలిస్తూ జీవితంలో ఎదిగేందుకు దోహదపడినపుడు కష్టాలలో ఊరటను ఇచ్చే మానసిక ఓదార్పు అయినప్పుడు ఆ భావనను ఎందుకు కాదనాలి అన్నది కూడా ఉంది. అయితే దేవుడు పేరుతో చేసే అతి చేష్టలను దూరంగా ఉంచగలిగితేనే ఈ భావనకు ఒక అర్ధం పరమార్ధం చేకూరుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News