రూపాయి నోట్ల వెనుక దాగిన భారత హిస్టరీ.. చూశారా ఇది!
మనం రోజూ వస్తువులు కొనడానికి, ఎవరికైనా అవసరానికి లావాదేవీలు చేయడానికి మన వాలెట్‌లోని కరెన్సీ నోట్లను వాడుతూనే ఉంటాం.
మనం రోజూ వస్తువులు కొనడానికి, ఎవరికైనా అవసరానికి లావాదేవీలు చేయడానికి మన వాలెట్‌లోని కరెన్సీ నోట్లను వాడుతూనే ఉంటాం. కానీ, ఆ నోట్ల వెనుక వైపు ముద్రించిన చిత్రాలను ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా? మన చేతిలో ఉండే ప్రతీ నోటు వెనుక భారతదేశపు అద్భుతమైన చరిత్ర, కళలు, సంస్కృతి దాగి ఉన్నాయి. ప్రతిరోజూ మనం వాడే కరెన్సీ నోట్లలో దాగున్న ఆ ఆసక్తికరమైన హిస్టారికల్ ప్రదేశాల విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 500 నోటుపై ఎర్రకోట:
మన దేశంలో చలామణిలో ఉన్న అత్యంత పెద్ద నోటు రూ .500. ఈ నోటు వెనుక వైపు ఢిల్లీలోని చారిత్రాత్మక 'ఎర్రకోట' చిత్రం ఉంటుంది. ఇక ఎర్రకోట మన భారత స్వాతంత్ర్య పోరాటానికి, దేశ సార్వభౌమత్వానికి మరియు స్వేచ్ఛకు ఒక గొప్ప ప్రతీకగా నిలుస్తుంది.
రూ. 200 నోటుపై సాంచి స్థూపం:
రంగులమయంగా ఉండే రూ. 200 నోటు వెనుక వైపు మధ్యప్రదేశ్ లోని ప్రసిద్ధ 'సాంచి స్థూపం' బొమ్మ కనిపిస్తుంది. ఇది మన దేశంలోనే అతి పురాతనమైన రాతి నిర్మాణాల్లో ఒకటి. ఇక బౌద్ధ మత సంస్కృతికి, శాంతికి, భారతదేశపు ప్రాచీన జ్ఞానానికి ఇది చిరునామాగా నిలుస్తుంది.
రూ. 100 నోటుపై రాణీ కీ వావ్:
రూ .100 నోటు వెనుక వైపు గుజరాత్‌లోని పటాన్‌లో ఉన్న 'రాణీ కీ వావ్' అనే మెట్ల బావి దృశ్యం ఉంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ నిర్మాణం, ప్రాచీన కాలంలో భారతదేశంలో ఉన్న అద్భుతమైన శిల్పకళకు, నీటి సంరక్షణ పద్ధతులకు నిదర్శనం.
రూ. 50 నోటుపై హంపి రథం:
రూ .50 నోటు వెనుక వైపు కర్ణాటకలోని విజయనగర సామ్రాజ్య వైభవానికి గుర్తుగా ఉన్న 'హంపి శిల్ప రథం' ఉంటుంది. ఇది మన ప్రాచీన శిల్పుల నైపుణ్యాన్ని, నాటి కట్టడాల అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతుంది.
రూ. 20,రూ. 10 నోట్ల వెనుక చారిత్రక ప్రదేశాలు:
ఇక రూ. 20 నోటు వెనుక వైపు మహారాష్ట్రలోని ప్రసిద్ధ 'ఎల్లోరా గుహలు' ఉంటాయి. ఇవి భారతీయ సంస్కృతిలోని వైవిధ్యాన్ని, మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి. అలాగే రూ .10 నోటు వెనుక ఒడిశాలోని ఒరిజినల్ శిల్పకళకు ప్రతీక అయిన 'కోణార్క్ సూర్య దేవాలయం' రథచక్రం ముద్రించబడి ఉంటుంది.
మనం నిత్యం వాడే కరెన్సీ నోట్లు కేవలం కొనుగోళ్లకు మాత్రమే కాదు, మన దేశపు గొప్ప వారసత్వాన్ని గుర్తుచేసే హిస్టరీ బుక్స్ లాంటివి. ఇక ఈసారి మీ చేతికి రూపాయి నోటు వచ్చినప్పుడు, దాని వెనుక ఉన్న ఆనాటి శిల్పకళా వైభవాన్ని ఒకసారి గుర్తుచేసుకోవడం మర్చిపోకండి.