ఆర్కిటిక్ వ్యూహంలో 'ట్రంప్' మాస్టర్ మైండ్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా శాశ్వత పట్టు వెనుక అసలు కథ
గ్రీన్‌లాండ్ మంచు పొరల కింద అపారమైన సహజ వనరులతో పాటు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యంత అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లతో కుదుర్చుకున్న కీలక భద్రతా ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేస్తుందంటూ గతంలో వచ్చిన ప్రచారానికి స్వస్తి పలుకుతూ అక్కడ సైనిక భద్రతపై “శాశ్వత నియంత్రణ” సాధించడమే లక్ష్యంగా ఈ డీల్ ముందుకు సాగింది. అయితే ఇది భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కాదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లు తమ సార్వభౌమాధికారం పదిలంగానే ఉందని స్పష్టం చేశాయి. అసలు మంచు కొండల మధ్య ఉన్న గ్రీన్‌లాండ్‌పై అగ్రరాజ్యం ఎందుకింత ఆసక్తి చూపుతోంది? ఈ కొత్త ఒప్పందం వెనుక అమెరికా అసలు వ్యూహాలేంటి? అన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వ్యూహాత్మక భౌగోళిక స్థానం
ఉత్తర అమెరికా, యూరప్‌ల మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో విస్తరించి ఉన్న గ్రీన్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ , ఆర్కిటిక్ సముద్ర మార్గాలపై నిఘా ఉంచడానికి అత్యంత అనుకూలమైన కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్ మంచు కరుగుతుండటంతో కొత్త వ్యాపార, నౌకా రవాణా మార్గాలు సుగమమవుతున్నాయి. ఈ మార్గాలపై పట్టు సాధించడం అమెరికాకు అత్యంత కీలకంగా మారింది.
రష్యా, చైనాలకు చెక్ పెట్టే వ్యూహం
ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాలు తమ సైనిక, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. ప్రత్యర్థి దేశాలు గ్రీన్‌లాండ్‌లో స్థావరాలు ఏర్పాటు చేయకుండా నిరోధించడం.. కీలక రంగాల్లో వారి పెట్టుబడులను అడ్డుకోవడం అమెరికా ప్రధాన లక్ష్యం. అమెరికా ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్ ద్వారా క్షిపణి రక్షణ, అంతరిక్ష నిఘా సేవలను నిర్వహిస్తోంది. తాజా ఒప్పందంతో అక్కడ తన సైనిక బలగాలను మరింత బలోపేతం చేయనుంది.
లభ్యం కాని సహజ వనరులు.. అరుదైన ఖనిజాలు
గ్రీన్‌లాండ్ మంచు పొరల కింద అపారమైన సహజ వనరులతో పాటు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యంత అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భవిష్యత్తులో వీటికి ఉండే డిమాండ్ దృష్ట్యా ఈ ఖనిజ సంపదపై పట్టు సాధించడం అమెరికా ఆర్థిక, పారిశ్రామిక ప్రయోజనాలకు అత్యవసరం.
కొనుగోలు కాదు... సుదీర్ఘ కాలపు పట్టు
సార్వభౌమాధికారం గ్రీన్‌లాండ్‌దేనని దాని అదుపులో ఉన్న దేశం గ్రీన్ లాండ్ స్పష్టం చేసింది. ట్రంప్ "శాశ్వత నియంత్రణ" అనే పదాన్ని వాడినప్పటికీ ఇది భూభాగ కొనుగోలు కాదని డెన్మార్క్ పార్లమెంట్ స్పష్టం చేసింది. గ్రీన్‌లాండ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం యథాతథంగా కొనసాగుతాయి.
ఒకవేళ భవిష్యత్తులో గ్రీన్‌లాండ్, డెన్మార్క్ నుండి పూర్తి స్వాతంత్ర్యం పొందినా అమెరికా సైనిక ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేలా ఈ ఒప్పందానికి రూపకల్పన చేసినట్లు వ్యూహాత్మక విశ్లేషకులు భావిస్తున్నారు.
తుది ఆమోదం ఇంకా బాకీనే..
ఈ ఒప్పందంపై తుది నిర్ణయం జరగాలంటే డెన్మార్క్, గ్రీన్‌లాండ్ పార్లమెంట్ల నుంచి చట్టపరమైన ఆమోదం లభించాల్సి ఉంది. అమెరికా లక్ష్యం గ్రీన్‌లాండ్‌ను తన దేశంలో కలుపుకోవడం కాదు.. ఆర్కిటిక్ ప్రాంతంలో తన దీర్ఘకాలిక సైనిక, వ్యూహాత్మక ప్రాబల్యాన్ని స్థిరపరచుకోవడమేనని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.